ఐపీఎల్ 2026 సీజన్ ప్రారంభానికి ముందు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ)కు పెద్ద ఉపశమనం లభించింది. బెంగళూరులో చిన్నస్వామి స్టేడియంలో మ్యాచ్‌లు నిర్వహించుకునేందుకు కర్ణాటక ప్రభుత్వం అనుమతి మంజూరు చేసింది.
ప్రభుత్వం ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ స్టేడియంలోని భద్రత, సంసిద్ధత చర్యలను పరిశీలించి క్లీన్ చీట్ ఇచ్చింది. దాంతో కర్ణాటక ప్రభుత్వం మ్యాచ్‌లు నిర్వహించేందుకు అనుమతిచ్చింది. సోమవారం విధాన సౌధలో హోం మంత్రి జి పరమేశ్వర అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. దాంతో ఆర్‌సీబీ హోమ్ మ్యాచ్‌లు చిన్నస్వామి స్టేడియం వేదికగా జరగనున్నాయి.
ఐపీఎల్ 2026 సీజన్‌లో ఆర్‌సీబీ.. చిన్నస్వామి స్టేడియంలో 5 మ్యాచ్‌లు ఆడనుంది. తన రెండో హోమ్ గ్రౌండ్‌గా రాయ్‌పుర్‌లోని షహీద్ వీర్ నారాయణ సింగ్ స్టేడియాన్ని ఎంచుకున్న ఆర్‌సీబీ.. అక్కడ రెండు లీగ్ మ్యాచ్‌లు ఆడనుంది.
ఐపీఎల్‌లో ఒక ప్లే ఆఫ్ మ్యాచ్, ఫైనల్ కూడా బెంగళూరులో నిర్వహించే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. గతేడాది ఆర్‌సీబీ విజయోత్సవ ర్యాలీ సందర్భంగా తొక్కిసలాట చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఘటనలో 11 మంది అభిమానులు ప్రాణాలు కోల్పోయారు.

ఈ ఘటనపై సీరియస్ అయిన ప్రభుత్వం.. జస్టిస్ కున్వా సారథ్యంలోని కమిటీతో విచారణ జరిపించింది. ఆ కమిటీ సూచనల మేరకు కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో భద్రతా చర్యలు చేపట్టింది. తొక్కిసలాట వంటి ఘటనలు పునరావృతం కాకుండా చిన్నస్వామి స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్‌ల సందర్భంగా 35 వేల మంది ప్రేక్షకులకు మాత్రమే అనుమతి ఇవ్వనున్నారు.
అలాగే చివరి నిమిషంలో రద్దీని నివారించడానికి మ్యాచ్‌కు ముందు 3, 4 గంటల ముందే స్టేడియం గేట్లను తెరవనున్నారు. మహిళలు, పిల్లలకు ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేయనున్నారు. బెంగళూరు మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ భాగస్వామ్యంతో టికెట్ కలిగి ఉన్న ప్రేక్షకులకు మెట్రోలో ఉచిత ప్రయాణ వసతి కల్పించనున్నారు.