యాషెస్ సిరీస్‌లో ఇంగ్లండ్ శుభారంభం చేయలేకపోయింది. శనివారం ముగిసిన తొలి టెస్ట్‌లో ఆతిథ్య ఆస్ట్రేలియా 8 వికెట్ల తేడాతో ఇంగ్లండ్‌ను చిత్తు చేసింది. ట్రావిస్ హెడ్ విధ్వంసకర శతకంతో ఇంగ్లండ్ ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. ఈ ఓటమితో ఐదు టెస్ట్‌ల యాషెస్ సిరీస్‌లో ఇంగ్లండ్ 0-1తో వెనుకంజలో నిలిచింది. ఈ పరాజయంపై ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ జాఫ్రీ బాయ్‌కాట్ ఆగ్రహం వ్యక్తం చేశాడు.
తెలివి తక్కువ పనులతోనే ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ ఓడిపోయిందని విమర్శించాడు. బాజ్ బాల్ గేమ్ విధానమే సరికాదని, ఈ పద్దతితో మ్యాచ్ గెలవడం కష్టమని అభిప్రాయపడ్డాడు. ఓ దిన పత్రికకు రాసిన కాలమ్‌లో ఇంగ్లండ్ జట్టు పదే పదే తప్పులను పునరావృతం చేస్తుందని, ఇలానే కొనసాగితే భవిష్యత్తులో ఆ జట్టును ఎవరూ పట్టించుకోరని హెచ్చరించాడు.

'ఇంగ్లండ్ జట్టు అవే తెలివి తక్కువ పనులు చేస్తూ టెస్ట్‌ల్లో పరాజయాలను ఎదుర్కొంటుంది. ఇది ఇలానే కొనసాగితే ఇంగ్లండ్ జట్టును ఎవరూ సీరియస్‌గా తీసుకోరు. ఈ మ్యాచ్‌లో బెన్ డకెట్ మంచి బంతికి ఔటయ్యాడు. కానీ పోప్ ఈ మ్యాచ్‌లో చెత్త బంతికి ఔటయ్యాడు. ఆఫ్ స్టంప్‌కి దూరంగా వచ్చిన బంతిని డ్రైవ్ చేయబోయి మూల్యం చెల్లించుకున్నాడు. ఔట్ చేసేందుకు వేసిన వల అని అతనికి తెలియదా? ఇంత తెలివి తక్కువగా ఎలా ఆడుతారు..?
ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ ఒక్కసారిగా వెనుకపడిపోయింది. ఒక కప్పు టీ తయారు చేసే సమయంలోనే మూమెంటమ్ ఆస్ట్రేలియా వైపు మళ్లింది. ట్రావిస్ హెడ్ ఒక్కసారిగా మ్యాచ్ స్వరూపాన్ని మార్చేసాడు. దాంతో ఇంగ్లండ్ కూడా పట్టు కోల్పోయింది. పదే పదే బౌన్సర్లతో వేయడానికి మొగ్గు చూపింది. మ్యాచ్‌లో క్లిష్ట పరిస్థితులు ఎదురైనప్పుడు బ్యాటర్లు, బౌలర్లు కాస్త ఓపికగా ఆలోచించాలి.
దురదృష్టవశాత్తు ఇంగ్లండ్ ఆటగాళ్లు అలా చేయలేకపోయారు. వారికి ఒకే ఒక్క పద్దతి తెలుసు. బాజ్ బాల్ గేమ్ సరికాదు. ఇది అత్యుత్సాహమే. ఈ పద్దతిన మ్యాచ్‌లు గెలవడం చాలా కష్టం. భారత్, ఆస్ట్రేలియా వంటి అగ్రశ్రేణి జట్లపై ఓడిపోవడానికి ఇదే అతిపెద్ద కారణం.'అని జాఫ్రీ బాయ్‌కాట్ అభిప్రాయపడ్డాడు.