మధ్యప్రాచ్యంలో నెలకొన్న యుద్ధ ఉద్రిక్తతలు క్రీడా ప్రపంచంపై ప్రభావం చూపుతున్నాయి. ఇరాన్-ఇజ్రాయెల్ దేశాల మధ్య మధ్య జరుగుతున్న యుద్ధం కారణంగా భారత చెస్ స్టార్ కోనేరు హంపి ఓ సంచలన నిర్ణయం తీసుకున్నారు. సైప్రస్‌లోని పెజియాలో మార్చి 28 నుంచి ప్రారంభం కావాల్సిన ప్రతిష్టాత్మక 'వుమెన్స్ క్యాండిడేట్స్ టోర్నమెంట్' నుంచి ఆమె తప్పుకుంటున్నట్లు ప్రకటించారు.
ఎందుకు ఈ నిర్ణయం?
ప్రస్తుతం మధ్యప్రాచ్యంలో యుద్ధం తీవ్రస్థాయికి చేరుకుంది. అమెరికా-ఇజ్రాయెల్ దాడులకు ప్రతిగా ఇరాన్ జరిపిన డ్రోన్ దాడులు సైప్రస్ వంటి దేశాలను కూడా వణికిస్తున్నాయి. ఈ ఉద్రిక్తతల దృష్ట్యా తన భద్రత గురించి ఆందోళన వ్యక్తం చేస్తూ హంపి ఈ టోర్నీకి వెళ్లకూడదని నిశ్చయించుకున్నారు. ద్వీప దేశమైన సైప్రస్, లెబనాన్ నుంచి కేవలం 150 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడ నుంచే ఇరాన్ మద్దతు ఉన్న హిజ్బుల్లా గ్రూపులు తమ కార్యకలాపాలను సాగిస్తున్నాయి. ఇటీవలే సైప్రస్ లక్ష్యంగా డ్రోన్ దాడులు జరగడం అక్కడ భద్రతాపరమైన సవాళ్లను పెంచింది. ఇలాంటి పరిస్థితుల్లో ఆట కంటే ప్రాణ రక్షణే ముఖ్యమని భావించిన హంపి.. ఈ కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు.

భారత చెస్ వర్గాల్లో చర్చ
కోనేరు హంపి నిర్ణయం భారత క్రీడా వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ప్రతిష్టాత్మకమైన క్యాండిడేట్స్ టోర్నీలో గెలవడం ద్వారా ప్రపంచ ఛాంపియన్‌షిప్ ఆడే అవకాశం ఉంటుంది. అయితే, యుద్ధ వాతావరణం, అనిశ్చితి మధ్య ఏకాగ్రతతో ఆడటం కష్టమని ఆమె భావించినట్లు తెలుస్తోంది. దుబాయ్‌లో సానియా మీర్జా ఎదుర్కొన్న అనుభవాల తరహాలోనే, ఇప్పుడు హంపి కూడా యుద్ధం కారణంగా తన క్రీడా షెడ్యూల్‌ను మార్చుకోవాల్సి వచ్చింది. పరిస్థితులు త్వరగా చక్కబడి క్రీడాకారులు ప్రశాంతమైన వాతావరణంలో పోటీ పడాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.