#NoWarnerNoSRH: డేవిడ్ వార్నర్‌ను రిటైన్ చేసుకోవాలంటూ సన్‌రైజర్స్ ఫ్యాన్స్ డిమాండ్!

హైదరాబాద్: సన్‌రైజర్స్ హైదరాబాద్ మాజీ కెప్టెన్, ఆస్ట్రేలియా విధ్వంసకర బ్యాట్స్‌మన్ డేవిడ్ వార్నర్ కోసం ఆ జట్టు అభిమానులు సోషల్ మీడియా వేదికగా #NoWarnerNoSRH క్యాంపైన్‌ మొదలుపెట్టారు. ఐపీఎల్ 2022 సీజన్ మెగా వేలం నేపథ్యంలో వార్నర్‌ను సన్‌‌రైజర్స్‌హైదరాబాద్ రిటైన్ చేసుకోవాలని డిమాండ్ చేస్తూ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ మేరకు సన్‌రైజర్స్ హైదరాబాద్ మేనేజ్‌మెంట్‌కు అభిమానులు ఓ బహిరంగా లేఖ కూడా రాసారు. డేవిడ్ వార్నర్ లేని సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టును తాము ఊహించుకోలేమని స్పష్టం చేశారు.

2013 నుంచి సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు అండగా ఉన్నామని, అభిమానిస్తున్నామని తెలిపారు. అయితే దీనికి ఏకైక కారణం ఆస్ట్రేలియా విధ్వంసకర బ్యాట్స్‌మన్ డేవిడ్ వార్నరేనని ఆ లేఖలో పేర్కొన్నారు. ఈ సీజన్‌లో వార్నర్ వైఫల్యాన్ని అంగీకరిస్తామని, అలాగే టీమ్ మేనేజ్‌మెంట్ తీసుకున్న కఠిన నిర్ణయాన్ని అర్థం చేసుకుంటామని తెలిపారు. అయితే వార్నర్ ఓ రన్ మిషన్ అని, త్వరలోనే ఫామ్‌లోకి వస్తాడని, వచ్చే సీజన్‌కు రిటైన్ చేసుకోవాలని కోరారు.

ఘోర వైఫల్యంతో..

ఐపీఎల్ 2021 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ దారుణంగా విఫలమైంది. భారత్ వేదికగా జరిగిన ఫస్టాఫ్‌లో సన్‌రైజర్స్ వరుస పరాజయాలను చవిచూసింది. దాంతో టీమ్ వైఫల్యాలకు బాద్యుణ్ని చేస్తూ.. డేవిడ్ వార్నర్‌పై టీమ్‌మేనేజ్‌మెంట్ వేటు వేసింది. కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పించి కేన్ విలియమ్సన్‌కు సారథ్య బాధ్యతలు అప్పగించింది. అంతేకాకుండా తుది జట్టులో నుంచి కూడా తప్పించింది. ఆ తర్వాత కేన్ మామ సారథ్యంలో ఒకే ఒక మ్యాచ్ జరగ్గా కరోనాతో లీగ్ అర్ధంతరంగా వాయిదా పడింది. ఇక యూఏఈ వేదికగా ప్రారంభమైన సెకండాఫ్ లీగ్‌లో వార్నర్‌కు మళ్లీ తుది జట్టులో అవకాశం దక్కింది. జానీ బెయిర్ స్టో చివరి క్షణంలో తప్పుకోవడంతో సాహాతో కలిసి వార్నర్ ఇన్నింగ్స్ ప్రారంభించాడు. వరుసగా రెండు మ్యాచ్‌ల్లో విఫలమవడంతో మళ్లీ అతనిపై వేటు పడింది. కనీసం మ్యాచ్ డగౌట్‌లో కూడా చోటు దక్కలేదు. ఈ క్రమంలోనే అతను సన్‌రైజర్స్ అభిమానులకు ధన్యవాదాలు తెలుపుతూ.. ఫ్రాంచైజీకి ధన్యవాదాలు తెలిపాడు.

కారణం చెప్పలేదు..

తాజాగా ఇండియా టుడేతో మాట్లాడిన వార్నర్.. ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. కెప్టెన్సీ బాధ్యతల నుంచి తనను ఎందుకు తప్పించారో అర్థం కాలేదన్నాడు. 'సన్‌రైజర్స్‌ హైదరాబాద్ యజమానులు, ట్రెవర్ బేలిస్‌, వీవీఎస్ లక్ష్మణ్‌, టామ్ మూడీ, ముతయ్య మురళిధరన్ అంటే నాకు ఎంతో గౌరవం ఉంది. ఓ నిర్ణయం తీసుకున్నారంటే.. ఏకగ్రీవంగానే తీసుకుని ఉంటారు. ఎవరు నాకు మద్దతిచ్చారో, ఎవరు ఇవ్వలేదో చెప్పడం చాలా కష్టం. నన్ను కెప్టెన్సీ నుంచి తప్పించడానికి కారణాన్ని చెప్పకపోవడం చాలా నిరాశ కలిగించింది. కెప్టెన్సీని తొలగించడాన్ని అసలు జీర్ణించుకోలేకపోతున్నా. నా ప్రశ్నలకు ఎప్పటికీ సమాధానం దొరకదు. కానీ అన్నీ మరిచి ముందుకు వెళ్లాల్సిందే' అని పేర్కొన్నాడు.

అభిమానుల కోసమైనా..

'హైదరాబాద్ నా రెండో ఇల్లు లాంటిది. ఇక్కడి అభిమానులు నన్ను ఎంతగానో ఆరాధించారు. ఓ కుటుంబ సభ్యుడిలా చూశారు. హైదరాబాద్‌కు వచ్చిన ప్రతీసారి ఎంతో అప్యాయంగా మాట్లాడారు. నా పిల్లల పట్ల అంతే అభిమానాన్ని చూపెట్టారు. ఇవన్నీ నా జీవితంలోనే మర్చిపోలేని మధుర క్షణాలు. హైదరాబాద్ అభిమానులకోసమైనా వచ్చే ఏడాది సన్‌రైజర్స్ జట్టుకు ఆడాలనిపిస్తోంది. కానీ మేనేజ్‌మెంట్ తీసుకునే నిర్ణయంపైనే అది ఆధారపడి ఉంది.

నా ఐపీఎల్ భవితవ్యం ఏంటనేది కాలమే నిర్ణయిస్తుంది. కొత్తగా రెండు జట్లు రానున్న నేపథ్యంలో మెగా వేలం జరగనుంది. ఏ జట్టుకు ఆడతానో ఇప్పుడే చెప్పలేను. సన్‌రైజర్స్ హైదరబాద్ తరఫున టైటిల్ గెలిచా. గొప్ప ఆటగాళ్లతో కలిసి ఆడా. జట్టు క్లిష్ట స్థితిలో ఉన్నప్పుడు బ్యాట్‌తో రాణించా. నాకిచ్చిన ప్రతీ బాధ్యతను నెరవేర్చా. లోయరార్డర్‌లో ఆడాల్సి వచ్చినా బరిలోకి దిగా. హైదరాబాద్ తరఫున సుమారు 100 మ్యాచ్‌లు ఆడా. నా శక్తి సామర్థ్యాల మేరకు రాణించా. అందుకు చాలా గర్వంగా ఉంది' అని డేవిడ్ వార్నర్ తెలిపాడు.

వార్నర్ రాకతో..

వార్నర్ రాకతో..

వార్నర్ కెప్టెన్సీలో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఎన్నో కఠినమైన సీజన్లను ఆడింది. ఓడిపోయే మ్యాచులను కూడా డేవిడ్ భాయ్ ఒంటిచేత్తో గెలిపించాడు. అద్భుత ఓపెనింగ్ ఇచ్చి ఎన్నోసార్లు భారీ స్కోర్లు అందించారు. పెద్దపెద్ద స్టార్లు లేకపోయినా.. జట్టులో మంచి సమతూకం తీసుకొచ్చాడు. ఈ క్రమంలోనే 2016లో జట్టుకు తొలి టైటిల్ అందించాడు. 2012లో డెక్కన్‌ చార్జర్స్‌ నుంచి సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌గా పేరు మార్చుకొని బరిలోకి దిగిన ఆ జట్టుకు డారెన్‌ సామి, శిఖర్‌ ధావన్‌, కామెరున్‌ వైట్‌ లాంటి ఎంతో మంది ఆటగాళ్లు కెప్టెన్లుగా పనిచేశారు. అయితే 2015లో వార్నర్‌ ఆ జట్టుకు కెప్టెన్‌గా ఎంపిక చేసిన తర్వాత సన్‌రైజర్స్‌ తలరాత మారిపోయింది. 2016లో వార్నర్‌ కెప్టెన్సీలోనే ఐపీఎల్‌ టైటిల్‌ను సన్‌రైజర్స్‌ అందుకుంది. ఆపై కూడా సన్‌రైజర్స్‌ బాగానే ఆడింది.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Wednesday, October 13, 2021, 22:59 [IST]
Other articles published on Oct 13, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X