టీమిండియా ప్రస్తుతం టీ20 ఫార్మాట్లో తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తోంది. 2024 టీ20 వరల్డ్ కప్‌ను గెలుచుకున్న భారత క్రికెట్ జట్టు తాజాగా సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలో 2026 టీ20 ప్రపంచ కప్‌ను కూడా కైవసం చేసుకుని చరిత్ర సృష్టించింది. కేవలం ప్రపంచ కప్పులు మాత్రమే కాకుండా 2025 ఛాంపియన్స్ ట్రోఫీని కూడా భారత్ తన ఖాతాలో వేసుకుంది. ఈ వరుస విజయాల నేపథ్యంలో జట్టును ముందుండి నడిపిస్తున్న సూర్యకుమార్ యాదవ్ అసలు తనకు కెప్టెన్సీ బాధ్యతలు ఎలా దక్కాయో వెల్లడించారు.
ఆకస్మికంగా వచ్చిన ఆ ఫోన్ కాల్
హిట్ మ్యాన్ రోహిత్ శర్మ టీ20 అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన అనంతరం తదుపరి వారసుడు ఎవరనే ఉత్కంఠకు తెరదించుతూ బీసీసీఐ సూర్యకుమార్ యాదవ్ వైపు మొగ్గు చూపింది. శ్రీలంక సిరీస్‌కు కేవలం మూడు నాలుగు రోజుల ముందు అప్పటి బీసీసీఐ కార్యదర్శి జై షా నేరుగా సూర్యకుమార్ యాదవ్‌కు ఫోన్ చేశారట. ఆ కాల్‌లోనే సూర్యను టీ20 జట్టుకు కెప్టెన్‌గా నియమిస్తున్నట్లు అధికారికంగా సమాచారం అందించారని సూర్య వెల్లడించారు. అది తన కెరీర్‌లో అత్యంత కీలకమైన మలుపు అని సూర్య పేర్కొన్నాడు.

రోహిత్ శర్మ, అజిత్ అగార్కర్ మాస్టర్ ప్లాన్
కెప్టెన్సీ ఎంపిక కేవలం జై షా నిర్ణయం మాత్రమే కాదని.. దీని వెనుక ఓ పక్కా ప్లానింగ్ ఉందని సూర్యకుమార్ యాదవ్ వివరించాడు. ముఖ్యంగా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ, చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ ఈ విషయంలో కీలక పాత్ర పోషించారని సూర్య తెలిపారు. రోహిత్ శర్మ తన వారసుడిగా సూర్య అయితేనే జట్టును సరైన దిశలో తీసుకెళ్లగలరని భావించారట. రోహిత్, అగార్కర్ కలిసి చర్చించిన తర్వాతే ఈ ప్రతిపాదనను బీసీసీఐ ముందు ఉంచినట్లు సూర్యకుమార్ యాదవ్ స్పష్టం చేశాడు.
కోచ్‌ల సలహాలు, తుది నిర్ణయం
ఈ నిర్ణయం తీసుకోవడంలో అప్పటి కోచ్ రాహుల్ ద్రవిడ్, ప్రస్తుత కోచ్ గౌతమ్ గంభీర్ అభిప్రాయాలను కూడా పరిగణనలోకి తీసుకున్నారు. గౌతమ్ గంభీర్ బాధ్యతలు చేపట్టకముందే రాహుల్ ద్రవిడ్, జై షాతో కలిసి ఈ విషయంపై సుదీర్ఘ చర్చలు జరిగాయని సూర్యకుమార్ వెల్లడించాడు. రోహిత్ శర్మ అందించిన సలహాలు కోచ్‌ల మద్దతు వెరసి సూర్యను కెప్టెన్సీ పీఠంపై కూర్చోబెట్టాయి. వీరి నలుగురి సమిష్టి నిర్ణయమే భారత్‌కు విజయాలను అందిస్తోందని విశ్లేషకులు భావిస్తున్నారు.
సూర్యకుమార్ యాదవ్ కేవలం కెప్టెన్‌గా ఎంపికవ్వడమే కాకుండా తన రికార్డులతో అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. ఇప్పటివరకు ఆయన సారథ్యంలో భారత్ 52 టీ20 మ్యాచ్‌లు ఆడగా.. ఏకంగా 42 విజయాలను సొంతం చేసుకుంది. కేవలం 10 మ్యాచ్‌లలోనే ఓటమి ఎదురైంది. విశేషమేమిటంటే, సూర్య కెప్టెన్సీలో భారత్ ఇప్పటివరకు ఒక్క ద్వైపాక్షిక టీ20 సిరీస్‌ను కూడా కోల్పోలేదు. మరో 8 విజయాలు సాధిస్తే.. భారత్ తరపున అత్యంత విజయవంతమైన టీ20 కెప్టెన్‌గా సూర్య చరిత్ర పుటల్లోకి ఎక్కుతారు.