వైజాగ్ కాదు: చెన్నై సూపర్ కింగ్స్ తదుపరి మ్యాచ్‌లు పూణెకు తరలింపు

Posted By:
Chennai Super Kings

హైదరాబాద్: ఐపీఎల్ 11వ సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ ఆడబోయే తదుపరి మ్యాచ్‌లను బీసీసీఐ పూణెకి తరలించింది. ఈ మేరకు ఐపీఎల్ ఛైర్మన్ రాజీవ్ శుక్లా బుధవారం అధికారిక ప్రకటన చేశారు. రెండేళ్ల తర్వాత మంగళవారం చెపాక్ స్టేడియంలో తొలి ఐపీఎల్ మ్యాచ్ నిర్వహించగా నిరసనకారుల నుంచి ఆటంకాలు ఎదురైన సంగతి తెలిసిందే.

ఐపీఎల్ 2018 స్పెషల్ వెబ్ సైట్ | ఐపీఎల్ 2018 పూర్తి షెడ్యూల్

కావేరీ జల వివాదం నేపథ్యంలో మ్యాచ్‌ను జరగనివ్వమని ఇప్పటికే స్పష్టం చేసిన కొన్ని రాజకీయ పార్టీల నేతలు, సంఘాల నాయకులు మైదానంలోకి వెళ్తున్న క్రికెట్ అభిమానులపై ఆందోళనకారులు దాడికి కూడా పాల్పడ్డారు. దీంతో కోల్‌కతా క్రికెటర్లు స్టేడియానికి రావడం ఆలస్యమైంది. 400 మంది ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

మ్యాచ్ నిర్వహణకు వ్యతిరేకంగా కొంతమంది నిరసనకారులు నలుపు రంగు బెలూన్లను కూడా గాల్లోకి విడుదల చేశారు. చెపాక్ స్టేడియం పరిసరాల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొనడంతో ఐపీఎల్ ఛైర్మన్ రాజీవ్ శుక్లా ఆందోళన వ్యక్తం చేశారు. ఇక, చెన్నై జట్టు ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో ఆటగాళ్లపై వారు బూట్లు విసిరి తమదైన శైలిలో నిరసన వ్యక్తం చేశారు.

లాంగ్‌ ఆన్‌లో ఫీల్డింగ్ చేస్తున్న రవీంద్ర జడేజా లక్ష్యంగా బూట్లు విసరగా, అవి గురి తప్పి బౌండరీ లైన్ వద్ద పడ్డాయి. ఆ సమయంలో అక్కడ దక్షిణాఫ్రికా ఆటగాళ్లు డుప్లెసిస్, ఎంగిడి ఉన్నారు. దీంతో ఆటకు కొద్దిసేపు అంతరాయం కలిగింది. రవీంద్ర జడేజాపై బూట్లు విసిరిన ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

బుధవారం తమిళ పార్టీలు చేపట్టిన రైల్‌రోకోలో ఓ ఉద్యమకారుడు అనూహ్య రీతిలో దుర్మరణం చెందాడు. దీంతో ఆందోళనకారుల ఆవేశం తారాస్థాయికి చేరింది. ఉద్యమం తీవ్రతరం కావడంతో మున్ముందు జరగబోయే మ్యాచ్‌లకు భద్రత కల్పించలేమని పోలీసు శాఖ చేతులెత్తేసింది.

ఈ నేపథ్యంలో మిగతా మ్యాచ్‌లను చెన్నైలో నిర్వహించకపోవడమే మంచిదన్న అభిప్రాయంతో ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ ఈ నిర్ణయం తీసుకుంది. మ్యాచ్‌లను పూణెకు తరలించడంలో చెన్నై సూపర్ కింగ్స్‌కు ఎలాంటి వ్యతిరేకతా లేదని ఐపీఎల్ చైర్మన్ రాజీవ్ శుక్లా తెలిపారు.

ఈ నేపథ్యంలో చెన్నై సూపర్ కింగ్స్ హోం మ్యాచ్‌ల నిర్వహణ కోసం నాలుగు నగరాలను ప్రత్యామ్నాయంగా ఎంపిక చేసినట్టు సీఓఏ చీఫ్‌ వినోద్‌ రాయ్‌ తెలిపారు. ఈ నాలుగు ప్రధాన నగరాలు అవి విశాఖపట్నం, త్రివేండ్రం, పుణె, రాజ్‌కోట్‌. అయితే, ఈ నాలుగింటిలో చెన్నై ఫ్రాంచైజీ దృష్టిలో మొదటి పేరు మాత్రం విశాఖపట్నంగానే ఉందనే వార్తలు కూడా వెలువడ్డాయి.

రాకపోకలు సాగించడానికి కూడా విశాఖపట్నం కంటే పూణె మెరుగైన నగరమని బీసీసీఐ భావించింది. వైజాగ్ నుంచి ఇండోర్ వెళ్లాలంటే ముందుగా ఢిల్లీ వెళ్లి అక్కడి నుంచి ఇండోర్ చేరుకోవాల్సి ఉంటుంది. పూణెకు మిగతా నగరాలతో మెరుగైన కనెక్టివిటీ ఉంది. ఈ కారణంగానే బీసీసీఐ వైజాగ్‌ను కాదని పూణె ఎంచుకున్నట్లు తెలుస్తోంది. టోర్నీలో భాగంగా చెన్నై తమ తదుపరి హోం మ్యాచ్‌ను ఏప్రిల్ 20న రాజస్థాన్ రాయల్స్‌తో ఆడనుంది.

రికెట్ అంటే ఇష్టమా? నిరూపించు! మైఖేల్ ఫాంటసీ క్రికెట్ ఆడు

Story first published: Wednesday, April 11, 2018, 23:47 [IST]
Other articles published on Apr 11, 2018

Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి