భారత్‌ వెళ్లేందుకు బీసీసీఐ అవకాశం ఇచ్చినా... జట్టు కోసం ఆస్ట్రేలియాలోనే ఆగిపోయిన సిరాజ్‌!

న్యూఢిల్లీ: తండ్రి అంత్యక్రియలకు హాజరయ్యేందుకు టీమిండియా పేస్‌ బౌలర్‌ మహమ్మద్‌ సిరాజ్‌ను హైదరాబాద్‌ పంపించేందుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) సన్నద్ధమైనా... అతను అంగీకరించలేదు. కెరీర్‌లో అండగా నిలిచిన తండ్రి మృతితో తీవ్ర విషాదంలో మునిగినా.. జట్టు ప్రయోజనాల గురించే ఆలోచించాడు. క్రికెటర్‌గా రాణించాలనే తండ్రి ఆశయాన్ని నెరవేర్చేందుకు జట్టుతో పాటు ఆస్ట్రేలియాలోనే ఉండిపోయాడు.

అయితే ఈ కష్ట సమయంలో కుటుంబసభ్యుల వద్ద సమయం గడిపేందుకు సిరాజ్‌ను స్వదేశానికి పిలిపించాలనుకున్నామని బీసీసీఐ కార్యదర్శి జై షా వెల్లడించాడు. కానీ జట్టుతో పాటు ఉండేందుకే అతడు మొగ్గు చూపాడని చెప్పాడు. సిరాజ్‌ తండ్రి మహ్మద్‌ గౌస్‌ అనారోగ్యంతో శుక్రవారం మరణించిన విషయం తెలిసిందే.

సిరాజ్ వెళ్లనన్నాడు

‘తండ్రి మరణవార్త అనంతరం సిరాజ్‌తో బీసీసీఐ అధికారులు మాట్లాడారు. ఇలాంటి బాధాకర సమయంలో కుటుంబంతో ఉండే విధంగా భారత్‌కు తిరిగి వెళ్లేందుకు ఏర్పాట్లు చేస్తామని చెప్పారు. అయితే అతను హైదరాబాద్‌కు వెళ్లకుండా ఆస్ట్రేలియాలోనే ఉండిపోవాలని నిర్ణయించుకున్నాడు. జట్టుతోపాటు ప్రాక్టీస్‌ కొనసాగిస్తానని సిరాజ్‌ అన్నాడు. అతని బాధను పంచుకుంటూ బోర్డు ఈ స్థితిలో సిరాజ్‌కు అండగా నిలుస్తుంది' అని బీసీసీఐ ఓ ప్రకటనలో పేర్కొంది. అయితే అతను హైదరాబాద్‌కు వెళ్లకుండా ఆస్ట్రేలియాలోనే ఉండిపోవాలని నిర్ణయించుకున్నాడు.

హ్యాట్సాఫ్ సిరాజ్

హ్యాట్సాఫ్ సిరాజ్

తండ్రి మరణించిన బాధలో ఉన్న సిరాజ్‌కు ధైర్యం చెబుతూ బోర్డు అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ ట్వీట్ చేశాడు. ‘ఈ బాధను అధిగమించే శక్తి అతనికిప్పుడు కావాలి. ఆసీస్‌ పర్యటనలో అతను రాణించాలని కోరుకుంటున్నా. అతని మనోధైర్యానికి నా అభినందనలు' అని దాదా ట్వీట్‌ చేశాడు.

భారత్‌ తరఫున 1 వన్డే, 3 టీ20లు ఆడిన సిరాజ్‌ ఇప్పటి వరకు టెస్టుల్లో అరంగేట్రం చేయలేదు. ఆసీస్‌ పర్యటనలో అతను టెస్టు సిరీస్‌కు మాత్రమే ఎంపికయ్యాడు.

నాన్న కల..

నాన్న కల..

గత కొంతకాలంగా ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్న మహ్మద్ గౌజ్‌(53).. గత శుక్రవారం హైదరాబాద్‌లోని ఓ ఆసుపత్రిలో తుది శ్వాస విడిచారు. ప్రాక్టీస్‌ సెషన్‌ ముగిసిన అనంతరం ఈ విషయాన్ని తెలుసుకున్న సిరాజ్..‌ తీవ్ర శోకసంద్రంలో మునిగిపోయాడు. 'ఇది షాకింగ్ న్యూస్. చాలా బాధగా ఉంది. నన్ను నేను కంట్రోల్ చేసుకోలేకపోతున్నా. నేను నా జీవితంలో అతిపెద్ద మద్దతును కోల్పోయాను. దేశం తరఫున ఆడటం నాన్న కల. టీమిండియాకు ఆడి నాన్న కలను నెరవేర్చినందుకు సంతోషిస్తున్నా. నాన్న ఎప్పుడూ ఒకేటే అనేవారు.. నా కొడుకు నా దేశాన్ని గర్వించేలా చేయాలనేవారు' అని మహ్మద్ సిరాజ్‌ అన్నాడు.

ప్రతి న్యూస్ పేపర్లో నీ ఫొటోనే బేటా

ప్రతి న్యూస్ పేపర్లో నీ ఫొటోనే బేటా

ఐపీఎల్ 2020లో కోల్‌కతా నై‌ట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో మహ్మద్ సిరాజ్ అద్భుత బౌలింగ్‌తో జట్టును గెలిపించాడు. కొత్త బంతితో బౌలింగ్ చేసిన సిరాజ్.. వరుస బంతుల్లో రాహుల్ త్రిపాఠి, నితీశ్ రాణాను పెవిలియన్ చేర్చాడు. ఆ తర్వాత టామ్ బాంటన్ వికెట్ ఖాతాలో వేసుకొని (4-2-8-3) కెరీర్ బెస్ట్ గణంకాలను అందుకున్నాడు. అయితే ఈ మ్యాచ్‌‌కు ముందే సిరాజ్ తండ్రి హాస్పిటల్ పాలయ్యారు. ఆ తర్వాత కోలుకుని సిరాజ్‌తో మాట్లాడారు. ‘హైదరాబాద్‌లోని ప్రతి న్యూస్ పేపర్లో నీ ఫొటో ఉంది బేటా' అని ఆయన సంతోషించాడని ఓ ఇంటర్వ్యూలో సిరాజ్ చెప్పుకొచ్చాడు.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
 
Story first published: Sunday, November 22, 2020, 10:22 [IST]
Other articles published on Nov 22, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X