అనుకున్నదే అయింది: హైదరాబాద్ టీ 20 వర్షార్పణం

Posted By:

హైదరాబాద్: అభిమానులు ఊహించిందే జరిగింది. వర్షం కారణంగా నగరంలో శుక్రవారం భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య జరగాల్సిన మూడో టీ20ని అంఫైర్లు రద్దు చేశారు. గత పది రోజులుగా హైదరాబాద్‌ను వర్షాలు ముంచెత్తుతున్న సంగతి తెలిసిందే. శుక్రవారం కూడా వర్షం కురువడంతో ఉప్పల్ స్టేడియంలోని అవుట్ ఫీల్డ్ మొత్తం తడిసి ముద్దయింది.

ఈ మేరకు పలుమార్లు పిచ్‌ను పరిశీలించిన అంపైర్లు మ్యాచ్ రద్దుకే మొగ్గుచూపారు. ప్రధానంగా అవుట్ ఫీల్డ్ దిగబడుతూ ఉండటంతో మ్యాచ్ ఒక్క బంతి పడకుండానే రద్దయ్యింది. కాగా, చాన్నాళ్ల తర్వాత ఉప్పల్ స్టేడియంలో జరుగుతున్న మ్యాచ్ కావడంతో అభిమానులతో స్టేడియం కిక్కిరిసింది.

ఈ సమయంలో అంఫైర్లు మ్యాచ్ రద్దు నిర్ణయాన్ని తెలియజేయడంతో అభిమానులు నిరాశకు గురయ్యారు. మూడు టీ20ల మ్యాచ్‌లో ఇప్పటికే ఇరు జట్లు చెరో మ్యాచ్ నెగ్గడంతో 1-1తో సమమైంది. మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా రాంచీలో జరిగిన తొలి టీ20లో టీమిండియా విజయం సాధించగా, గువహటిలో జరిగిన రెండో టీ 20లో ఆస్ట్రేలియా విజయం సాధించింది.

టాస్ ఆలస్యం కావడంతో అంతకుముందు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, వికెట్ కీపర్ మహేంద్ర్ సింగ్ ధోని, వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ కాసేపు ఎడమ చేత్తో బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశారు.

టాస్‌కు మళ్లీ అంతరాయం

మూడో టీ20కి మళ్లీ వరుణుడు అంతరాయం కలిగించాడు. స్టేడియంలోని అవుట్ ఫీల్డ్ ఇంకా తడిగానే ఉండటంతో మ్యాచ్ ప్రారంభం మరింత ఆలస్యం కానుంది. సాయంత్రం 7 గంటలకు గ్రౌండ్‌ను తనిఖీ చేయనున్నట్లు బీసీసీఐ ప్రకటించింది. దీంతో.. గ్రౌండ్‌ను తనిఖీ చేసిన బీసీసీఐ గ్రౌండ్ ఇంకా పచ్చిగా ఉండటంతో.. మళ్లీ రాత్రి 7.45 గంట‌ల‌కు గ్రౌండ్‌ను తనిఖీ చేయనున్నట్లు ప్రకటించింది.

మూడో టీ20 కోసం స్టేడియానికి వ‌చ్చేస్తున్నా: ఆమీర్ ఖాన్‌

భారత్-ఆసీస్ జట్ల మధ్య జరిగే మూడో టీ20 కోసం ఉప్ప‌ల్‌ స్టేడియానికి బ‌య‌లుదేరాన‌ని బాలీవుడ్ నటుడు ఆమీర్ ఖాన్ తెలిపారు. ఈ మేరకు ఆమీర్ ఖాన్ ట్విట్టర్‌లో ట్విట్ చేశాడు. ఫ‌లితాన్ని తేల్చ‌నున్న‌ చివ‌రి మ్యాచ్‌ను గ్రేట్ గేమ్‌గా అభివ‌ర్ణించాడు. ఈ మ్యాచ్ చూడాల‌ని ఎంతో ఆత్రుత‌గా ఉంద‌ని తెలిపాడు.

ఆలస్యం కానున్న టాస్
నగరంలో భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న మూడో టీ20లో టాస్ ఆలస్యం కానుంది. గత పది రోజులుగా హైదరాబాద్‌ను వర్షాలు ముంచెత్తుతున్నాయి. గురువారం రాత్రి భారీ వర్షానికి స్టేడియం తడిసి ముద్దయింది. ఈ నేపథ్యంలో అవుట్ ఫీల్డ్ అంతా చిత్తడిగా మారింది. శుక్రవారం హైదరాబాద్‌లో ఇప్పటి వరకు వర్షం కురవకపోయినా రాత్రి మ్యాచ్ జరిగే సమయంలో కురిస్తే పరిస్థితి ఏంటని అభిమానుల్లో కాస్త ఆందోళన ఉంది.

ఐదు వన్డేల సిరిస్‌ను 4-1తో కైవసం చేసుకున్న టీమిండియా, ఇప్పుడు టీ20 సిరిస్‌పై కన్నేసింది. మూడు టీ20ల సిరిస్‌లో ఇరు జట్లు 1-1తో సమంగా ఉన్నాయి. గువహటి ఓటమితో అప్రమత్తమైన కోహ్లీసేన ఆఖరి టీ20లో నెగ్గి సిరిస్‌ను కైవసం చేసుకోవాలని ఉవ్విళ్లూరుతోంది.

మరోవైపు భారత పర్యటనలో తొలిసారిగా విజయం సాధించిన ఆస్ట్రేలియా, టీ20 సిరీస్‌ అయినా నెగ్గి స్వదేశానికి బయల్దేరాలని పట్టుదలతో ఉంది. చాన్నాళ్ల తర్వాత హైదరాబాద్ వేదికగా మ్యాచ్ జరుగుతుండటంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. సిరీస్‌ ఫలితాన్ని తేల్చే టీ20 కావడంతో మూడో టీ20పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఉప్పల్‌ స్టేడియంలో జరుగుతున్న తొలి అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌ ఇది. భారత్‌లో అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌కు ఆతిథ్యమిస్తున్న 19వ వేదికగా ఉప్పల్‌ స్టేడియం నిలిచింది. గత రెండు ఐపీఎల్‌ సీజన్‌లలో 15 తొలి ఇన్నింగ్స్‌ల్లో 11 సార్లు 160కి కంటే తక్కువ స్కోర్లు నమోదయ్యాయి.

ఈ మ్యాచ్‌లో కోహ్లీ ఓ అరుదైన మైలురాయికి దగ్గర్లో ఉన్నాడు. టీ20ల్లో 200 బౌండరీల మైలురాయికి కోహ్లీ ఒక ఫోర్‌ దూరంలో ఉన్నాడు. దిల్షాన్‌ (223), షెజాద్‌ (200) ఇంతకుముందే ఈ ఘనత సాధించారు. కాగా, ఐపీఎల్‌లో సన్‌రైజర్స్‌కు కెప్టెన్‌గా ఉన్న వార్నర్‌కు ఉప్పల్‌ స్టేడియం అచ్చొచ్చిన వేదిక. ఉప్పల్‌ స్టేడియంలో టీ20ల్లో 61.47 సగటు, 162.79 స్ట్రైక్‌రేటుతో అందరికంటే ఎక్కువగా 1291 పరుగులు చేశాడు.

జట్ల వివరాలు:

భారత్: ధావన్‌, రోహిత్‌, కోహ్లి (కెప్టెన్‌), కేఎల్‌ రాహుల్‌, ధోని (వికెట్‌ కీపర్‌), కేదార్‌ జాదవ్‌, హార్దిక్‌ పాండ్య, భువనేశ్వర్‌, కుల్దీద్‌యాదవ్‌, బుమ్రా, చాహల్‌

ఆస్ట్రేలియా: ఫించ్‌, వార్నర్‌ (కెప్టెన్‌), హెన్రిక్స్‌, హెడ్‌, మ్యాక్స్‌వెల్‌, స్టాయ్‌నిక్స్‌, పైన్‌ (వికెట్‌ కీపర్‌), కౌల్టర్‌నీల్‌, ఆండ్రూ టై, జంపా, బెహ్రన్‌డార్ఫ్‌

Story first published: Friday, October 13, 2017, 18:28 [IST]
Other articles published on Oct 13, 2017
Please Wait while comments are loading...
POLLS