కేఎల్ రాహులే కొట్టినప్పుడు మేం కొట్టలేమా అనిపించింది: శ్రేయస్ అయ్యర్
ఢిల్లీ క్యాపిటల్స్ ఓపెనర్ కేఎల్ రాహుల్‌పై పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ప్రశంసల జల్లు కురిపించాడు. రాహుల్ బ్యాటింగ్ చూడ ముచ్చటగా ఉందని కొనియాడాడు. అయితే రాహులే ఈజీగా షాట్స్ ఆడినప్పుడు తాము కూడా ఆడగలమనే నమ్మకం కలిగిందన్నాడు. దాంతోనే ఢిల్లీ క్యాపిటల్స్ ఎంత స్కోర్ చేసినా.. తాము ఒక పరుగు ఎక్కువే చేయాలని మనసులో గట్టిగా అనుకున్నానని అయ్యర్ చెప్పాడు.
ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో శనివారం జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 265 పరుగుల లక్ష్యాన్ని ఛేదించి ఈ ఘనత సాధించిన తొలి ఐపీఎల్ టీమ్‌గా చరిత్ర సృష్టించింది. ఈ విజయానంతరం మాట్లాడిన శ్రేయస్ అయ్యర్.. ఈ రికార్డ్ విజయంపై సంతోషం వ్యక్తం చేశాడు.
పిచ్చ కోపం వచ్చింది..
'నిజం చెప్పాలంటే.. ఈ మ్యాచ్ గురించి మాట్లాడేందుకు నా దగ్గర మాటలు లేవు. ఇక్కడ ఎండ తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. దానికి తోడు బౌలర్లు ఫోర్లు, సిక్సర్లు ఇస్తుంటే పిచ్చ కోపం వచ్చింది. ఏం చేయాలో అర్థం కాలేదు. కానీ ఇది బ్యాటింగ్‌కు అనుకూలమైన వికెట్ అని తెలుసు. వాస్తవానికి ఈ పిచ్‌పై టర్న్ లభిస్తుందని అనుకున్నాం. కానీ ఇక్కడ స్పిన్‌కు పెద్దగా అవకాశం లేదు.
పవర్‌ప్లే తర్వాత చాహల్ బౌలింగ్ చేసినప్పుడు బంతి కొంచెం ఆగుతూ వచ్చింది. కానీ పెద్దగా ప్రభావం చూపలేదు. ఇక కేఎల్ రాహుల్‌ను అభినందించాలి. అతను ఆడిన తీరు అద్భుతం. అతని బ్యాటింగ్ చూడముచ్చటగా ఉంది.

రాహులే ఆడినప్పుడు..
అయితే వాళ్ళు ఎంత స్కోరు చేసినా సరే.. విజయం సాధించాలని నా మనసులో గట్టిగా అనుకున్నాను. నిజాయితీగా చెప్పాలంటే నా మైండ్‌సెట్ ఇలానే ఉంటుంది. ఎందుకంటే బౌలర్లు వేసే ప్రతి బంతిని రాహుల్ ఎంతో చాకచక్యంగా ఆడుతూ అందమైన షాట్లు కొట్టాడు. అతను చాలా ఈజీగా పరుగులు చేశాడు. అతనే ఈజీగా ఆడినప్పుడు మేం కూడా ఆడగలమని నాకు నేను చెప్పుకున్నా.
లక్ష్య ఛేదనకు ముందు మా వాళ్లకు నేను ఒకటే చెప్పా. గత మ్యాచ్‌ల్లో కూడా 220-225 పరుగుల లక్ష్యాలను రెండు ఓవర్లు మిగిలి ఉండగానే ఛేదించాం. కాబట్టి అదే మైండ్‌సెట్‌తో ఆడుదామని చెప్పా. పవర్‌ప్లేలో వీలైనన్ని ఎక్కువ పరుగులు చేయాలనుకున్నాం. మా ఓపెనర్లు తొలి బంతి నుంచే రెచ్చిపోయి ఆడి మాకు మంచి పునాది వేశారు. ఆ జోరును మేం కొనసాగించాలనుకున్నాం.
మేం రిలాక్స్ అవుతాం..
మా తప్పిదాల గురించి తర్వాత చర్చిస్తాం. మేం కాసేపు విశ్రాంతి తీసుకుని సరదాగా గడపాలనుకుంటున్నాం. ఎందుకంటే గత మూడు రోజులుగా ఎండలో చాలా కష్టపడి ప్రాక్టీస్ చేశాం. మ్యాచ్ కూడా తీవ్రమైన ఎండలోనే ఆడాం. కాబట్టి కొంచెం రిలాక్స్ అయ్యి, ఎల్లుండి మళ్లీ కొత్త ఉత్సాహంతో సమావేశం అవుతాం. అప్పుడు తిరిగి ప్రణాళికలు రచిస్తాం. భవిష్యత్తులో మేం ఎదుర్కోబోయే ప్రత్యర్థులకు వ్యతిరేకంగా మరింత బలంగా ఎలా తిరిగి రావాలో చర్చించుకుంటాం.'అని శ్రేయస్ అయ్యర్ చెప్పుకొచ్చాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications