న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

Qualifier 2: ఉత్కంఠ మ్యాచ్‌లో కోల్‌కతాపై హైదరాబాద్ విజయం, పైనల్లో చెన్నైతో ఢీ

By Nageshwara Rao
IPL 2018, Qualifier 2: SRH vs KKR Live March report form Eden Gardens, Kolkata

హైదరాబాద్: సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ఫైనల్ చేరింది. ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన రెండో క్వాలిఫయిర్ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ 13 పరుగుల తేడాతో విజయం సాధించింది. సన్‌రైజర్స్ హైదరాబాద్ నిర్దేశించిన 175 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కోల్‌కతా నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 161 పరుగులు మాత్రమే చేయగలిగింది.

దీంతో ఆదివారం ముంబైలోని వాంఖడె స్టేడియంలో జరగనున్న ఫైనల్లో చెన్నై సూపర్ కింగ్స్‌తో సన్‌రైజర్స్ హైదరాబాద్ తలపడనుంది. ఈ సీజన్‌లో ఇప్పటికే మూడు సార్లు చెన్నై చేతిలో ఓడిన హైదరాబాద్ మళ్లీ తుదిపోరులో ఆ జట్టుతో అమితుమీ తేల్చుకోనుంది. సన్‌రైజర్స్ హైదరాబాద్‌కి ఇది రెండో ఐపీఎల్ ఫైనల్స్ కావడం విశేషం.

అటు బ్యాటింగ్‌లోనూ, ఇటు బౌలింగ్‌, ఫీల్డింగ్‌లో అద్భుత ప్రదర్శన చేసిన రషీద్ ఖాన్‌కు మ్యాచ్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలర్లలో రషీద్ ఖాన్ 3, సిద్దార్థ్ కౌల్, కార్లోస్ బ్రాత్‌వైట్ తలో 2 వికెట్లు తీసుకోగా... షకీబ్ అల్ హసన్‌ ఒక వికెట్ పడగొట్టాడు.


16 ఓవర్లకు కోల్‌కతా 132/6
ఈడెన్ గార్డెన్స్ వేదికగా సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ 16 ఓవర్లు ముగిసే సమయానికి 6 వికెట్లు కోల్పోయి 132 పరుగులు చేసింది. ఓపెనర్ సునీల్ నరైన్ (26) క్రీజులో ఉన్నంతసేపు మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. అనంతరం వచ్చిన నితీశ్ రాణా (22) లేని పరుగు కోసం ప్రయత్నించి రనౌటయ్యాడు. మరో ఓపెనర్ క్రిస్‌లిన్ (48) పరుగుల వద్ద ఔట్ కాగా, ఆ తర్వాత వచ్చిన రాబిన్ ఉతప్ప (2), దినేశ్ కార్తీక్ (8), ఆండ్రీ రసెల్ (3) తక్కువ స్కోరుకే ఔటవడంతో కోల్‌కతా పీకల్లోతు కష్టాల్లో పడింది. ఆ జట్టు విజయానికి ఇంకా 24 బంతుల్లో 43 పరుగులు చేయాల్సి ఉంది.


9 ఓవర్లకు కోల్‌కతా 88/2
ఈడెన్ గార్డెన్స్ వేదికగా సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ రెండో వికెట్‌ కోల్పోయింది. 175 పరుగుల లక్ష్యఛేదనకు దిగిన కోల్‌కతా నైట్‌రైడర్స్ మెరుగ్గా ఆడుతోంది. ఓపెనర్ సునీల్ నరైన్ (26) క్రీజులో ఉన్నంతసేపు పరుగుల మోత మోగించాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన నితీశ్ రాణా (22) లేని పరుగు కోసం ప్రయత్నించి రనౌటయ్యాడు. దీంతో 9 ఓవర్లు ముగిసే సమయానికి కోల్‌కతా 2 వికెట్లు కోల్పోయి 88 పరుగులు చేసింది. ఓపెనర్ క్రిస్‌లిన్ (37) నిలకడగా ఆడుతున్నాడు. ఆ జట్టు విజయానికి ఇంకా 66 బంతుల్లో 87 పరుగులు చేయాల్సి ఉంది.


తొలి వికెట్ కోల్పోయిన కోల్‌కతా
ఈడెన్ గార్డెన్స్ వేదికగా సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ తొలి వికెట్‌ కోల్పోయింది. సిద్ధార్ధ్‌ కౌల్‌ వేసిన నాలుగో రెండో బంతికే దూకుడుగా ఆడుతున్న సునీల్‌ నరైన్‌(26)ను బ్రాత్‌వైట్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో తొలి వికెట్‌కి 40 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. ప్రస్తుతం 6 ఓవర్లు ముగిసే సరికి కోల్‌కతా వికెట్‌ నష్టానికి 66 పరుగులు చేసింది. క్రీజులో క్రిస్‌ లిన్‌ (25), నితీశ్‌ రాణా (14) పరుగులతో ఉన్నారు.


దూకుడుగా ఆడుతోన్న కోల్‌కతా
సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ నిర్ధేశించిన 175 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన కోల్‌కతా ఇన్నింగ్స్‌ను ధాటిగా ఆరంభించింది. బలమైన బౌలింగ్‌ లైనప్‌ కలిగిన సన్‌రైజర్స్‌ బౌలర్లను దీటుగా ఎదుర్కొంటున్నారు. మూడు ఓవర్లు ముగిసేసరికి కోల్‌కతా వికెటేమీ కోల్పోకుండా 38పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో సునీల్‌ నరైన్‌ (24), క్రిస్ లిన్‌ (12) పరుగులతో ఉన్నారు.


కోల్‌కతా విజయ లక్ష్యం 175

ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్‌కతాతో జరుగుతున్న రెండో క్వాలిఫయిర్ మ్యాచ్‌లో చివర్లో రషీద్ ఖాన్ (34 నాటౌట్, 10 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్సులు) మెరుపు ఇన్నింగ్స్ ఆడటంతో సన్‌రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 174 పరుగులు చేసింది.

టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ జట్టు 18.1 ఓవర్లు ముగిసే సమయానికి 138/7తో నిలిచి తక్కువ స్కోరుకే పరిమితమయ్యేలా కనిపించినప్పటికీ, చివర్లో వరుస సిక్సర్లతో రషీద్ ఖాన్ చెలరేగడంతో హైదరాబాద్ జట్టు కోల్‌కతా ముందు భారీ లక్ష్యాన్ని ఉంచింది.

ఈ మ్యాచ్‌లో కోల్‌కతా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకోవడంతో తొలుత బ్యాటింగ్‌కి దిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్‌కి ఓపెనర్లు మంచి ఆరంభాన్ని అందించారు. వీరిద్దరు కలిసి తొలి వికెట్‌కి 56 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. కుల్దీప్ యాదవ్ వేసిన 8వ ఓవర్ తొలి బంతికి శిఖర్ ధవన్(34) ఎల్బీగా ఔటయ్యాడు.

ఆదే ఓవర్ ఐదో బంతికి కెప్టెన్ కేన్ విలియమ్‌సన్(3) కీపర్ దినేశ్ కార్తీక్‌కి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఈ దశలో వృద్ధిమాన్ సాహా స్కోర్ పెంచేందుకు కృషి చేశాడు. కానీ చావ్లా వేసిన 11వ ఓవర్‌లో దినేశ్ కార్తీక్ సాహా(35) స్టంప్ ఔటయ్యాడు. ఆ తర్వాత కొంత సమయానికే షకీబ్(28) కుల్దీప్ వేసిన 16వ ఓవర్ మొదటి బంతికి రనౌటయ్యాడు.

ఆ తర్వాతి ఓవర్‌లో దీపక్ హుడా(19) చావ్లాకి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అనంతరం బ్రాత్‌వైట్(8), యూసుఫ్ పఠాన్(3) స్వల్ప పరుగుల తేడాతో పెవిలియన్ చేరారు. చివర్లో రషీద్ ఖాన్(34) మెరుపులు మెరిపించడంతో హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. దీంతో కోల్‌కతాకు 175 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. కోల్‌కతా బౌలర్లలో కుల్దీప్ యాదవ్ 2, శివమ్ మావి, సునీల్ నరైన్, పియూష్ చావ్లా తలో వికెట్ తీశారు.


ఆరో వికెట్ కోల్పోయిన హైదరాబాద్
ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్‌కతాతో జరుగుతున్న రెండో క్వాలిఫయిర్ మ్యాచ్‌లో లేని పరుగు కోసం ప్రయత్నించి హైదరాబాద్ ఆరో వికెట్ కోల్పోయింది. ప్రసిద్ధ్ కృష్ణ వేసిన ఇన్నింగ్స్ 18వ ఓవర్ ఐదో బంతికి కార్లోస్ బ్రాత్‌వైట్(8) లేని పరుగ కోసం ప్రయత్నించి నితీష్ రాణా సూపర్ త్రోతో వికెట్‌ని సమర్పించుకున్నాడు. 18 ఓవర్లు ముగిసే సరికి హైదరాబాద్ 6 వికెట్లు కోల్పోయి 138 పరుగులు చేసింది. క్రీజులో రషీద్ ఖాన్ (4), యూసప్ పఠాన్(3) పరుగులతో ఉన్నారు.


17 ఓవర్లకు హైదరాబాద్ 124/5
ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్‌కతాతో జరుగుతున్న రెండో క్వాలిఫయిర్ మ్యాచ్‌లో హైదరాబాద్ ఐదో వికెట్ కోల్పోయింది. ఇన్నింగ్స్ 17వ ఓవర్ వేసిన సునీల్ నరైన్ బౌలింగ్‌లో దీపక్ హుడా(19) పరుగుల వద్ద పీయూష్ చావ్లాకి క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. దీంతో 17 ఓవర్లకు గాను 5 వికెట్లు కోల్పోయి హైదరాబాద్ 124 పరుగులు చేసింది. క్రీజులో యూసఫ్ పఠాన్(2), బ్రాత్ వైట్(0) పరుగుతో ఉన్నాడు.


15.1 ఓవర్లకు హైదరాబాద్ 113/4
ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్‌కతాతో జరుగుతున్న రెండో క్వాలిఫయిర్ మ్యాచ్‌లో హైదరాబాద్ నాలుగో వికెట్ కోల్పోయింది. కుల్దీప్ యాదవ్ వేసిన ఇన్నింగ్స్ 16వ ఓవర్ తొలి బంతికి షకీబ్ అల్ హసన్ (28) పరుగుల వద్ద రనౌట్‌గా వెనుదిరిగాడు. షకీబ్ అల్ హసన్‌ని కుల్దీప్ తెలివిగా ఔట్ చేశాడు. కుల్దీప్ బౌలింగ్‌లో బంతిని మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ దీపక్ హుడా (10 నాటౌట్) స్ట్రైట్‌‌ షాట్ ఆడగా.. తన పక్క నుంచి వెళ్తున్న బంతిని కుల్దీప్ టచ్ చేసి వికెట్లపైకి వెళ్లేలా చేశాడు. అప్పటికే క్రీజు వెలుపలికి వచ్చిన షకీబ్ నిరాశగా పెవిలియన్ బాట పట్టక తప్పలేదు. ప్రస్తుతం క్రీజులో దీపక్ హుడా (10), యూసఫ్ పఠాన్(0) పరుగులతో ఉన్నారు.


12 ఓవర్లకు హైదరాబాద్ 90/3
ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్‌కతాతో జరుగుతున్న రెండో క్వాలిఫయిర్ మ్యాచ్‌లో హైదరాబాద్ మూడో వికెట్ కోల్పోయింది. పియూష్ చావ్లా వేసిన ఇన్నింగ్స్ 11వ ఓవర్ మూడో బంతికి వృద్ధిమాన్ సాహ(35) పరుగుల వద్ద వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్‌కి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో 12 ఓవర్లు ముగిసే సరికి హైదరాబాద్ 3 వికెట్లు కోల్పోయి 90 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో దీపక్ హుడా(2), షకీబ్ అల్ హసన్(13) పరుగులతో ఉన్నారు.


ఒకే ఓవర్‌‌లో రెండు వికెట్లు కోల్పోయిన హైదరాబాద్
ఈడెన్ గార్డెన్స్ వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరుగుతున్న రెండో క్వాలిఫయర్ మ్యాచ్‌లో కోల్‌కతా బౌలర్ కుల్దీప్ యాదవ్ చెలరేగాడు. ఒకే ఓవర్‌లో రెండు వికెట్లు తీసి హైదరాబాద్‌ను దెబ్బకొట్టాడు. ఇన్నింగ్స్ 8వ ఓవర్ వేసిన కుల్దీప్ యాదవ్ తొలి బంతికి శిఖర్ ధావన్(34) పరుగుల వద్ద ఎల్బీగా వెనుదిరిగగా, ఆ తర్వాత అదే ఓవర్ ఐదో బంతికి కేన్ విలియమ్సన్(3) పరుగుల వద్ద దినేశ్ కార్తీక్‌కి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో 8 ఓవర్లు ముగిసే సరికి హైదరాబాద్ 2 వికెట్లు కోల్పోయి 61 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో వృద్ధిమాన్ సాహ(21), షకీబ్ అల్ హసన్(1) పరుగుతో ఉన్నారు.


3 ఓవర్లకు 18 పరుగులు చేసిన హైదరాబాద్
ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్‌కతాతో జరుగుతున్న రెండో క్వాలిఫయిర్ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ బ్యాట్స్ మన్ నిలకడగా ఆడుతున్నారు. 3 ఓవర్లు ముగిసే సరికి హైదరాబాద్ వికెట్ నష్టపోకుండా 18 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో శిఖర్ ధావన్ (10), వృద్ధిమాన్ సాహా(6) పరుగులతో ఉన్నారు.


టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న కోల్‌కతా నైట్‌రైడర్స్
ఐపీఎల్ టోర్నీలో భాగంగా రెండో ఫైనల్‌ బెర్త్‌ ఎవరిదో తేల్చుకునేందుకు శుక్రవారం కోల్‌కతా నైట్‌రైడర్స్, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్లు పోటీ పడుతున్నాయి. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన దినేశ్ కార్తీక్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు.

సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టులో మూడు మార్పులు చేసినట్లు కెప్టెన్ విలియమ్సన్ చెప్పాడు. మనీష్ పాండే, శ్రీవాత్స్ గోస్వామి, సందీప్ శర్మ స్థానాల్లో హుడా, సాహా, ఖలీల్‌ను తుది జట్టులోకి తీసుకున్నట్లుతెలిపాడు. మరోవైపు కోల్‌కతా జట్టులో ఒక్క మార్పు మాత్రమే జరిగింది. జావన్ సీర్లెస్‌ స్థానంలో శివమ్ మావిని తీసుకున్నట్లు దినేష్ కార్తీక్ వెల్లడించాడు.

ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు ఆదివారం చెన్నై సూపర్‌ కింగ్స్‌తో ఫైనల్లో తలపడనుంది. దీంతో ఈ మ్యాచ్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. కాగా లీగ్‌ దశలో మూడు, ప్లేఆఫ్స్‌లో ఒక మ్యాచ్‌ ఓటమితో సతమతమవుతున్న సన్‌రైజర్స్ జట్టు ఈ మ్యాచ్‌లో గెలిచి పరువు దక్కించుకోవాలని భావిస్తోంది.

మరోవైపు ఈ మ్యాచ్‌లో గెలిచి ఫైనల్స్‌కి దూసుకెళ్లాలని కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టు ఉవ్విళ్లూరుతోంది. కోల్‌కతా నైట్‌రైడర్స్ సొంత మైదానమైన ఈడెన్‌ గార్డెన్స్‌లో ఈ మ్యాచ్ జరుగుతుండటంతో కోల్‌కతా జట్టు ఫేవరేట్‌గా బరిలోకి దిగుతుంది.

కోల్‌కతా నైట్‌రైడర్స్ సొంత మైదానమైన ఈడెన్‌ గార్డెన్స్‌లో ఈ మ్యాచ్ జరుగుతుండటంతో కోల్‌కతా జట్టు ఫేవరేట్‌గా బరిలోకి దిగుతుంది.

జట్ల వివరాలు:
కోల్‌కతా నైట్‌రైడర్స్:

సునీల్ నరైన్, క్రిస్ లిన్, రాబిన్ ఉతప్ప, నితీష్ రానా, దినేశ్ కార్తీక్(కెప్టెన్/కీపర్), శుభ్‌మాన్ గిల్, అండ్రే రస్సెల్, పియూష్ చావ్లా, కుల్దీప్ యాదవ్, ప్రశిద్ధ్ కృష్ణ, శివం మావి.

సన్‌రైజర్స్ హైదరాబాద్:
శిఖర్ ధావన్, కేన్ విలియమ్‌‌సన్(కెప్టెన్), షకీబ్ అల్ హసన్, యూసుఫ్ పఠాన్, వృద్ధిమాన్ సాహా(కీపర్), కరోల్ బ్రాత్‌వైట్, భువనేశ్వర్ కుమార్, రషీద్ ఖాన్, సిద్ధార్త్ కౌల్, కె ఖలీల్ అహ్మద్.

Story first published: Friday, May 25, 2018, 23:19 [IST]
Other articles published on May 25, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X