వెల్లింగ్టన్: న్యూజిలాండ్ పర్యటనలో ఉన్న పాకిస్థాన్ ఆటగాళ్లకు కరోనా సోకింది. ప్రస్తుతం క్రైస్ట్‌చర్చ్‌లో క్వారంటైన్‌లో ఉన్న పాక్ జట్టులోని ఆరుగురికి కరోనా పాజిటీవ్ అని తేలిందని న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు గురువారం ప్రకటించింది. కరోనా బారిన పడిన ఆరుగుర్ని క్వారంటైన్‌కు తరలించారు. ఐసోలేషన్లో ఉండగా ట్రైనింగ్ పొందడానికి ఇంతకు ముందు పాక్ క్రికెటర్లకు ఇచ్చిన అనుమతిని కూడా కివిస్ బోర్డు ఉపసంహరించింది.
కరోనా లక్షణాల కారణంగా పాకిస్థాన్ ఓపెనర్ ఫకర్ జమాన్ న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లని విషయం తెలిసిందే. లాహోర్‌లో హోటల్లో ఉన్న అతనికి కరోనా టెస్టులో నెగటివ్ అని తేలినప్పటికీ.. మరుసటి రోజు తీవ్ర జ్వరం రావడంతో కివీస్ పర్యటన నుంచి తప్పించారు. ఈ పర్యటనలో పాకిస్థాన్ ఆతిథ్య న్యూజిలాండ్‌తో మూడు టీ20లు, రెండు టెస్టులు ఆడనుంది.
డిసెంబర్ 18న ఇరు జట్ల మధ్య తొలి టీ20 జరగాల్సి ఉంది. అంతకు ముందు పాక్ జట్టు న్యూజిలాండ్-ఏ టీమ్‌తో రెండు ప్రాక్టీస్ మ్యాచ్‌లు ఆడనుంది. కానీ పాక్ క్రికెటర్లు కరోనా బారిన పడటంతో సిరీస్ జరగడంపై నీలినీడలు కమ్ముకున్నాయి.