
స్టేడియం స్టాటిస్టిక్స్..
ఢాకాలోని ఈ స్టేడియంలో టాస్ పెద్దగా కీలక పాత్ర పోషించడం జరగదు. ఎందుకంటే ఇక్కడ మొత్తం 113 అంతర్జాతీయ వన్డే మ్యాచులు జరగ్గా.. వాటిలో 53 మ్యాచుల్లో తొలుత బ్యాటింగ్ చేసిన జట్టు గెలిచింది. మిగిలిన వాటిలో 59 మ్యాచుల్లో ఛేజింగ్ టీం విజయం సాధించింది. ఒక్క మ్యాచ్ కూడా డ్రా అవ్వలేదు. అయితే ఒక మ్యాచ్ మాత్రం రద్దయింది. అంటే టాస్ గెలిచిన జట్టు ఏది ఎంచుకున్న గెలిచే అవకాశం ఉంటుంది. ఆటగాళ్ల నైపుణ్యం మీదనే మ్యాచ్ విజయం ఆధార పడి ఉంటుంది. ఈ మైదానంలో అత్యథిక వ్యక్తిగత స్కోరు చేసిన బ్యాటర్ ఆసీస్ మాజీ ఆల్‌రౌండర్ షేన్ వాట్సన్. అతను 2011లో బంగ్లాదేశ్‌పై 185 పరుగులతో అజేయంగా నిలిచాడు.

భారత్ రికార్డులు..
ఈ స్టేడియంలో భారత జట్టు పలు రికార్డులు బద్దలు కొట్టింది. అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్ రెండు విభాగాల్లో అద్భుతంగా రాణించింది. ఈ మైదానంలో 2014లో భారత్ తరఫున స్టువర్ట్ బిన్నీ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో 6 పరుగులే ఇచ్చి 5 వికెట్లు తీసుకున్నాడు. అంతేకాదు, ఇక్కడ అత్యథిక జట్టు స్కోరు కూడా భారత్ పేరిటే ఉంది. 2011లో బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత జట్టు 370/4 పరుగులు సాధించింది. అతిపెద్ద ఛేజింగ్ కూడా భారత్ చేసిందే కావడం గమనార్హం. 2012లో పాకిస్తాన్ నిర్దేశించిన 330 పరుగుల లక్ష్యాన్ని భారత జట్టు ఛేదించింది. అలాగే ఈ స్టేడియంలో అత్యల్ప స్కోరుకు బంగ్లాదేశ్‌ను ఆలౌట్ చేసింది కూడా భారతే. ఇక్కడ 2014లో జరిగిన మ్యాచ్‌లో బంగ్లా టైగర్స్‌ను 58 పరుగులకే ఆలౌట్ చేసింది టీమిండియా.

పిచ్ ఎవరికి అనుకూలం?
ఈ మైదానం అటు బౌలర్లకో లేదంటే బ్యాటర్లకో అనుకూలంగా ఉంటుందని చెప్పలేం. ఇక్కడి పిచ్ సాధారణంగా రెండు విభాగాలకు సహకారం అందిస్తుంది. ఆరంభంలో పేస్ బౌలర్లకు స్వింగ్ లభించే అవకాశం ఉంది. అయితే మ్యాచ్ జరిగే కొద్దీ స్పిన్నర్లకు పిచ్ నుంచి మంచి సహకారం అందుతుంది. కాబట్టి ఈ మ్యాచ్‌లో స్పిన్నర్లు కీలకం కానున్నారు. ఇక టీమిండియా మ్యాచ్‌లో పిచ్ ఎలా ఉందనేది మ్యాచ్ రోజునే తెలుస్తుంది. అయితే ఈ మైదానంలో సగటు తొలి ఇన్నింగ్స్ స్కోరు 226 పరుగులు కావడం గమనార్హం.