అహ్మదాబాద్: ప్రతిష్టాత్మక దేశవాళీ టోర్నీ విజయ్ హజారే 2022 ట్రోఫీలో టీమిండియా యువ ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ జోరు కొనసాగుతోంది. ఉత్తర ప్రదేశ్‌తో గత మ్యాచ్‌లో ఒకే ఓవర్‌లో ఏడు సిక్స్‌లు బాది వరల్డ్ రికార్డు నమోదు చేసిన రుతురాజ్.. డబుల్ సెంచరీతో తాను ప్రాతినిథ్యం వహిస్తున్న మహారాష్ట్రను సెమీఫైనల్‌కు చేర్చిన విషయం తెలిసిందే. ఇక బుధవారం అస్సాంతో జరిగిన సెమీఫైనల్లో రుతురాజ్(126 బంతుల్లో 18 ఫోర్లు, 6 సిక్సర్లతో 168) మరో భారీ శతకం బాదాడు. దాంతో మహరాష్ట్ర 12 పరుగులతో అస్సాంను ఓడించి ఫైనల్‌కు దూసుకెళ్లింది. శుక్రవారం జరిగే టైటిల్ ఫైట్‌లో సౌరాష్ట్రతో అమీతుమీ తేల్చుకోనుంది. విజయ్ హజారే ట్రోఫీలో మహరాష్ట్ర ఫైనల్ చేరడం ఇదే తొలిసారి.
Quarter-Final: Ruturaj 220*(159) & Hangargekar 5/53(10)
— Johns. (@CricCrazyJohns) November 30, 2022
Semi-Final: Ruturaj 168(126) & Hangargekar 4/65(10)
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన మహారాష్ట్ర నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లకు 350 పరుగులు చేసింది. రుతురాజ్‌కు అండగా అంకిత్ బావ్నే(89 బంతుల్లో 10 ఫోర్లు, 2 సిక్స్‌లతో 110) సెంచరీతో రాణించాడు. అస్సాం బౌలర్లలో ముక్తార్ హుస్సేన్ మూడు వికెట్లు తీయగా..రియాన్ పరాగ్ ఓ వికెట్ పడగొట్టాడు. అనంతరం లక్ష్యచేధనకు దిగిన అస్సాం నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లకు 338 పరుగులే చేసి ఓటమిపాలైంది. జమ్మూ కశ్మీర్‌తో 350 పరుగుల లక్ష్యాన్ని చేధించి సెమీఫైనల్ చేరిన ఆ జట్టు.. మహరాష్ట్రతో ఆ ఫలితాన్ని రిపీట్ చేయలేకపోయింది. గత మ్యాచ్‌లో భారీ సెంచరీతో చెలరేగిన రియాన్ పరాగ్(15) వైఫల్యం ఆ జట్టు విజయవకాశాలను దెబ్బతీసింది. శివశంకర్ రాయ్(78), స్వరూపమ్(95) పోరాడినా ఫలితం లేకపోయింది.
అంతకుముందు కర్ణాటకతో జరిగిన మరో సెమీఫైనల్లో సౌరాష్ట్ర 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన కర్ణాటక 49.1 ఓవర్లలో 171 పరుగులకు కుప్పకూలింది. ఓపెనర్ రవికుమార్(88) ఒక్కడే రాణించగా.. కెప్టెన్ మయాంక్ అగర్వాల్(1), మనీశ్ పాండే(0) దారుణంగా విఫలమయ్యారు. సౌరాష్ట్ర బౌలర్లలో జయదేవ్ ఉనాద్కత్ 4 వికెట్లతో కర్ణాటక పతనాన్ని శాసించాడు. అనంతరం లక్ష్యచేధనకు దిగిన సౌరాష్ట్ర 36.2 ఓవర్లలో 5 వికెట్లకు 172 పరుగులు చేసి ఘన విజయాన్ని అందుకుంది.