మార్గావో: 114 మ్యాచ్‌లు, 295 గోల్స్, 87,811 పాసెస్, 7307 ట్యాకిల్స్ అనంతరం ఇండియన్ సూపర్ లీగ్(ఐఎస్‌ఎల్) ఏడో సీజన్ తుది దశకు చేరకుంది. టైటిల్ కోసం జరిగే ఆఖరాటకు వేళయింది. అద్భుత ఆటతో ఫైనల్‌కు దూసుకొచ్చిన ముంబై సిటీ ఎఫ్‌సీ, ఏటీకే మోహన్ బగాన్ శనివారం జరిగే ఫైనల్లో అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఈ రెండు టీమ్స్ లీగ్ స్టేజ్‌లో చెరో 12 విజయాలు సాధించి.. కేవలం నాలుగేసి ఓటములే ఎదుర్కొన్నాయి.
సెమీఫైనల్లో నరాలు తెగే ఉత్కంఠ నడుమ జరిగిన పెనాల్టీ షూటౌట్‌లో ఎఫ్‌సీ గోవాను ఓడించి ఫైనల్‌కు వచ్చినప్పటికీ ముంబై పూర్తి విశ్వాసంతో ఉంది. లీగ్ స్టేజ్‌లో ఏటీకే మోహన్ బగాన్‌పై రెండుసార్లు పై చేయి సాధించింది. దాంతో లీగ్ విన్నర్స్ షీల్డ్ గెలిచిన ఆ జట్టు అదే ఊపును కొనసాగిస్తూ ఫస్ట్ టైమ్ ఫైనల్లో అడుగుపెట్టింది. ముంబైని మూడో సారి ఓడించి తొలి టైటిల్ అందుకోవాలని చూస్తోంది. అయితే పేరు మార్చుకొని ఈ సీజన్‌లో బరిలోకి దిగిన డిఫెండింగ్ చాంప్ ఏటీకే అంచనాలను అందుకుంటూ ముందుకొచ్చింది.
నాకౌట్ గేమ్స్‌లో అద్భుతమైన రికార్డు ఆ జట్టు సొంతం. పైగా ఇప్పటికే మూడు సార్లు విన్నర్‌గా నిలిచిన ఆ టీమ్ ముచ్చటగా నాలుగో టైటిల్‌పై కన్నేసింది. వరుసగా రెండు సీజన్లలో విజేతగా నిలిచే అరుదైన రికార్డు ఆ జట్టును ఊరిస్తోంది. ఆ టీమ్ స్టార్ స్ట్రైకర్ రాయ్ కృష్ణ గోల్డెన్ బూట్ రేసులో ఉన్నాడు. ముంబై టైటిల్ నెగ్గుతుందా?. లేక ఏటీకే నాలుగో టైటిల్ కోరిక తీరుతుందా? చూడాలి.
మైఖేల్‌లో ఫాంటసీ పుట్‌బాల్ ఆడండి. బహుమతులు గెలవండి