IPL 2026: బుమ్రా కూడా మనిషే.. మరమనిషి కాదు: పోలార్డ్
పేలవ ఫామ్‌తో సతమతమవుతున్న ముంబై ఇండియన్స్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రాకు ఆ జట్టు మేనేజ్‌మెంట్ అండగా నిలిచింది. బుమ్రా కూడా మనిషేనని, ఫామ్ కోల్పోవడం సహజమేనని ముంబై ఇండియన్స్ బౌలింగ్ కోచ్ కీరన్ పోలార్డ్ అన్నాడు. అతనికి ముంబై ఇండియన్స్ అండగా ఉంటుందని స్పష్టం చేశాడు.
ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో బుధవారం జరిగిన మ్యాచ్‌లో బుమ్రా దారుణంగా విఫలమయ్యాడు. 4 ఓవర్లు బౌలింగ్ చేసి ఒక్క వికెట్ తీయకుండా 54 పరుగులు సమర్పించుకున్నాడు. ఇప్పటి వరకు 8 మ్యాచ్‌లు ఆడిన బుమ్రా రెండు వికెట్లు మాత్రమే తీసాడు. బుమ్రా ఐపీఎల్ కెరీర్‌లోనే ఈ సీజన్ అతనికి వరస్ట్‌గా మారిపోయింది. దాంతో అతనిపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
బుమ్రా కూడా మనిషే..
సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో మ్యాచ్ అనంతరం మీడియా సమావేశంలో పాల్గొన్న కీరన్ పొలార్డ్.. బుమ్రా వైఫల్యం గురించి మాట్లాడాడు. 'ఏ ఆటగాడైనా సరైన ప్రదర్శన చేయలేకపోతే.. వెంటనే ప్రతి చిన్న విషయాన్ని నిశితంగా పరిశీలిస్తుంటాం. సదరు ఆటగాడు ఎందుకు ఆడలేకపోతున్నాడనే దానిపై చర్చలు పెడుతుంటాం. ఇలాంటి వాటి నుంచి జస్‌ప్రీత్ బుమ్రా మినహాయింపేమీ కాదు.

గత కొన్నేళ్లుగా అతను ఎలాంటి ప్రదర్శన కనబర్చాడో మనం చూశాం. బుమ్రా కూడా మనిషే కదా.. అతను కూడా తప్పులు చేస్తాడు. కాలం కలిసి రానప్పుడు గతంలో చేసిన మంచిని గుర్తు చేసుకోవాలి. బుమ్రా తన స్థాయికి తగ్గట్లు రాణించ లేకపోయాడు. అయినా.. ఇప్పటికీ అతను వరల్డ్ నంబర్‌వన్ బౌలర్. అలానే మా ముంబై ఇండియన్స్‌కు కీలక బౌలర్.
ప్లే ఆఫ్స్ అవకాశాలు ఉన్నాయి..
ఈ సీజన్‌లో మా జట్టు ఆశించిన స్థాయిలో ఆడలేకపోతుంది. మా ఫలితాలే అందుకు నిదర్శనం. జట్టుగా మేం ఇంకాస్త మెరుగైన ప్రదర్శన చేయాల్సిన అవసరం ఉంది. మ్యాచ్ గెలవాలంటే ఆరంభం నుంచి చివరి వరకు ఆధిపత్యం చెలాయించాలి. అలా జరగకపోతే గెలవడం కష్టం. విజయం కోసం పోరాడాలనే పట్టుదలతోనే మా ఆటగాళ్లు ఉంటారు. ప్రస్తుతం మేం కొన్ని ఓటములను ఎదుర్కొన్నాం. అయినప్పటికీ మేం ఇంకా ప్లేఆఫ్స్ రేసులోనే ఉన్నాం. మాకూ ప్లే ఆఫ్స్ చేరే అవకాశాలు ఉన్నాయి’ అని పొలార్డ్ చెప్పుకొచ్చాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications