హైదరాబాద్: క్రికెట్ నుంచి కాస్త విరామం లభించడంతో టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని షూటింగ్‌ల్లో పాల్గొంటున్నాడు. తాజాగా ధోని సిమ్లాలో రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్‌పై చక్కర్లు కొడుతూ కనిపించాడు. ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
ఓ యాడ్ షూటింగ్ కోసం ధోని కుటుంబసభ్యులతో కలిసి మంగళవారం సిమ్లా చేరుకున్నాడు. ఐదు రోజుల పాటు ధోని ఇక్కడే ఉండి యాడ్ షూటింగ్‌లో పాల్గొననున్నాడు. ఇందులో భాగంగా షూటింగ్ లొకేషన్‌కు ధోని బైక్‌ను స్వయంగా నడుపుకుంటూ వెళ్లాడు.
ఇందుకు సంబంధించి వీడియోని రితీ స్పోర్ట్స్ ఫేస్‌బుక్‌లో అభిమానులతో పంచుకుంది. తలకు హెల్మెట్ ధరించడంతో ధోనిని ఎవరూ గుర్తు పట్టకలేకపోవడం విశేషం. ధోనికి బైక్‌లంటే ఎంతో ఇష్టం అన్న సంగతి తెలిసిందే. ధోని వద్ద ఖరీదైన బైకులు ఎన్నో ఉన్నాయి.
రాంచీలో తాను ఎంతో ఇష్టపడి కట్టించుకున్న ఇంట్లో ధోని తన బైక్‌ల కోసం ప్రత్యేకంగా ఓ మ్యూజియాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నాడు. ఇందుకు సంబంధించిన ఫొటోను ఇటీవల ధోని భార్య సాక్షి ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో పంచుకున్న సంగతి తెలిసిందే.
మరోవైపు సిమ్లాలో ధోని పర్యటన సందర్భంగా చిల్లిగవ్వ సైతం ఖర్చుచేయలేదని హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి జైరామ్ ఠాకూర్ స్పష్టం చేశారు. ప్రభుత్వం ఆయనకు కేవలం రక్షణ మాత్రమే కల్పించిందని పేర్కొన్నారు. హిమాచల్ ప్రదేశ్ శాసనసభ శీతాకాల సమావేశాల్లో దేహ్రా ఎమ్మెల్యే హషియార్ సింగ్ ప్రారంభించిన చర్చలో సీఎం ఠాకూర్ ఈ విషయంపై స్పందించారు.
"సిమ్లాలో ధోని ఆగస్టు 27 నుంచి 31 వరకు ఐదు రోజులు ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆయనకు రక్షణ మాత్రమే కల్పించింది. ధోని ఇక్కడ బస చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చిల్లిగవ్వ ఖర్చు చేయలేదు. క్రికెటర్ ధోనికి రక్షణ కల్పించడం మన కనీస బాధ్యత" అని జైరాం ఠాకూర్ అన్నారు. యాడ్ షూటింగ్ కోసం ధోని సిమ్లాలో ఐదు రోజులు బస చేశారు.
ధోనీ పర్యటనకు ప్రభుత్వమే డబ్బులు ఖర్చు చేసిందని ప్రతిపక్షాలు ఆరోపించిన నేపథ్యంలో సభలో ఈ విషయంపై సీఎం ఠాకూర్ మాట్లాడారు. భోజన విరామ సమయంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే సుఖ్‌విందర్ సింగ్ సుక్ మాట్లాడుతూ ధోనిని "రాష్ట్ర అతిథి"గా ప్రకటించడంపై తాను ప్రశ్నించలేదని ఇతర ప్రకటనదారుల వద్ద వసూలు చేసినట్టే ధోని వద్ద కూడా రుసుము వసూలు చేయాలని తాను సూచించానని తెలిపారు.