బంగ్లాదేశ్‌తో తొలి వన్డేలో ఓడిన పాకిస్థాన్‌పై ఆ జట్టు మాజీ క్రికెటర్ మహమ్మద్ అమీర్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. రాను రాను పాకిస్థాన్ పసికూన జట్టులా తయారయ్యేలా ఉందని మండిపడ్డాడు. పసికూన బంగ్లాదేశ్‌తో ఓడిపోవడం ఏంటని అసహనం వ్యక్తం చేశాడు. సీనియర్ ఆటగాళ్లను పక్కన పెట్టి యువ ఆటగాళ్లతో జట్టును నడిపించలేరని హెచ్చరించాడు.
మూడు వన్డేల సిరీస్ కోసం బంగ్లాదేశ్ పర్యటనకు వెళ్లిన పాకిస్థాన్ బుధవారం జరిగిన తొలి వన్డేలో 8 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్ 114 పరుగులకే కుప్పకూలగా.. బంగ్లాదేశ్ 15.1 ఓవర్లలోనే 115 పరుగులు చేసి ఘన విజయం సాధించింది. ఈ ఫలితంపై అసహనం వ్యక్తం చేసిన మహమ్మద్ అమీర్ సోషల్ మీడియా వేదికగా తన ఆవేదనను వ్యక్తం చేశాడు.
'పాకిస్థాన్ భవిష్యత్తులో ఏదో ఒకరోజు అసోసియేట్ స్థాయి జట్టుగా మారిపోతుందేమోనని నాకు భయంగా ఉంది. పాకిస్థాన్ ఇప్పుడు బంగ్లాదేశ్‌తో కూడా ఓడిపోతుంది. అందుకే ఫేస్‌బుక్ వేదికగా నా ఆందోళనను పంచుకుంటున్నాను. సీనియర్ ఆటగాళ్లను తప్పించి.. కేవలం యువకులతోనే జట్టును నింపలేరు. జట్టులో సరైన మార్గదర్శకత్వం, అనుభవం ఉండటం చాలా అవసరం.

ఇప్పుడున్న యువ ఆటగాళ్లు కేవలం మిడ్-వికెట్ వైపు మాత్రమే షాట్లు ఆడుతున్నారు. బంతి ఆఫ్-స్టంప్ మీద పడినప్పుడు దాన్ని ఎలా ఎదుర్కోవాలో వారికి తెలియడం లేదు. షామిల్ (హుస్సేన్) మిడ్-వికెట్ షాట్ ఆడబోయే క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు. ఆఫ్ సైడ్, మిడ్-ఆఫ్ మీదుగా కూడా పరుగులు చేయవచ్చనే విషయం యువ ఆటగాళ్లు అర్థం చేసుకోవాలి. పాకిస్థాన్ బౌలింగ్ తీరు తీవ్ర నిరాశకు గురి చేసింది. పాక్ బ్యాటర్లు తడబడిన అదే వికెట్‌పై బంగ్లాదేశ్ జట్టు ఈజీగా పరుగులు రాబట్టింది.'అని అమీర్ ఆవేదన వ్యక్తం చేశాడు.