For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

అభిషేక్ శర్మ సక్సెస్ సీక్రెట్: ఆ ముగ్గురే నా బలం!

టీ20 ప్రపంచ కప్ 2026లో టీమిండియా విజేతగా నిలవడంలో యువ ఓపెనర్ అభిషేక్ శర్మ కీలక పాత్ర పోషించాడు. ముఖ్యంగా వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌లో మెరుపు అర్థశతకంతో భారత్‌కు చిరస్మరణీయమైన విజయాన్ని అందించాడు. అయితే ఈ టోర్నీ ఆరంభంలో అభిషేక్ శర్మ ఎదుర్కొన్న విమర్శలు, వరుస వైఫల్యాల సమయంలో అతనికి అండగా నిలిచిన ఆ ముగ్గురు వ్యక్తుల గురించి తాజాగా అభిషేక్ శర్మ నోరు విప్పాడు.

వరుసగా మూడు డకౌట్లు.. విమర్శల వర్షం
టీ20 వరల్డ్ కప్‌కు ముందు భీకర ఫామ్‌లో ఉన్న అభిషేక్ శర్మ టోర్నీ ఆరంభంలో తీవ్రంగా నిరాశపరిచాడు. వరుసగా 3 మ్యాచ్‌ల్లో కనీసం ఖాతా తెరవకుండానే డకౌట్ అయ్యాడు. ఓ యువ ఆటగాడికి ఇది అత్యంత కఠినమైన సమయం. అలాంటి స్థితిలో ఫైనల్ వంటి కీలక మ్యాచ్‌లో కేవలం 18 బంతుల్లోనే 52 పరుగులు చేసి సత్తా చాటడం వెనుక ముగ్గురు వ్యక్తుల ప్రోత్సాహం ఉందని అభిషేక్ శర్మ వెల్లడించాడు.

Abhishek Sharma Reveals the Trio Behind His Success From 3 Ducks to World Cup Final Hero

అండగా నిలిచిన 'త్రిమూర్తులు'
తనను మానసికంగా బలోపేతం చేసిన ఆ ముగ్గురు వ్యక్తులు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, మెంటర్ యువరాజ్ సింగ్ అని అభిషేక్ శర్మ వెల్లడించాడు. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ జట్టు యాజమాన్యం వైపు నుంచి పూర్తి మద్దతు అందించారని అభిషేక్ పేర్కొన్నాడు. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ గురించి మాట్లాడుతూ.. "డకౌట్ తర్వాత కూడా సూర్య భాయ్ నా దగ్గరకు వచ్చి.. ఫలితం గురించి ఆలోచించకుండా నీ సహజ సిద్ధమైన ఆటను కొనసాగించు అని చెప్పారు. కెప్టెన్ నుంచి అలాంటి మద్దతు దొరకడం నాలో ఆత్మవిశ్వాసాన్ని నింపింది" అని అభిషేక్ శర్మ చెప్పాడు. మెంటర్ యువరాజ్ సింగ్ గురించి మాట్లాడుతూ.. "యువీ పాజీతో నేను నిరంతరం మాట్లాడుతుంటాను. నువ్వు ఎలాంటి ప్లేయర్‌వో ఆ శైలిని మార్చుకోకు.. దూకుడుగా ఆడే ప్లేయర్లకు ఇలాంటి గడ్డు కాలం రావడం సహజం, నీ బలం మీద నమ్మకం ఉంచు అని ఆయన నాకు ధైర్యం చెప్పారు" అని అభిషేక్ పేర్కొన్నాడు.

ప్రపంచ కప్ నేర్పిన అతిపెద్ద పాఠం
ఈ ప్రపంచకప్ ప్రయాణం తనకి ఓ గొప్ప పాఠాన్ని నేర్పిందని అభిషేక్ చెప్పాడు. "వరల్డ్ కప్ మనకు మానసిక దృఢత్వం ఎంత అవసరమో చాలా త్వరగా నేర్పిస్తుంది. ఒక మంచి ఇన్నింగ్స్ ఆడినప్పుడు ఆకాశంలో తేలిపోకూడదని, ఒక చెడు ఇన్నింగ్స్ ఆడినప్పుడు కుంగిపోకూడదని నేను తెలుసుకున్నాను. బ్యాలెన్స్‌డ్‌గా ఉండటమే నేను నేర్చుకున్న అతిపెద్ద పాఠం" అని అభిషేక్ వివరించాడు. సరిగ్గా అవసరమైన సమయంలో ఫైనల్లో అదరగొట్టి భారత్ కప్పు గెలవడంలో కీలక పాత్ర పోషించిన అభిషేక్ శర్మ.. ఇప్పుడు టీ20 ర్యాంకింగ్స్‌లో నంబర్ 1 స్థానంలో కొనసాగుతున్నాడు. దిగ్గజాల అండదండలతో ఆయన భారత క్రికెట్‌లో ఒక గొప్ప ఓపెనర్‌గా ఎదుగుతున్నాడు.

Story first published: Wednesday, March 18, 2026, 17:18 [IST]
Other articles published on Mar 18, 2026
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+