ఫిఫా వరల్డ్ కప్‌: జర్మనీకి షాకిచ్చిన ఇరాన్, నాకౌట్‌కు అర్హత

Posted By:

హైదరాబాద్: భారత్‌లో జరుగుతున్న ఫిఫా అండర్-17 వరల్డ్ కప్‌లో ఇరాన్ సంచలన విజయాన్ని నమోదు చేసింది. టోర్నీ హాట్ ఫేవరెట్లలో ఒకటైన జర్మనీకి ఊహించని విధంగా షాకిచ్చింది. మంగళవారం గ్రూప్‌-సిలో భాగంగా జరిగిన మ్యాచ్‌లో ఇరాన్ 4-0 తేడాతో పటిష్ట జర్మనీని ఓడించింది.

తాజా విజయంతో మరో మ్యాచ్‌ ఆడాల్సి ఉండగానే ఇరాన్ ప్రిక్వార్టర్స్‌లో అడుగుపెట్టింది. మ్యాచ్‌ ఆద్యంతం ఆధిపత్యాన్ని ప్రదర్శించిన ఇరాన్‌.. జర్మనీ గోల్ పోస్టుపై మెరుపు దాడులు చేశారు. ఇరాన్ తరుపున యూనస్‌ డెల్ఫిస్‌ రెండు గోల్స్‌ (6, 42వ నిమిషాల్లో) చేయగా, అలహ్యర్‌ సయ్యద్‌ (49వ), వాహిద్‌ నాందారి (75వ) చెరో గోల్‌ సాధించారు.

Iran upset Germany to enter knockout round

ఇప్పటివరకు ఇరాన్ ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ గెలవడంతో గ్రూపు-సి నుంచి ఆరు పాయింట్లతో ప్రీక్వార్టర్స్ బెర్తును దక్కించుకోగా, జర్మనీ 3 పాయింట్లతో రెండో స్ధానంలో కొనసాగుతోంది. మరోవైపు గ్రూప్‌-డిలో భాగంగా ఉత్తరకొరియాతో జరిగిన మ్యాచ్‌లో 2-0తో బ్రెజిల్ విజయం సాధించింది.

రెండో అర్ధభాగంలో లింకన్‌, పౌలినోలు కొట్టిన గోల్స్‌తో బ్రెజిల్‌ పైచేయి సాధించింది. తొలి అర్ధభాగంలో ఉత్తరకొరియా ఢిపెన్స్ పటిష్టంగా ఉంది. కానీ రెండో అర్ధభాగంలో బ్రెజిల్ ఒక్కసారిగా ఊపందుకుంది. 56వ నిమిషంలో లింకన్‌ జట్టుకు తొలి గోల్‌ను అందించాడు. మరో ఐదు నిమిషాల తర్వాత పౌలినో గోల్‌తో బ్రెజిల్‌ 2-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.

మరో మ్యాచ్‌లో స్పెయిన్‌ 4-0తో నైజెర్‌పై విజయం సాధించింది. స్పెయిన్‌ తరఫున అబెల్‌ రుయిజ్‌ రెండు గోల్స్‌ కొట్టగా.. సెజర్‌, సెర్గియో గోమెజ్‌ చెరో గోల్‌ సాధించారు. మరో మ్యాచ్‌లో కోస్టారికా-గునియా మధ్య మ్యాచ్‌ 2-2తో డ్రాగా ముగిసింది. ఇక, బుధవారం జరిగే మ్యాచ్‌ల్లో ఫ్రాన్స్‌తో జపాన్‌, ఇంగ్లాండ్‌తో మెక్సికో, హోండురస్‌తో న్యూ కలెడోనియా, ఇరాక్‌తో చిలీ తలపడతాయి.

Story first published: Wednesday, October 11, 2017, 11:48 [IST]
Other articles published on Oct 11, 2017
+ మరిన్ని
POLLS

Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి