యువీ, గేల్ కొన్ని మ్యాచ్‌లు గెలిపిస్తే టైటిల్ మాదే: టీమ్ జెర్సీ ఆవిష్కరణలో సెహ్వాగ్

Posted By:
Ashwin-led Kings XI Punjab

హైదరాబాద్: రవిచంద్రన్ అశ్విన్ నాయకత్వంలోని ప్రస్తుత కింగ్స్‌ ఎలెవన్‌ జట్టే గత పదేళ్ల ఐపీఎల్‌లో అత్యుత్తమ జట్టు అని ఆ జట్టు మెంటార్ వీరేంద్ర సెహ్వాగ్ వ్యాఖ్యానించాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2018 సీజన్‌లో భాగంగా మంగళవారం పంజాబ్ యాజమాన్యం టీమ్ జెర్సీని ఆవిష్కరించింది.

ఈ సందర్భంగా ఆ జట్టు మెంటార్ వీరేంద్ర సెహ్వాగ్ మాట్లాడుతూ 'ఈ ఏడాది అద్భుతమైన జట్టు పంజాబ్ సొంతం. ఛాంపియన్‌షిప్‌ను తప్పక గెలుస్తాం. కొంతమంది ఆటగాళ్లపై పెద్దమొత్తంలో డబ్బు ఖర్చుపెట్టాం. పెట్టిన పెట్టుబడికి తగిన రాబడి సైతం వస్తుందన్న అనుకుంటున్నా. ప్రస్తుత కింగ్స్‌ ఎలెవన్‌ జట్టే పదేళ్లలో ఉత్తమ జట్టు అని అనుకుంటున్నాను' అని అన్నాడు.

'గత కొన్నేళ్లుగా వృద్ధిమాన్ సాహా, అక్షర పటేల్ తప్ప మా జట్టులో సత్తాగల భారత ఆటగాళ్లు లేరు. ఐపీఎల్ ఛాంపియన్ అవ్వాలంటే జట్టులో చక్కటి ప్రదర్శన చేసే భారత ఆటగాళ్లు ఉండాలి. ఈసారి నలుగురు నుంచి ఐదుగురు వరకు జట్టులో ఉన్నారు' అని సెహ్వాగ్ తెలిపాడు.

'ఈ సారి మాత్రం కేఎల్‌ రాహుల్‌, కరుణ్‌ నాయర్‌, మనోజ్‌ తివారీ మిడిలార్డర్‌లో నిలవగలరు. గేల్‌, ఫించ్‌తో పాటు డేవిడ్‌ మిల్లర్‌ సైతం ఉన్నారు. ఇక అశ్విన్‌ నాయకత్వంలో ఆండ్రూ టై, బరిందర్‌ శరణ్‌, సందీప్‌ శర్మ, అంకిత్‌ రాజ్‌పుత్‌ బౌలింగ్ ‌బృందం రాణిస్తుందన్న నమ్మకం ఉంది' అని చెప్పాడు.

'బౌలింగ్‌ కెప్టెన్ మ్యాచ్‌లు గెలిపించగలడు. చివరి ఓవర్‌లో 8, 10, 15 పరుగులు అవరమైనప్పుడు బౌలర్లు మాత్రమే మ్యాచ్‌లు గెలిపించగలరు. బౌలింగ్‌ కెప్టెన్ ఆలోచనా విధానం కాస్తంత వైవిధ్యంగా ఉంటుంది. అందుకే కపిల్‌ దేవ్‌, ఇమ్రాన్‌ ఖాన్‌, వసీమ్‌ అక్రమ్‌ను నేను ఇష్టపడేది' అని తెలిపాడు.

యవరాజ్‌ సింగ్‌, వెస్టిండీస్‌ విధ్వంసక ఓపెనర్‌ క్రిస్‌గేల్‌ కొన్ని మ్యాచ్‌లు గెలిపిస్తే ఈ ఏడాది తప్పకుండా ఐపీఎల్ టైటిల్ గెలుస్తామని సెహ్వాగ్ ధీమా వ్యక్తం చేశాడు. బెంగళూరు వేదికగా జరిగిన వేలంలో క్రిస్ గేల్‌, యువరాజ్‌లను పంజాబ్ జట్టు రూ.2 కోట్ల కనీస ధరకే సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.

'దిగ్గజ ఆటగాళ్లు కనీస ధరకే దక్కడం మా అదృష్టం. బిడ్డర్లు ఏ మాత్రం తొందరపడినా వారి ధర అమాంతం పెరిగేదేమో. యువీ, గేల్‌ తొలి దశలో మూడు నాలుగు మ్యాచ్‌లు గెలిపిస్తే మేం పెట్టిన పెట్టుబడిపై కచ్చితంగా రాబడి వస్తుంది. తొలి రెండు మ్యాచ్‌లకు ఫించ్‌ అందుబాటులో ఉండడు. మయాంక్‌తో కలిసి గేల్‌ ఓపెనింగ్‌కు దిగొచ్చు' అని సెహ్వాగ్ అన్నాడు.

'ఫించ్‌ వస్తే మాత్రం ఎంపికలో తలనొప్పి తప్పకపోవచ్చు. అయితే అతడు ఏ స్థానంలోనైనా ఆడగలిగి ఉండటం మా అదృష్టం' అని సెహ్వాగ్ తెలిపాడు. ఐపీఎల్ 2010 సీజన్లో రవిచంద్రన్ అశ్విన్ నాయకత్వంలో పంజాబ్ జట్టు బరిలోకి దిగుతోంది. పంజాబ్ పేస్ బౌలర్లను ఆండ్రూ టై ముందుండి నడిపించనున్నాడు. బరిందర్ శరణ్, అంకిత్ రాజ్‌పుత్‌లకు అతడు నిర్దేశం చేయనున్నాడు.

'అనుభవం కలిగిన బౌలింగ్ లైనప్ లేకపోయినప్పటికీ, మంచి బౌలర్లను కలిగి ఉన్నాం. జట్టులో అత్యుత్తమ ప్రదర్శనను అశ్విన్ రాబట్టగలడని నమ్ముతున్నా' అని సెహ్వాగ్ అన్నాడు.

Story first published: Tuesday, March 13, 2018, 21:01 [IST]
Other articles published on Mar 13, 2018

Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి