భారత మహిళా జట్టు విజయంపై అమితాబ్ బచ్చన్ బిగ్ మిస్టేక్

Posted By:
In predective manner amitabh bachchan wished indian women

హైదరాబాద్: భారత మహిళా జట్టుకు శుభాకాంక్షలు తెలియజేయాలని తలచిన బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ పొరబాటుపడ్డారు. ఇటీవల దక్షిణాఫ్రికాలో జరిగిన మహిళల వన్డే సిరీస్‌, టీ 20 సిరీస్‌లను భారత మహిళలు చేజిక్కించుకున్న సంగతి తెలిసిందే. తొలుత వన్డే సిరీస్‌ను 2-1తో గెలిచిన భారత మహిళలు.. టీ 20 సిరీస్‌ను 3-1తో కైవసం చేసుకున్నారు.

ఫలితంగా దక్షిణాఫ్రికాలో రెండు సిరీస్‌లను తొలిసారి భారత్‌ తన ఖాతాలో వేసుకుని చరిత్ర సృష్టించింది. గత నెలలో జరిగిన ద్వైపాక్షిక సిరీస్‌లో భారత మహిళలు అమోఘంగా రాణించి సఫారీలకు షాకిచ్చారు. ఇదిలా ఉంచితే, సోమవారం(మార్చి 12వ తేదీ) నుంచి ఆస్ట్రేలియా-భారత మహిళా క్రికెట్‌ జట్ల మధ్య వన్డే సిరీస్‌ ఆరంభం కానుంది.


ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ జట్లతో భారత్‌ జట్టు ముక్కోణపు టీ 20 సిరీస్‌లో పాల్గొననుంది. భారత్‌ వేదికగా జరిగే ఈ రెండు సిరీస్‌లు జరుగనున్న తరుణంలో బాలీవుడ్‌ ప్రముఖ హీరో అమితాబ్‌ బచ్చన్‌ ఒక ట్వీట్‌ చేశారు. భారత మహిళల విజయాన్ని ఆకాంక్షిస్తూ చేశారో.. లేదా విజయానికి ఆలస్యంగా శుభాకాంక్షలు అందజేశారో కానీ, ట్వీట్‌ను తప్పుగా పోస్ట్‌ చేశారు.

'ఆస్ట్రేలియాపై వన్డే, టీ20 సిరీస్‌లు గెలిచిన భారత జట్టుకు అభినందనలు..బ్యాటింగ్‌,ఫీల్డింగ్‌ల్లో అదరగొట్టి మరీ సిరీస్‌లు సాధించారు' అని ట్వీట్‌ చేశారు. భారత క‍్రీడాకారిణి జెమీమా రోడ్రిగ్స్‌ బౌండరీ లైన్‌పై పట్టిన క్యాచ్‌ను కూడా ఇక్కడ అమితాబ్‌ పేర్కొంటూ ట్వీట్ చేశారు.

అయితే ఇదంతా జరిగింది దక్షిణాఫ్రికాతో సిరీస్‌లో అనే సంగతి మరచిన అమితాబ్‌.. ఆస్ట్రేలియాపై అంటూ ట్వీట్‌ చేయడం అభిమానుల్ని ఆలోచనలో పడేసింది. మరి ఈ ట్వీట్‌ను అమితాబ్‌ సరిచేసుకుంటారో లేదో చూడాలి. ఇప్పటికే అమితాబ్‌ ట్వీట్‌పై నెటిజన్లు జోక్‌ల వర్షం కురిపిస్తున్నారు. ఇంకా ఆసీస్‌తో సిరీస్‌తో ఆరంభం కాకుండానే అమితాబ్‌ భవిష్యత్తును ఊహించి ట్వీట్‌ చేస్తున్నారని ఒక అభిమాని ఫన్నీ రిప్లై ఇవ్వగా, మీరు లెజెండ్‌ సర్‌ అంటూ మరొకరు ట్వీట్‌ చేశారు.

Story first published: Sunday, March 11, 2018, 15:27 [IST]
Other articles published on Mar 11, 2018

Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి