అతని వల్లే ఈ జీవితం మారిపోయింది:ప్రఫుల్ హింగే
సన్‌రైజర్స్ హైదరాబాద్(SRH) బౌలింగ్ కోచ్ వరుణ్ ఆరోన్ వల్లే తన జీవితం పూర్తిగా మారిపోయిందని ఆ జట్టు యువ పేసర్ ప్రఫుల్ హింగే అన్నాడు. వరుణ్ ఆరోన్ అందించిన ప్రోత్సాహంతోనే ఐపీఎల్ ఆడే స్థాయికి చేరుకున్నానని వెల్లడించాడు.
ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌తో ఈ క్యాచ్ రిచ్ లీగ్‌లోకి అరంగేట్రం చేసిన ప్రఫుల్ హింగే ఫస్ట్ మ్యాచ్ తొలి ఓవర్‌లోనే మూడు వికెట్లు తీసాడు. అరంగేట్ర ఓవర్‌లోనే మూడు వికెట్లు తీసిన తొలి బౌలర్‌గా చరిత్ర సృష్టించాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ఓ అసెట్‌గా మారాడు. తాజాగా అధికారిక బ్రాడ్‌కాస్టర్‌తో మాట్లాడిన ప్రఫుల్ హింగే.. వరుణ్ ఆరోన్‌తో పాటు ఎమ్ఆర్‌ఎఫ్ పేస్ ఫౌండేషన్‌తో తన బౌలింగ్ మెరుగైందని చెప్పుకొచ్చాడు.

'తీవ్ర గాయం కావడంతో చాలా ఆందోళనకు గురయ్యా. ఏం చేయాలో కూడా నాకు తోచలేదు. ఒకస్కారిగా చీకటి ఆవహించినట్లు అనిపించింది. ఎక్కడికీ వెళ్లలేకపోయా. కనీసం నడవలేకపోయా. కొన్ని రోజుల తర్వాత.. ఈ ఖాళీ సమయాన్ని సాధ్యమైనంతవరకూ సద్వినియోగం చేసుకోవాలని భావించా. ఎప్పుడైతే టీమిండియా మాజీ పేసర్ వరుణ్ ఆరోన్‌ను కలిసానో..నా జీవితంలో చాలా మార్పులు వచ్చాయి.
ఇలాంటి పరిస్థితి ఎదుర్కొన్నట్లే ఆయన నన్ను మోటివేట్ చేశారు. కొన్నాళ్లు హాయిగా విశ్రాంతి తీసుకో.. ఆటను చూస్తూ ఆస్వాదించు అని చెప్పారు. అప్పుడు నాలో ఆత్మవిశ్వాసం పెరిగింది. గాయం నుంచి కోలుకున్నాక.. కఠినంగా శ్రమించడంపై దృష్టి పెట్టా. ఎమ్ఆర్‌ఎఫ్ అకాడమీలో వివిధ రాష్ట్రల నుంచి వచ్చిన బౌలర్లతో కలిసి ఆడే అవకాశం వచ్చింది. నా ఆట స్థాయి ఏంటి? నేను ఎక్కడ మెరుగుకావాలనే దానిపై ఓ అవగాహన వచ్చింది. ఆస్ట్రేలియాకు వెళ్లడమూ సాయపడింది. అక్కడి భిన్నమైన పిచ్‌లపై ఎలా బౌలింగ్ చేయాలో అనుభవం వచ్చింది. చాలా విలువైన అనుభవం అది.
రెడ్ బాల్‌తో ఆడటం నాకు కలిసొచ్చింది. ఓపికగా, లైన్ అండ్ లెంగ్త్‌కు కట్టుబడి నిలకడగా ఎలా బౌలింగ్ చేయొచ్చనేది ఇక్కడ అలవడుతుంది. కొత్త బంతితో బ్యాటర్లకు పరీక్ష పెట్టడమే నా ప్రణాళిక. సుదీర్ఘ ఫార్మాట్‌లో నేను అనుసరించే ప్రాథమిక సూత్రమదే. దానినే టీ20ల్లోనూ అమలుచేస్తుంటా.
సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున దూకుడుగా ఆడే బ్యాటర్లు ఉన్నారు. నెట్స్‌లో వారికి బౌలింగ్ చేయడం కూడా కలిసొచ్చింది. హార్డ్ హిట్టర్లు ఎలా షాట్లు కొట్టేందుకు ప్రయత్నిస్తారన దానిపై అవగాహన వచ్చింది. ఇప్పుడు మా లక్ష్యం ట్రోఫీని నెగ్గడం. అందుకోసం మరీ ఎక్కువగా ఆలోచించడం లేదు. ఒక్కో మ్యాచ్‌లో గెలుపుపై ఫోకస్ పెడుతున్నాం. నాణ్యమైన ప్రదర్శనతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించడమే నా వంతు'అని ప్రఫుల్ హింగే తెలిపాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications