న్యూఢిల్లీ: రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(డబ్ల్యూఎఫ్‌ఐ) అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్, కోచ్‌లు తమను వేధిస్తున్నారని భారత స్టార్ రెజ్లర్లు వినేశ్ ఫొగాట్, భజరంగ్ పునియాతో పాటు ఇతర రెజ్లర్లు ధర్నాకు దిగారు. డబ్ల్యూఎఫ్‌ఐ అధ్యక్ష పదవి నుంచి బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌ను వెంటనే తప్పించాలని ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద బుధవారం ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన వినేశ్ ఫొగాట్ డబ్ల్యూఎఫ్ఐ చీఫ్‌పై సంచలన ఆరోపణలు చేసింది. మహిళా రెజ్లర్లను కోచ్‌లతో పాటు డబ్ల్యూఎఫ్‌ఐ చీఫ్ లైంగికంగా వేధిస్తున్నారని, బ్రిజ్ భూషణ్ వల్ల తాను ఓసారి ఆత్మహత్య చేసుకోవాలనుకున్నానని తెలిపింది.
'మహిళా రెజ్లర్లను బ్రిజ్ భూషణ్, జాతీయ కోచ్‌లు లైంగికంగా వేధించారు. నన్ను ఎందుకూ పనికిరావని బూతులు తిట్టారు. బ్రిజ్ భూషణ్ వేధింపుల వల్ల నేను ఎంతో మానసిక క్షోభకు గురయ్యా. అతని టార్చర్ తట్టుకోలేక.. ఓసారి ఆత్మహత్య కూడా చేసుకోవాలనుకున్నా. మా గాయాల గురించి ఎవరూ పట్టించుకోరు. ఆయనపై ఫిర్యాదు చేసినందుకు గతంలో నన్ను చంపేస్తానంటూ బెదిరింపులు కూడా వచ్చాయి'అని వినేశ్ ఫొగాట్ కన్నీటి పర్యంతమైంది.
రెజ్లర్లకు కనీస గౌరవం ఇవ్వకుండా తిట్టడంతో పాటు కొట్టేవారని మరో స్టార్ రెజ్లర్ భజరంగ్ పూనియా ఆరోపించాడు.ఫెడరేషన్‌లో ఉన్నవారికి ఆట గురించి ఏ మాత్రం తెలియదన్నాడు. రెజ్లర్లను వారు చాలా వేధిస్తున్నారని, బ్రిజ్ భూషణ్ తమను తిట్టడంతో పాటు చేయి కూడా చేసుకునేవాడని ఆవేదన వ్యక్తం చేశాడు. తమ పోరాటం ప్రభుత్వం, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాపై కాదని, కేవలం రెజ్లింగ్ ఫెడరేషన్‌పైన మాత్రమేనని స్పష్టం చేశాడు. ఈ ఆందోళనలో పూనియా, ఫొగాట్, సాక్షిమాలిక్, సంగీతా ఫొగాట్, సుమిత్ మాలిక్, సరితా మోర్ సహా 30 మంది స్టార్ రెజ్లర్లు పాల్గొన్నారు. బ్రిజ్ భూషణ్‌ను అధ్యక్ష పదవి నుంచి తొలగించేవరకు తాము ధర్నా కొనసాగిస్తామని స్పష్టం చేశారు. అప్పటిదాకా ఏ అంతర్జాతీయ పోటీల్లోనూ తాము పాల్గొనబోమని హెచ్చరించారు.
రెజర్లు చేసిన ఆరోపణలను బ్రిజ్ భూషణ్ ఖండించారు. తనపై ఓ పెద్ద పారిశ్రామిక చేస్తున్న కుట్రని, లైంగికంగా వేధించారని నిరూపిస్తే ఊరేసుకుంటానని తెలిపాడు. రెజ్లింగ్ అధ్యక్ష పదవికి మాత్రం రాజీనామా చేయబోనని స్పష్టంచేశారు. 2011 నుంచి బ్రిజ్ భూషణ్ రెజ్లింగ్ ఫెడరేషన్ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. 2019లో వరుసగా మూడోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. బీజేపీ ఎంపీ అయిన భూషణ్.. ఉత్తరప్రదేశ్‌లోని కైసర్‌గంజ్ లోక్‌సభ స్థానానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.