ఐపీఎల్ 2026 సీజన్‌లో పంజాబ్ కింగ్స్ జైత్రయాత్ర కొనసాగుతోంది. ఓటమెరుగని జట్టుగా ఆరో విజయాన్ని కైవసం చేసుకుంది. శనివారం న్యూఢిల్లీ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. 265 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించి ఈ ఘనత సాధించిన తొలి ఐపీఎల్ జట్టుగా చరిత్ర సృష్టించింది. టీ20 క్రికెట్ చరిత్రలోనే ఏ జట్టు కూడా ఇంత పెద్ద లక్ష్యాన్ని ఛేదించలేదు. చెత్త ఫీల్డింగ్ ఢిల్లీ క్యాపిటల్స్ కొంపముంచగా.. పంజాబ్ కింగ్స్‌కు కలిసొచ్చింది.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్లకు 264 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్(67 బంతుల్లో 16 ఫోర్లు, 9 సిక్స్‌లతో 152 నాటౌట్) అజేయ శతకంతో రాణించగా.. నితీష్ రాణా(44 బంతుల్లో 11 ఫోర్లు, 4 సిక్స్‌లతో 91) తృటిలో శతకాన్ని చేజార్చుకున్నాడు. పంజాబ్ బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్, జేవియర్ బార్ట్‌లెట్ ఒక వికెట్ పడగొట్టాడు.

అనంతరం పంజాబ్ కింగ్స్ 18.5 ఓవర్లలో 265 పరుగులు చేసి గెలుపొందింది. ప్రభ్‌సిమ్రాన్ సింగ్(26 బంతుల్లో 9 ఫోర్లు, 5 సిక్స్‌లతో 76), ప్రియాన్ష్ ఆర్య(17 బంతుల్లో 2 ఫోర్లు, 5 సిక్స్‌లతో 43), శ్రేయస్ అయ్యర్(36 బంతుల్లో 3 ఫోర్లు, 7 సిక్స్‌లతో 71 నాటౌట్) విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగారు. ఢిల్లీ బౌలర్లలో కుల్దీప్ యాదవ్(2/46) రెండు వికెట్లు తీయగా.. అక్షర్ పటేల్, విప్రజ్ నిగమ్ తలో వికెట్ తీసారు.
28, 35 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద శ్రేయస్ అయ్యర్ ఇచ్చిన రెండు సునాయస క్యాచ్‌లను కరుణ్ నాయర్ నేలపాలు చేశాడు. విప్రజ్ నిగమ్ బౌలింగ్‌లో ఒకటి కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో మరో క్యాచ్‌ను కరుణ్ నాయర్ అందుకోలేకపోయాడు. ఈ అవకాశాలతో చెలరేగిన శ్రేయస్ అయ్యర్.. పంజాబ్ కింగ్స్ విజయలాంఛనాన్ని పూర్తి చేశాడు.
ఇన్నింగ్స్ ఆరంభంలో ప్రియాన్ష్ ఆర్య ఇచ్చిన క్యాచ్‌ను లుంగి ఎంగిడి నేలపాలు చేశాడు. ఈ క్యాచ్ అందుకునే క్రమంలో అతను తీవ్రంగా గాయపడి మ్యాచ్‌కు దూరమయ్యాడు. క్యాచ్‌తో పాటు అతని గైర్హాజరీ ఢిల్లీ క్యాపిటల్స్ విజయవకాశాలను దెబ్బతీసింది. అక్షర్ పటేల్ వేసిన 9వ ఓవర్‌లో కూపర్ కానల్లీ ఇచ్చిన క్యాచ్‌ను ముఖేష్ కుమార్ అందుకొని బౌండరీ లైన్ తాకాడు. దాంతో ఈ క్యాచ్ కాస్త సిక్సర్‌గా మారింది.
ఓవరాల్‌గా నాలుగు క్యాచ్ డ్రాప్స్ ఢిల్లీ క్యాపిటల్స్ పతనాన్ని శాసించాయి. లుంగి ఎంగిడి గాయపడకపోయినా ఫలితం మరోలా ఉండేది. కట్టడిగా బౌలింగ్ చేయడంలో ఎంగిడి దిట్ట. కానీ తీవ్రమైన గాయంతో అతను మైదానం వీడాల్సి వచ్చింది.