యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ పేరిట ఉన్న అరుదైన ఐపీఎల్ రికార్డును బద్దలు కొడుతానని టీమిండియా టీనేజ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ అన్నాడు. ఐపీఎల్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ రికార్డ్ క్రిస్ గేల్ పేరిట ఉంది. అతను ఐపీఎల్ 2013 సీజన్‌లో పుణె వారియర్స్ ఇండియాపై ఆర్‌సీబీ తరఫున 66 బంతుల్లో 175 పరుగులు చేశాడు. గత 13 ఏళ్లుగా ఈ రికార్డు చెక్కు చెదరకుండా ఉంది.

అయితే ఈ రికార్డును అధిగమించడమే తన లక్ష్యమని వైభవ్ సూర్యవంశీ తెలిపాడు. న్యూఢిల్లీ వేదికగా ఆదివారం జరిగిన బీసీసీఐ నమన్ అవార్డ్స్ కార్యక్రమంలో వైభవ్ ఈ విషయాన్ని వెల్లడించాడు. హోస్ట్ హర్ష భోగ్లే.. వైభవ్‌కు మూడు ఆప్షన్స్ ఇచ్చాడు. ఒకే ఓవర్‌లో ఆరు సిక్స్‌లు, ఐపీఎల్‌లో అత్యంత వేగవంతమైన సెంచరీ చేయడం, క్రిస్ గేల్ 175 పరుగుల రికార్డును అధిగమించడం.. వీటిల్లో ఏది టార్గెట్? అని అడిగారు. దానికి వైభవ్ స్పందిస్తూ.. 'క్రిస్ గేల్ చేసిన 175 రన్స్ రికార్డును అధిగమించడం'అని బదులిచ్చాడు.

రాజస్థాన్ రాయల్స్ కప్ అందించడం కూడా తన లక్ష్యమని వైభవ్ వెల్లడించాడు. అయితే తాను ఎప్పుడూ గేమ్ పైనే ఫోకస్ చేస్తానని, బయట జరిగే చర్చ గురించి ఆలోచించనని స్పష్టం చేశాడు.
'నేనేం చేయగలనో దానిపై దృష్టి పెడతా. మైదానంలో బాగా ఆడితే ఆటోమేటిక్‌గా మనపై అందరి అటెన్షన్ ఉంటుంది. ఒకవేళ సరిగ్గా ఆడకపోయినా ఏవో మాటలు అంటారు. కానీ, నేనెప్పుడూ వాటిని పట్టించుకోను. నా ఆట పైనే ఫోకస్ చేస్తా. తొలిసారి నేను అండర్ 19 ప్రపంచకప్ ఆడా. ఫైనల్లో సెంచరీ చేయడం గర్వంగా ఉంది. జట్టు ఛాంపియన్‌గా నిలవడంలో నావంతు భాగస్వామ్యం అందించగలిగాను. అలాగే రాజస్థాన్ రాయల్స్‌కు కప్ అందించాలి. ఈ ఏడాది నా లక్ష్యాల్లో అదొకటి. అంకితభావంతో పనిచేస్తే సక్సెస్ వస్తుందని నమ్ముతా'అని వైభవ్ తెలిపాడు.
