న్యూజిలాండ్ స్టార్ క్రికెటర్ గ్లెన్ ఫిలిప్స్ గురించి క్రికెట్ ప్రపంచానికి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. బ్యాటింగ్, బౌలింగ్, వికెట్ కీపింగ్ మాత్రమే కాదు.. మైదానంలో గాల్లో ఎగురుతూ గ్లెన్ ఫిలిప్స్ చేసే అద్భుతమైన ఫీల్డింగ్ విన్యాసాలకు ఫిదా కాని వారు ఉండరు. అందుకే గ్లెన్ ఫిలిప్స్‌ను రియల్ ఆల్‌రౌండర్ అని పిలుస్తారు. అయితే తాజాగా ఈ కివీస్ ఆటగాడు గాలిలో విన్యాసాలు చేస్తూ అందరినీ ఆశ్చర్యపరిచాడు.
సక్సెస్‌ఫుల్ ల్యాండింగ్.. వీడియో వైరల్
2026 టీ20 వరల్డ్ కప్ ముగిసిన అనంతరం కొద్దిపాటి విరామం దొరకడంతో గ్లెన్ ఫిలిప్స్ తన చిరకాల వాంఛ అయిన విమానం నడపడంపై దృష్టి పెట్టాడు. మార్చి 17, మంగళవారం రోజున ఆక్లాండ్‌లోని అర్ట్‌మోర్ ఏరోడ్రోమ్‌లో ఓ చిన్న విమానాన్ని అత్యంత సురక్షితంగా ల్యాండ్ చేశాడు. దీనికి సంబంధించిన వీడియోను గ్లెన్ ఫిలిప్స్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేయడంతో అది కాస్తా వైరల్ అయింది.

కమర్షియల్ పైలట్ కావడమే లక్ష్యం
గ్లెన్ ఫిలిప్స్ ప్రస్తుతం కమర్షియల్ పైలట్ లైసెన్స్ పొందే దిశగా శిక్షణ తీసుకుంటున్నాడు. ఇందులో భాగంగానే అర్డ్‌మోర్ ఫ్లయింగ్ స్కూల్‌లోని విద్యార్థులు, ఇన్స్ట్రక్టర్లతో కలిసి ఆయన సమయాన్ని గడిపాడు. విమానం కాక్‌పిట్‌లో కూర్చుని టెక్నికల్ మూవ్స్‌తో విమానాన్ని కిందికి దించిన తీరు చూస్తుంటే.. ఆయనలో ఓ ప్రొఫెషనల్ పైలట్ కనిపిస్తున్నాడని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.
క్రికెట్ లేకపోతే పైలట్ అయ్యేవాడిని!
తనకు విమానాలు నడపడం అంటే ఎంత ఇష్టమో గ్లెన్ ఫిలిప్స్ గతంలోనే వెల్లడించాడు. "నాకు చిన్నప్పటి నుంచే ఏవియేషన్ అంటే చాలా ఇష్టం. నా దగ్గర గనుక చిన్నప్పటి నుంచి బోలెడంత డబ్బు ఉండి ఉంటే, నేను క్రికెట్‌కు బదులుగా పైలట్ వృత్తినే ఎంచుకునేవాడిని. నాకు గాలిలో ఉండటం, పర్వతాల పైనుంచి విమానం నడపడం అంటే చాలా ప్యాషన్. ఒకవేళ క్రికెట్ తర్వాత నేను ఏదైనా కెరీర్ ఎంచుకోవాల్సి వస్తే, ఖచ్చితంగా పైలట్ అవుతాను" అని ఫిలిప్స్ తన మనసులోని మాటను పంచుకున్నాడు.
గ్లెన్ ఫిలిప్స్ - ది మల్టీ టాలెంటెడ్!
కివీస్ స్టార్ క్రికెటర్ టాలెంట్స్ గురించి అందరికీ తెలిసిందే. పవర్ఫుల్ హిట్టర్, మంచి స్పిన్ బౌలర్, ప్రపంచంలోనే అత్యుత్తు ఫీల్డర్లలో ఒకడు. ఒక్కోసారి జట్టుకు అవసరమైనప్పుడు గ్లౌవ్స్ అందుకునే నమ్మకమైన కీపర్ కూడా. తాజాగా టెక్సికల్ స్కిల్స్ ఉన్న పైలట్‌గా కొత్త అవతారమెత్తాడు.