IPL 2026: ఆర్‌సీబీకి షాకిచ్చిన గుజరాత్ టైటాన్స్!
ఐపీఎల్ 2026 సీజన్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) జోరుకు బ్రేక్ పడింది. గురువారం జరిగిన మ్యాచ్‌లో సమష్టిగా రాణించిన గుజరాత్ టైటాన్స్ 4 వికెట్ల తేడాతో ఆర్‌సీబీని ఓడించింది. ఈ గెలుపుతో ఈ సీజన్‌లో ఆర్‌సీబీ చేతిలో ఎదురైన పరాజయానికి గుజరాత్ టైటాన్స్ ప్రతీకారం తీర్చుకుంది. ఇది గుజరాత్ టైటాన్స్‌కు ఐదో విజయం కాగా.. ఆర్‌సీబీకి మూడో పరాజయం. బ్యాటింగ్ వైఫల్యం ఆర్‌సీబీ విజయవకాశాలను దెబ్బతీసింది.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆర్‌సీబీ 19.2 ఓవర్లలో 155 పరుగులకు కుప్పకూలింది. దేవదత్ పడిక్కల్(24 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో 40), విరాట్ కోహ్లీ(13 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్‌తో 28) టాప్ స్కోరర్లుగా నిలవగా.. మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. ఇంపాక్ట్ ప్లేయర్ వెంకటేష్ అయ్యర్(15 బంతుల్లో ఫోర్‌తో 12) కూడా తీవ్రంగా నిరాశపర్చాడు. గుజరాత్ టైటాన్స్ బౌలర్లలో అర్షద్ ఖాన్(3/22) మూడు వికెట్లు తీయగా.. జాసన్ హోల్డర్(2/29), రషీద్ ఖాన్(2/19) రెండేసి వికెట్లు పడగొట్టారు. మహమ్మద్ సిరాజ్, కగిసో రబాడకు చెరో వికెట్ దక్కింది.

అనంతరం గుజరాత్ టైటాన్స్15.5 ఓవర్లలో 6 వికెట్లకు 158 పరుగులు చేసి గెలుపొందింది. శుభ్‌మన్ గిల్(18 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లతో 43), జోస్ బట్లర్(19 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్స్‌లతో 39 నాటౌట్), రాహుల్ తెవాటియా(17 బంతుల్లో 4 ఫోర్లతో 27 నాటౌట్) రాణించారు. ఆర్‌సీబీ బౌలర్లలో భువనేశ్వర్ కుమార్(3/28) మూడు వికెట్లు తీయగా.. రొమారియో షెపెర్డ్(2/30) రెండు వికెట్లు పడగొట్టాడు. సుయాశ్ శర్మకు ఒక వికెట్ దక్కింది.
కొంపముంచిన అంపైర్ తప్పిదం..
బ్యాటింగ్ వైఫల్యమే ఆర్‌సీబీ ఓటమిని శాసించింది. ఓపెనర్లు త్వరగానే ఔటైనా.. ఆర్‌సీబీకీ పవర్ ప్లేలో మెరుగైన ఆరంభమే దక్కింది. కానీ మిడిల్ ఓవర్లలో ఆర్‌సీబీ వరుసగా వికెట్లు కోల్పోయి మూల్యం చెల్లించుకుంది. అయితే రజత్ పాటిదార్ ఔటైన తీరు తీవ్ర చర్చనీయాంశమైంది. అతని క్యాచ్‌ను హోల్డర్ అద్భుతంగా అందుకున్నప్పటికీ బంతిని నేలపై పెట్టాడు. కానీ థర్డ్ అంపైర్ ఔట్‌గా ప్రకటించాడు.
ఈ తప్పిదం ఆర్‌సీబీ కొంపముంచింది. క్రీజులో సెట్ అయిన రజత్ పాటిదార్ ఔటవ్వడంతో తర్వాత వచ్చిన బ్యాటర్లు వరుసగా పెవిలియన్‌కు క్యూ కట్టారు. దాంతో ఆర్‌సీబీ 155 పరుగులకే పరిమితమైంది. అదనంగా 20-30 పరుగులు చేసి ఉంటే మ్యాచ్ ఫలితం మరోలా ఉండేది. 155 పరుగులే చేసినా ఆర్‌సీబీ అద్భుతంగా పోరాడింది. 16వ ఓవర్ వరకు మ్యాచ్‌ను తీసుకురావడంతో పాటు ఆరుగురు బ్యాటర్లను ఔట్ చేసింది. మరో 30 పరుగులు స్కోర్ బోర్డుపై ఉంటే మ్యాచ్ ఉత్కంఠగా మారేది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications