ఐపీఎల్ 2018: నలుగురు కెప్టెన్లు లేకుండానే ప్రారంభ వేడుకలు

Posted By:
Skippers to Give IPL Opening a Miss? BCCI to Pre-record Captain’s Pledge

హైదరాబాద్: ఐపీఎల్ 2018 సీజన్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి నలుగురు కెప్టెన్లు దూరం కానున్నట్లు వార్తలు వస్తున్నాయి. సీజన్ ఆరంభానికి ముందు ఐపీఎల్ ఆరంభ వేడుకలను ప్రతి ఏడాది ఒక రోజు ముందుగా అంగరంగ వైభవంగా నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా అన్ని జట్లకు చెందిన కెప్టెన్లు పాల్గొనడం ఆనవాయితీగా వస్తోంది.

అయితే ఈ సారి అది కుదరకపోవచ్చు. ఎందుకంటే ఈ ఏడాది జరగబోయే ప్రారంభ వేడుకలు మొదటి మ్యాచ్ జరగడానికి కొన్ని గంటల ముందుగా నిర్వహిస్తుండటంతో కొన్ని జట్లకు చెందిన కెప్టెన్లు ఈ వేడుకలకు దూరం కానున్నారు. ఈ ఏడాది ఐపీఎల్‌ ప్రారంభ వేడుకల కార్యక్రమం ఏప్రిల్‌ 7న జరగనుంది.

అదే రోజు రాత్రి 8 గంటలకు డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ముంబై ఇండియన్స్‌-చెన్నై సూపర్‌కింగ్స్‌ జట్ల మధ్య తొలి మ్యాచ్‌ జరగనుంది. ఆ తర్వాత టోర్నీలో భాగంగా ఏప్రిల్‌ 8న ఢిల్లీ డేర్‌డెవిల్స్-కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌, కోల్‌కతా నైట్‌రైడర్స్‌-రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు జట్ల మధ్య మ్యాచ్‌లు జరగనున్నాయి.

ప్రారంభ వేడుకల మరుసటి రోజే మ్యాచ్‌లు ఉండటంతో ఈ నాలుగు జట్లకు చెందిన కెప్టెన్లు గౌతమ్‌ గంభీర్‌, రవిచంద్రన్‌ అశ్విన్‌, దినేశ్‌ కార్తీక్‌, విరాట్‌ కోహ్లీ హాజరుకావడం కుదరకపోవచ్చని బీసీసీఐ ప్రతినిధులు తెలిపారు. అయితే కెప్టెన్లు తమ జట్టు తరఫున ఇచ్చే ప్రసంగాన్ని ముందస్తుగానే రికార్డు చేసి వేడుకల సందర్భంగా ప్రసారం చేయనున్నట్లు తెలిపారు.

దీంతో ప్రారంభ వేడుకల్లో విరాట్ కోహ్లీ, గంభీర్, దినేశ్ కార్తిక్, అశ్విన్లను ప్రత్యక్షంగా వీక్షించే అవకాశాన్ని అభిమానులు మిస్ కానున్నారు. ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ ముందుగా నిర్ణయించిన తేదీల ప్రకారం ఐపీఎల్‌ ప్రారంభ వేడుకలను ఏప్రిల్‌ 6న నిర్వహిస్తే మధ్యలో ఒక రోజు ఖాళీ ఉంటే అన్ని జట్ల కెప్టెన్లు హాజరయ్యే వారు.

కానీ, ఈ ఏడాది ఏప్రిల్‌ 7నే వేడుకలు నిర్వహించి మ్యాచ్‌ నిర్వహించాలని సుప్రీంకోర్టు నియమించిన పాలకుల కమిటీ నిర్ణయం తీసుకోవడంతో ఇప్పుడ ఈ పరిస్థితి తలెత్తింది.

Story first published: Wednesday, March 14, 2018, 14:58 [IST]
Other articles published on Mar 14, 2018

Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి