ఐపీఎల్ అంటనే వ్యాపారమని, క్రికెట్ ఎక్కడిదని సన్‌రైజర్స్ హైదరాబాద్(SRH) స్పిన్ బౌలింగ్ కోచ్ ముత్తయ్య మురళీధరన్ అభిప్రాయపడ్డాడు. అభిమానులను ఎంటర్‌టైన్ చేయాడానికే ఈ టోర్నీని రూపొందించారని స్పష్టం చేశాడు. ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా బుధవారం ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. 244 పరుగుల భారీ లక్ష్యాన్ని సన్‌రైజర్స్ హైదరాబాద్ ఛేదించింది.
ఈ సీజన్‌లో ఇప్పటి వరకు 30 సార్లుకు పైగా 200 ప్లస్ స్కోర్లు నమోదయ్యాయి. 264, 244 పరుగుల భారీ లక్ష్యాలు కూడా ఛేదనకు గురయ్యాయి. దాంతో ఈ సీజన్ బౌలర్లకు ఓ పీడకలగా మారిపోయిందనే అభిప్రాయం సోషల్ మీడియా వేదికగా వ్యక్తం అవుతుంది.
ముంబై ఇండియన్స్‌తో విజయానంతరం మీడియా సమావేశంలో పాల్గొన్న ముత్తయ్య మురళీధరన్‌ను బౌలర్ల కష్టాల గురించి ప్రశ్నించగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ సీజన్‌లో జట్లు నిరంతరం 200 ప్లస్ స్కోర్లు నమోదు చేయడానికి గల కారణాలను వివరించాడు. పవర్ ప్లేలో దూకుడుగా ఆడటం కూడా భారీ స్కోర్లకు ఓ ప్రధాన కారణమని అభిప్రాయపడ్డాడు.

'బ్యాటింగ్‌కు అనుకూలమైన పిచ్‌ల కారణంగానే భారీ స్కోర్లు నమోదు అవుతున్నాయి. టాపార్డర్ బ్యాటర్లు వేగంగా పరుగులు రాబడుతున్నారు. బౌలర్లకు వికెట్ల నుంచి సహకారం లభించడం లేదు. మరోవైపు బౌండరీల సైజ్ కూడా చిన్నగా ఉండటం బౌలర్లకు కష్టంగా మారింది. బౌలింగ్‌కు అనుకూలించే వికెట్లు తయారు చేస్తే.. ప్రేక్షకులు బోర్ కొడుతుందని చెప్పే ప్రమాదం ఉంది. ఐపీఎల్ స్ట్రక్చర్ అలానే ఉంది. ఈ విషయంలో బౌలర్లను తప్పు పట్టాల్సిన అవసరం లేదు.
2020 నుంచి మ్యాచ్‌లు చూసేవారు ఆట కంటే ఎంటర్‌టైన్‌మెంట్‌ను ఎక్కువగా ఆశిస్తున్నారు. అందుకే ఫోర్లు, సిక్స్‌లు చూడాలని కోరుకుంటున్నారు. అలాంటి వారి కోసమే ఐపీఎల్‌లో చాలా మార్పులు జరిగాయి. ఇంపాక్ట్ రూల్‌తో అదనంగా బ్యాటర్ రావడం వల్ల స్కోర్ బోర్డుపై కనీసం 200 మార్క్ కనిపిస్తోంది. ఈ మెగా టోర్నీ ఆవిర్భావం వెనక చాలా అంశాలు ఉంటాయి.
క్రికెట్‌ను అభివృద్ధి చేస్తున్నారా? లేదా అనేది ఇక్కడే విషయమే కాదు. క్రికెటర్లకు అవకాశాలు లభిస్తున్నాయి.. అభిమానులకు ఎంటర్‌టైన్‌మెంట్ దొరుకుతుంది. ప్రస్తుతం ఐపీఎల్ టోర్నీ పెద్ద వ్యాపారం. స్పాన్సర్లు కీలకం. ఆట విసుగు తెప్పిస్తే లీగ్‌కు ప్రజాదరణ కరువు అవుతోంది. అప్పడు స్పాన్సర్లు వ్యూయర్స్‌ను కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.’అని ముత్తయ్య మురళీధరన్ విశ్లేషించాడు.
