ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా సౌతాఫ్రికాతో జరిగిన సూపర్-8 మ్యాచ్‌లో స్పిన్ ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్‌ను తప్పించడం తన తప్పిదమేనని టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తెలిపాడు. ఈ నిర్ణయంతో అక్షర్ పటేల్ తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడని, మ్యాచ్ తర్వాత అతనికి వ్యక్తిగతంగా క్షమాపణలు కూడా చెప్పానని తాజాగా సూర్యకుమార్ యాదవ్ వెల్లడించాడు.
ఈ మెగా టోర్నీలో టీమిండియా విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. ఫైనల్లో న్యూజిలాండ్‌ను 96 పరుగుల తేడాతో చిత్తు చేసిన టీమిండియా.. డిఫెండింగ్ ఛాంపియన్‌గా టైటిల్ నిలబెట్టుకోవడంతో పాటు సొంతగడ్డపై టైటిల్ గెలిచిన టీమ్‌గా చరిత్ర సృష్టించింది. మూడు టీ20 ప్రపంచకప్‌లు అందుకున్న జట్టుగా కూడా రికార్డ్ నమోదు చేసింది.
ఈ టోర్నీలో అద్వితీయమైన ప్రదర్శన కనబర్చిన భారత్.. సూపర్-8లో సౌతాఫ్రికాతో జరిగిన పోరులో 76 పరుగుల తేడాతో చిత్తయ్యింది. అయితే ఈ మ్యాచ్‌లో స్పిన్ ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్‌కు బదులు వాషింగ్టన్ సుందర్‌ను ఆడించి మూల్యం చెల్లించుకుంది. సౌతాఫ్రికా బ్యాటర్లలో ఎక్కువగా లెఫ్టార్మ్ బ్యాటర్లు ఉన్నారని లెగ్ స్పిన్నర్ అయిన అక్షర్ పటేల్‌ను పక్కనపెట్టింది. అయితే ఈ నిర్ణయం బెడిసి కొట్టడంతో భారత్‌కు పరాజయం తప్పలేదు. అయితే అక్షర్ పటేల్‌ను తప్పించడం తన పొరపాటేనని సూర్యకుమార్ యాదవ్ తాజాగా ఓ జాతీయ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అంగీకరించాడు.

'నా నిర్ణయంతో అక్షర్ పటేల్ చాలా ఆగ్రహానికి గురయ్యాడు. అలా అవ్వడం కూడా సబబే. అతను ఎంతో అనుభవం కలిగిన ఆటగాడు. ఐపీఎల్‌లో ఒక ఫ్రాంచైజీకి సారథ్యం వహిస్తున్నాడు. కాబట్టి కోపం రావడం సహజం. నేను అతనికి క్షమాపణలు కూడా చెప్పాను. నేను పొరపాటు చేశానని, నన్ను క్షమించమని అడిగాను. కానీ అది జట్టు ప్రయోజనాల కోసం తీసుకున్న నిర్ణయం. ఆ సంభాషణ కాస్త కఠినంగానే సాగింది. కానీ అతను దాన్ని సానుకూలంగా తీసుకున్నాడు. మరుసటి రోజు మేం దాని గురించి కూర్చుని మాట్లాడుకున్నాం.'అని సూర్యకుమార్ యాదవ్ తెలిపాడు.
టీ20 ప్రపంచకప్ విజయం తర్వాత గౌతమ్ గంభీర్ ఇచ్చిన స్పీచ్ గురించి కూడా సూర్యకుమార్ యాదవ్ పంచుకున్నాడు. ద్వైపాక్షిక సిరీస్‌లలో సాధించిన 100 విజయాలను ప్రజలు మర్చిపోతారని, కానీ ప్రపంచకప్ విజయాన్ని మాత్రం ఎప్పటికీ గుర్తుంచుకుంటారని గంభీర్ జట్టుతో చెప్పాడని గుర్తు చేసుకున్నాడు. టీ20 ప్రపంచకప్ గెలిచిన తర్వాత గంభీర్ ఎంతో సంతోషంగా కనిపించారని తెలిపాడు.
'మొదటి నాలుగు మ్యాచ్‌ల్లో మేం అతనికి నవ్వే అవకాశం ఇవ్వలేదు. కానీ ఆ తర్వాత ఈ జట్టు ఆడుతున్న తీరు చూసి అతను చాలా సంతోషానికి గురయ్యాడు. ఎందుకంటే 250, 256 పరుగులు చేయడం.. భారీ లక్ష్యాలను విజయవంతంగా ఛేదించడం.. భారత టీ20 చరిత్రలో ఎప్పుడూ జరగలేదని నా అభిప్రాయం. ఫైనల్ ముగిసిన తర్వాతే గంభీర్ అందరికంటే ఎక్కువగా నవ్వాడు.' అని సూర్యకుమార్ యాదవ్ పేర్కొన్నాడు.