బీసీసీఐ నమన్ అవార్డ్స్ ప్రదానోత్సవ కార్యక్రమం న్యూఢిల్లీలో అంగరంగ వైభవంగా జరిగింది. ఆదివారం నిర్వహించిన ఈ కార్యక్రమంలో భారత ప్రస్తుత, మాజీ క్రికెటర్లను బీసీసీఐ పలు అవార్డులతో ఘనంగా సత్కరించింది. అయితే ఈ వేడుకను ప్రత్యక్ష ప్రసారం చేసిన అధికారిక బ్రాడ్‌కాస్టర్ స్టార్ స్పోర్ట్స్, జియో హాట్ స్టార్ ఘోర తప్పిదం చేశాయి.
ఈ తప్పిదంపై రోహిత్ శర్మ అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రోహిత్ శర్మ సారథ్యంలో టీమిండియా ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025ని గెలిచిన సంగతి తెలిసిందే. అయితే బ్రాడ్‌కాస్టర్స్ పొరపాటున శుభ్‌మన్ గిల్‌ను ఛాంపియన్స్ ట్రోఫీ 2025 విజేతగా స్క్రీన్‌పై చూపించారు. ఇందుకు సంబంధించిన స్క్రీన్ షాట్స్ నెట్టింట వైరల్ కాగా.. రోహిత్ అభిమానులు మండిపడుతున్నారు.
బ్రాడ్‌కాస్టర్స్‌తో పాటు శుభ్‌మన్ గిల్‌ను సోషల్ మీడియా వేదికగా ఏకిపారేస్తున్నారు. శుభ్‌మన్ గిల్ కెప్టెన్‌గా ఏ పెద్ద టోర్నీని గెలవలేదని గుర్తు చేస్తున్నారు. గతేడాది రోహిత్ శర్మ నుంచి శుభ్‌మన్ గిల్ వన్డే కెప్టెన్సీ బాధ్యతలు అందుకున్నాడు. ఈ నిర్ణయాన్ని కూడా రోహిత్ ఫ్యాన్స్ తప్పుబట్టారు.

మరోవైపు 2024-25 సీజన్‌లో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన శుభ్‌మన్ గిల్‌కు పాలి ఉమ్రిగర్ ప్లేయర్ ఆఫ్ ది అవార్డు లభించింది. ఈ పురస్కారం గిల్‌కు దక్కడం ఇది రెండోసారి. 2023లో కూడా గిల్ ఈ అవార్డు అందుకున్నాడు. మహిళల క్రికెట్ నుంచి స్మృతి మంధాన ఈ అవార్డును అందుకుంది. ఆమెకు ఈ అవార్డు దక్కడం ఐదోసారి.
భారత క్రికెట్‌కు విశేష కృషి చేసిన రోజర్ బిన్నీ, రాహుల్ ద్రవిడ్, మిథాలీ రాజ్‌లకు సి.కె. నాయుడు జీవితకాల సాఫల్య పురస్కారాలు ప్రదానం చేశారు. 2025 ఛాంపియన్స్ ట్రోఫీ, 2025 మహిళల వన్డే ప్రపంచకప్, 2025 అండర్-19 మహిళల ప్రపంచకప్, 2026 పురుషుల అండర్-19 ప్రపంచకప్, 2026 టీ20 ప్రపంచకప్ వంటి ఐదు టైటిళ్లను గెలుచుకున్న భారత జట్లను కూడా ఈ వేడుకలో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమానికి రోహిత్ శర్మతో పాటు విరాట్ కోహ్లీ దూరంగా ఉన్నారు.