న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Bhavina Patel: పారాలింపిక్స్‌లో భారత్‌కు రజత పతకాన్ని అందించిన ధీరవనిత

Tokyo Paralympics: Bhavina Patel loses to Chinese Zhou Ying in Gold medal match in Table Tennis

టోక్యో: కొద్దిరోజుల కిందటే జపాన్ రాజధాని టోక్యో వేదికగా ముగిసిన ఒలింపిక్స్ 2020లో భారత్ పతకాల పంటను పండించింది. ఇదివరకెప్పుడూ లేనివిధంగా ఏడు పతకాలను అందుకుంది. చిరకాల స్వప్నంగా ఊరిస్తూ వచ్చిన బంగారు పతకం కూడా ఒకటి. ఒక స్వర్ణం, రెండు రజతం, నాలుగు కాంస్య పతకాలతో టోక్యో ఒలింపిక్స్‌ను విజయవంతంగా ముగించుకుంది.. భారత్. అదే టోక్యో వేదికగా కొనసాగుతోన్న పారాలింపిక్స్‌లోనూ భారత్ దూకుడును ప్రదర్శించింది. రజత పతకాన్ని అందుకుంది.

తృటిలో చేజారిన స్వర్ణం..

తృటిలో చేజారిన స్వర్ణం..

మహిళల టేబుల్ టెన్నిస్ విభాగం సింగిల్స్ క్లాస్ 4కు ప్రాతినిథ్యాన్ని వహించిన భవీన పటేల్.. దేశానికి రజత పతకాన్ని అందించారు. టోక్యోలో కొద్దిసేపటి కిందటే ముగిసిన ఫైనల్స్‌లో ఆమె ఓడిపోయారు. చైనాకు చెందిన యింగ్ ఝౌ చేతిలో 7-11, 5-11, 6-11 స్కోర్ తేడాతో పరాజయం పొందారు. దీనితో స్వర్ణ పతకాన్ని అందుకునే అవకాశాన్ని తృటిలో కోల్పోయారు. ఈ కేటగిరిలో రన్నరప్‌గా నిలిచారు. రెండో స్థానంతో రజత పతకాన్ని అందుకున్నారు.

పారాలింపిక్స్‌లో రజతం..

పారాలింపిక్స్‌లో రజతం..

భవిన పటేల్.. పూర్తిపేరు భవినబెన్ హస్‌ముఖ్‌భాయ్ పటేల్. స్వరాష్ట్రం గుజరాత్. వీల్‌ఛైర్‌కే పరిమితమైన భవినా పటేల్.. తాను దివ్యాంగురాలిననే ఆలోచనే రానివ్వలేదు. టేబుల్ టెన్నిస్‌పై ఆసక్తి పెంచుకున్నారు. ఈ కేటగిరలో జాతీయ, అంతర్జాతీయ టోర్నమెంట్లలో పాల్గొన్నారు. స్పోర్ట్స్ ఈవెంట్లన్నింటిలో అత్యున్నతమైన పారాలింపిక్స్‌లో దేశానికి రజత పతకాన్ని అందించారు. మహిళల టేబుల్ టెన్నిస్ సింగిల్స్ కేటగిరీలో ఆమె ఈ ఘనతను సాధించారు.

పోరాడి ఓడి..

భారత కాలమానం ప్రకారం.. ఈ ఉదయం 7:15 నిమిషాలకు ఈ కేటగిరీలో ఫైనల్స్ మ్యాచ్ ఆరంభమైంది. చైనాకు చెందిన యింగ్ ఝౌను భవిన పటేల్ ఎదుర్కొన్నారు. పసిడిని ముద్దాడే అవకాశం ఉన్న మ్యాచ్ కావడంతో రెట్టింపు ఉత్సాహంతో కనిపించారు భవీన పటేల్. అదే దూకుడుతో మ్యాచ్ ఆరంభించారు. తొలి పాయింట్లను అందుకున్నారు. ఆ కొద్దిసేపటికే ఆమె ప్రత్యర్థి యింగ్ ఝౌ అనూహ్యంగా పుంజుకున్నారు. భవిన పటేల్‌కు గట్టిపోటీ ఇచ్చారు. క్రమంగా ఆధిక్యతలోకి దూసుకెళ్లారు.

ఒత్తిడిని జయించలేక..

తొలి సెట్‌ను యింగ్ ఝౌ 11-7 స్కోరు తేడాతో గెలుచుకున్నారు. ఆ తరువాత రెండో సెట్‌లోనూ భవిన పటేల్-యింగ్ మధ్య హోరాహోరిగా పోరు సాగింది. ఒకదశలో 4-4 పాయింట్లతో సమవుజ్జీలుగా నిలిచారు. ఆ తరువాత.. భవీన ఒత్తిడికి లోనయ్యారు. తడబడ్డారు. కొన్ని పొరపాట్లు చేశారు. వాటిని సద్వినియోగం చేసుకున్నారు యింగ్ ఝౌ. రెండో సెట్‌ను 11-5 తేడాతో గెలుచుకున్నారు. నిర్ణయాత్మక మూడో సెట్‌ ఆరంభంలో భవిన పటేల్ ఎదురుదాడికి దిగారు. ఒక దశలో యింగ్‌పై భారీ ఆధిక్యతను ప్రదర్శించారు.

రన్నరప్‌గా

ఆ ఆధిపత్యం ఎంతో సేపు నిలవలేదు. యింగ్ ఝౌ కొన్ని అరుదైన షాట్లను ఆడారు. వాటికి భవీన పటేల్ వద్ద సమాధానం లేకపోయింది. చివరి వరకూ పోరాడినప్పటికీ.. ఫలితం దక్కలేదు. తన పైచేయిని చివరివరకూ కొనసాగించడంలో యింగ్ ఝౌ సక్సెస్ అయ్యారు. తడబాటును ప్రదర్శించలేదు. దీనితో మూడో సెట్‌లో భవీనాపై 6-11 స్కోర్ తేడాతో ఆధిక్యతలోకి దూసుకెళ్లారు. మూడు వరుస సెట్లలో భవీన పటేల్ ఓటమిని చవి చూశారు. ఫైనల్స్‌లో రన్నరప్‌గా నిలవడం వల్ల రజత పతకాన్ని అందుకున్నారు. త్రివర్ణ పతకాన్ని సగర్వంగా రెపరెపలాడించారు.

ఆనందోత్సాహాలు..

ఆమె సాధించిన ఈ విజయం పట్ల సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమౌతోన్నాయి. ఒలింపిక్స్ క్రీడాకారులకు ధీటుగా నిలిచారని, కోట్లాదిమంది యువతకు స్ఫూర్తినింపారంటూ నెటిజన్లు, ట్విట్టరెటీలు ఆమెను ప్రశంసలతో ముంచెత్తుతోన్నారు. టోక్యో పారాలింపిక్స్‌లో పాల్గొన్న తోటి క్రీడాకారుల్లో పతకాన్ని గెలవాలనే కాంక్షను రగిలించారంటూ అభినందిస్తోన్నారు. పలువురు ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా భవిన పటేల్‌కు శుభాకాంక్షలను తెలుపుతున్నారు. భవిన పటేల్ స్వస్థలం గుజరాత్‌లోని మెహసానాలో పండుగ వాతావరణం నెలకొంది. బాణాసంచా కాలుస్తూ తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తోన్నారు కుటుంబీకులు.

Story first published: Sunday, August 29, 2021, 8:44 [IST]
Other articles published on Aug 29, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X