ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026లో విజేతగా నిలవడంతో టీమిండియా స్టార్ ప్లేయర్లు వరుణ్ చక్రవర్తీ, వాషింగ్టన్ సుందర్ మొక్కు తీర్చుకున్నారు. తమిళనాడులోని అరుణాచలేశ్వరుడిని బుధవారం రాత్రి దర్శించుకున్న ఈ తమిళ ఆటగాళ్లు.. 14 కిలోమీటర్లు గిరిప్రదక్షిణ చేసి స్వామి వారికి మొక్కులు చెల్లించుకున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
భక్తుల రద్దీ, అభిమానుల తాకిడితో పాటు ఎండ వేడిని దృష్టిలో ఉంచుకుని.. ఈ ఇద్దరు ఆటగాళ్లు బుధవారం అర్థరాత్రి గిరి ప్రదక్షిణ ప్రారంభించారు. గిరిప్రదక్షిణకు ముందు అరుణాచలేశ్వర ఆలయాన్ని సందర్శించి స్వామివారికి.. ఉన్నామలై అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఎవరికీ తెలియకుండా జాగ్రత్తగా చాలా సాదా సీదాగా గిరి ప్రదక్షిణ చేసినా.. వారిని కొంతమంది అభిమానులు గుర్తించి సెల్ఫీలు తీసుకున్నారు. ఐసీసీ టీ20 ప్రపంచకప్ ముందు భారత్ గెలవాలని, వ్యక్తిగతంగా తమ ప్రదర్శన బాగుండాలని ఈ ఇద్దరు ఆటగాళ్లు మొక్కుకున్నట్లు సమాచారం.

ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026లో వరుణ్ చక్రవర్తీ అద్భుత ప్రదర్శన కనబర్చాడు. 9 మ్యాచ్‌ల్లో 14 వికెట్లు పడగొట్టాడు. బుమ్రాతో కలిసి భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు. మరోవైపు వాషింగ్టన్ సుందర్ ఈ టోర్నీలో ఒకే ఒక్క మ్యాచ్ ఆడి ప్రభావం చూపలేకపోయాడు.
అరుణాచలంలో గిరిప్రదక్షిణ చేయడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుందని, నెగటివ్ ఎనర్జీ తొలగిపోతుందని భక్తుల నమ్మకం. భారత ఆటగాళ్లు కూడా గిరి ప్రదక్షిణ చేసి మొక్కులు చెల్లించుకున్నాడు. ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 విజయానంతరం ట్రోఫీని అహ్మదాబాద్ స్టేడియంలోని హనుమాన్ టెంపుల్‌కు తీసుకెళ్లి గంభీర్, సూర్య, జైషా పూజలు చేసిన సంగతి తెలిసిందే.
ఈ మెగా టోర్నీలో ఫైనల్లో న్యూజిలాండ్‌ను 96 పరుగుల తేడాతో చిత్తు చేసిన టీమిండియా.. డిఫెండింగ్ ఛాంపియన్‌గా టైటిల్ నిలబెట్టుకోవడంతో పాటు సొంతగడ్డపై టైటిల్ గెలిచిన టీమ్‌గా చరిత్ర సృష్టించింది. మూడు టీ20 ప్రపంచకప్‌లు అందుకున్న జట్టుగా కూడా రికార్డ్ నమోదు చేసింది.