
హైదరాబాద్: దాదాపు రెండున్నరేళ్ల పాటు అంతర్జాతీయ క్రికెట్‌కు దూరమైన రైనా చాలా కాలం తర్వాత ఉత్సాహంగా కనిపిస్తున్నాడు. జట్టుతో కలిసి ప్రాక్టీస్ చేస్తూనే ఖాళీ సమయాల్లో చక్కని ఆహ్లాదాన్ని పంచే రైనా మళ్లీ తనదైన శైలీలో ఓ పాట పాడాడు. ముక్కోణపు సిరీస్‌లో భాగంగా సోమవారం లంక జట్టుతో భారత్ తలపడనుంది.
ఈ నేపథ్యంలో రైనా జట్టుతో కలిసి ప్రాక్టీస్ చేసి హోటల్‌లో విరామం తీసుకుంటున్న సమయంలో అక్కడ జరుగుతున్న సంగీత విభావరిలో గొంతు కలిపాడు. తనలోని సింగర్‌ను ప్రపంచానికి పరిచయం చేశాడు. కొలంబోలోని ఓ హోటల్లో యే షామ్ మస్తానీ.. పాట పాడి అందరినీ అలరించాడు.
లెజెండరీ సింగర్ కిశోర్‌కుమార్ పాడిన ఈ పాటకు రైనా న్యాయం చేశాడు. అతను పాట వింటూ అక్కడున్న వాళ్లంతా మైమరచిపోయారు. ఈ వీడియోను భారత క్రికెట్ బోర్డు (బీసీసీఐ) షేర్ చేసి భారత క్రికెట్ అభిమానులతో పంచుకుంది.
బీసీసీఐ తన ట్వీట్‌లో '1970ల కాలం నాటి పాటను పాడిన రైనా ఈ సాయంత్రం అందరినీ ఉత్సాహపరిచాడు. టీమిండియా ఆల్ రౌండర్ ఇప్పుడు మంచి సింగర్ అని కూడా నిరూపించుకున్నాడు. రాజేశ్ ఖన్నా, ఆశా పరేఖ్ కలిసి నటించిన కచ్చీ కైట్ సినిమాలోని పాట ఇది' అని ప్రస్తావించింది.