గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్, దర్శకుడు బుచ్చిబాబు సనా కాంబినేషన్‌లో వస్తున్న 'పెద్ది' సినిమా ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉంది. గ్రామీణ నేపథ్యం, క్రీడా నేపథ్యంలో సాగే ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవల ముగిసిన టీ20 ప్రపంచ కప్‌లో అద్భుతంగా ఆడి ఆకట్టుకున్న తిలక్ వర్మ.. పెద్ది షూటింగ్ జరుగుతున్న సెట్స్‌ను సందర్శించాడు. అక్కడ జరుగుతున్న స్పోర్ట్స్ యాక్షన్ సీక్వెన్స్‌లను చూసి ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేయడమే కాకుండా చిత్ర యూనిట్ పడుతున్న శ్రమను ప్రశంసించాడు.
రామ్‌చరణ్ స్పెషల్ గిఫ్ట్
ఈ పర్యటనలో రామ్‌చరణ్, తిలక్ వర్మ మధ్య జరిగిన సంభాషణ అందరినీ ఆకట్టుకుంది. తిలక్ వర్మకు రామ్‌చరణ్ ఓ ప్రత్యేకమైన బహుమతిని అందించాడు. 'పెద్ది' సినిమా షూటింగ్‌లో ఉపయోగించిన ఓ పాత క్రికెట్ బ్యాట్‌ను గుర్తుగా ఇస్తూ.. దానిపై తన ఆటోగ్రాఫ్‌ను కూడా చేశాడు. ప్రపంచ కప్‌లో తిలక్ వర్మ సాధించిన విజయాలను అభినందిస్తూ.. భవిష్యత్తులో తిలక్ వర్మ మరిన్న శిఖరాలను అధిరోహించాలని రామ్‌చరణ్ ఆకాంక్షించాడు. రామ్ చరణ్ చూపిన ఈ అభిమానానికి తిలక్ వర్మ ఎంతో సంతోషం వ్యక్తం చేశాడు.

హగ్గులు, ముచ్చట్లు.. వీడియో వైరల్!
సెట్స్‌లో రామ్ చరణ్, తిలక్ వర్మ ఒకరినొకరు ఆలింగనం చేసుకుని స్నేహపూర్వకంగా మాట్లాడుకుంటున్న వీడియోను చిత్ర బృందం సోషల్ మీడియాలో పంచుకుంది. "టీ20 వరల్డ్ కప్ ఛాంపియన్ తిలక్ వర్మ మా సెట్స్‌కు రావడం సంతోషంగా ఉంది" అంటూ చిత్రబృందం ట్వీట్ చేసింది. ఈ వీడియో చూసిన మెగా అభిమానులు, క్రికెట్ ప్రేమికులు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. గ్రామీణ క్రీడల నేపథ్యంలో వస్తున్న ఈ సినిమాకు ఒక ప్రొఫెషనల్ క్రికెటర్ ప్రశంసలు దక్కడం సినిమా హైప్‌ను మరింత పెంచింది.
సినిమా విడుదల.. ప్రమోషన్స్
మైత్రీ మూవీ మేకర్స్, వృద్ధి సినిమాస్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన 'చికిరి చికిరి', 'రైరై రారా' వంటి పాటలు చార్ట్‌బస్టర్లుగా నిలిచాయి. భారీ బడ్జెట్‌తో భావోద్వేగపూరితమైన కథతో రూపొందుతున్న 'పెద్ది' చిత్రం ఏప్రిల్ 30న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. వేసవి కానుకగా వస్తున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో వేచి చూడాలి.