బీసీసీఐకి సైతం మహిళలంటే అంత వివక్షా..?

Written By:
cricket_mykhel_ali

హైదరాబాద్: మహిళా దినోత్సవం సందర్భంగా క్రికెట్ అభిమానుల ముందుకు వచ్చిన క్రికెటర్ల వేతనాలు అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాయి. ఊహించని ఆటగాళ్లు జీతాలు పెరగడం, ఆశించిన వారికి అవకాశం అందకపోవడంతో సగటు అభిమాని నిరుత్సాహానికి గురైయ్యాడు. ఇది చాలక మహిళా దినోత్సవానికి బీసీసీఐ విడుదల చేసిన వేతనాలపై మహిళా అభిమానులు విరుచుకుపడుతున్నారు.

టీమిండియా క్రికెటర్ల వార్షిక వేతనాలను భారీగా పెంచిన భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ)పై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జీతాల పెంపులో పురుష, మహిళా క్రికెటర్లకు వ్యత్యాసం చూపించడంపై నెటిజన్లు మండిపడుతున్నారు. భారత పురుషుల క్రికెటర్లకు కోట్లలో వార్షిక వేతనం ఉండగా.. మహిళా క్రికెటర్లకు లక్షల్లో ఉండటం ఏమిటని సోషల్‌ మీడియా వేదికగా ప్రశ్నిస్తున్నారు.

మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా క్రికెటర్లుకు ఇచ్చిన కానుక ఇదేనా? అని నిలదీస్తున్నారు. దేశం తరుఫున ఇరు జట్లు అద్బుతంగా రాణిస్తున్నా జీతాల్లో ఇంత వ్యత్యాసం ఏమిటో ప్రశ్నించండి అని ఒకరంటే.. షేమ్‌ బీసీసీఐ.. మహిళా టాప్‌ క్రికెటర్ల జీతాలు పురుషుల సీ గ్రేడ్‌ ఆటగాళ్ల వేతనాల్లో సగం ఉండటం సిగ్గుచేటని మరోకరు ట్రోల్‌ చేస్తున్నారు. పురుషుల కెప్టెన్‌ విరాట్‌ కోహ్లికి రూ 7 కోట్లు వస్తే మహిళా జట్టు కెప్టెన్‌కు మరి రూ. 50 లక్షలా అని విమర్శలు గుప్పిస్తున్నారు.

ఇక భారత పురుషుల క్రికెటర్ల జీతాలు ఏ+ గ్రేడ్‌- రూ. 7 కోట్లు, ఏ గ్రేడ్‌- రూ. 2 కోట్ల నుంచి 5 కోట్లు, బీ గ్రేడ్‌ - రూ.1 కోటి నుంచి 3 కోట్లు, సీ గ్రేడ్‌- రూ. 50 లక్షల నుంచి 1 కోటి మేర పెంచారు. ఇటీవల మహిళా క్రికెటర్ల అద్బుతంగా రాణించడంతో అభిమానుల నుంచి ఆదరణ పెరిగింది. ఈ నేపథ్యంలో వీరి జీతాలు కూడా భారీగా పెరుగుతాయని అందరు భావించారు. కానీ బీసీసీఐ మహిళా దినోత్సవం నాడే మహిళా క్రికెటర్లకు మొండి చెయ్యి చూపించింది.

Story first published: Thursday, March 8, 2018, 21:26 [IST]
Other articles published on Mar 8, 2018

Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి