హైదరాబాద్: ఇంగ్లాండ్ జట్టులో ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ పేరు చెబితే ఆటతోపాటు వివాదాలే గుర్తొస్తాయి. ఏడాది క్రితం బ్రిస్టర్ బార్ ముందు పడిన గొడవ కళ్ల ముందు మెదులుతూనే ఉంది. అప్పటి నుంచి స్టోక్స్ అంటేనే కాస్త జాగ్రత్తగా చూస్తున్నారంతా. కానీ భారత్‌తో జరుగుతోన్న ఐదో టెస్టు సందర్భంగా స్టోక్స్ క్రీడా స్ఫూర్తి చాటాడు. తనలో ఓ జెంటిల్‌మాన్ ఉన్నాడని నిరూపించాడు.
ఓవల్ టెస్టులో భారత్ ఇన్నింగ్స్ సమయంలో రాహుల్ బ్యాటింగ్ చేస్తుండగా ఈ ఘటన జరిగింది. స్టోక్స్ బౌలింగ్‌లో డిఫెన్స్ ఆడిన రాహుల్ పరుగు కోసం ప్రయత్నించాడు. పరుగెత్తే క్రమంలో అతడి పాదానికి ఉన్న షూ ఊడిపోయింది. దీంతో రాహుల్ ఒక కాలికి షూ లేకుండానే రన్నింగ్ చేశాడు. బౌలింగ్ చేసి తిరిగి బౌలర్ ఎండ్‌కు వెళ్తున్న స్టోక్స్...షూ కింద పడిపోవడం చూసి వెనక్కి వెళ్లాడు.
— Gentlemen's Game (@DRVcricket) September 8, 2018
షూ తీసుకొని లేస్ సరిచేసి రాహుల్ చేతికి అందించాడు. ఇంగ్లాండ్ ఆల్‌రౌండర్ చేసిన పనికి రాహుల్ మాత్రమే కాకుండా క్రికెట్ అభిమానులు కూడా ఫిదా అయ్యారు. ఐదో టెస్టులో టీమిండియాకు పరాజయం తప్పే అవకాశాలే లేవు. ఇప్పటికే 464 పరుగుల ఛేదనలో వరుస వికెట్లు కోల్పోయిన టీమిండియా పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. ఇంగ్లాండ్ పేసర్ల ధాటికి నిలువలేకపోయిన భారత్ 58/3తో కష్టాల్లో పడింది.
పర్యటనలోనే చివరి మ్యాచ్ అవడంతో ఇంగ్లాండ్ బౌలర్లు విజృంభిస్తున్నారు. ఈ నేపథ్యంలో వారికి ఎదురు నిలిచి ఆఖరి రోజంతా నిలవాలంటే భారత్ బ్యాట్స్‌మెన్ అసాధారణంగా పోరాడాల్సిందే. భారీ లక్ష్యాన్ని చూసి బెదిరిపోయారో లేక... ఇంగ్లాండ్ పేస్‌కు నిలువలేకపోయారో కానీ టీమిండియా రెండో ఇన్నింగ్స్ మొదలు కాగానే భారత్ వికెట్లు టపటపా పడిపోయాయి.