న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

రోహిత్ సెంచరీ: ప్రపంచకప్‌ సెమీఫైనల్లో టీమిండియా, బంగ్లాపై విజయం

ICC Cricket World Cup 2019 : Ind VS Bang Match Highlights : India Beat Bangladesh By 28 Runs
ICC WC 2019: India vs Bangladesh, Live Score: India win by 28 runs, qualify for semi-finals

హైదరాబాద్: ఇంగ్లాండ్ వేదికగా జరుగుతున్న ప్రపంచకప్‌లో భారత్ సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. సమిష్టి ప్రదర్శనతో టైటిల్ వేటలో మరో ముందడుగు వేసింది. బర్మింగ్ హామ్ వేదికగా మంగళవారం బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 28 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ విజయంతో ఈ ప్రపంచకప్‌లో సెమీస్‌కు చేరిన తొలి ఆసియా జట్టుగా టీమిండియా నిలిచింది.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

పూర్తిగా ఏకపక్షంగా సాగుతుందనుకున్న ఈ మ్యాచ్‌లో బంగ్లా అద్భుతంగా పోరాడింది. ఒకానొక దశలో విజయం సాధిస్తుందని కూడా అనుకున్నారంతా. అయితే టీమిండియా బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేయడంతో బంగ్లా ఓటమిపాలైంది. బంగ్లా ఆటగాళ్లు షకీబ్ (66), సైఫుద్దీన్ (51 నాటౌట్) పోరాటం వృథా అయ్యింది. ఈ మ్యాచ్‌లో సెంచరీ సాధించిన రోహిత్‌ శర్మకు ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు లభించింది.

315 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లా

టీమిండియా నిర్దేశించిన 315 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్‌కు పదో ఓవర్‌ నుంచి కష్టాలు మొదలయ్యాయి. చక్కటి షాట్లతో ముందుకు సాగుతున్న ఓపెనర్ తమీమ్ ఇక్బాల్ (22)ను బౌల్డ్ చేసి వికెట్ల పతనానికి నాంది పలికాడు. మరోవైపు యార్కర్ కింగ్ బుమ్రా గంటకు 150 కిలోమీటర్ల వేగంతో బంతులు విసరడంతో తొలి పవర్ ప్లే ముగిసేసరికి బంగ్లా 40/1తో నిలిచింది.

16వ ఓవర్‌ వేసిన హార్దిక్‌ పాండ్యా

16వ ఓవర్‌ వేసిన హార్దిక్‌ పాండ్యా మరో ఓపెనర్ సర్కార్‌ (38 బంతుల్లో 33; 4 ఫోర్లు)ను ఔట్‌ చేయడంతో 74 పరుగుల వద్ద రెండో వికెట్‌ కూలింది. అనంతరం షకీబ్, ముష్ఫికర్‌ జట్టు స్కోరును వందకు చేర్చారు. మూడో వికెట్‌కు 47 పరుగులు జోడించాక ముష్ఫికర్ రహీమ్ (24; 3 ఫోర్లు) వెనుదిరిగినా.. ఒక దశలో బంగ్లా 162/3తో పటిష్టంగానే కనిపించింది.

షకీబ్ హాఫ్ సెంచరీ

అప్పటికే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న షకీబ్ క్రీజులో ఉండటంతో మొర్తజా సేన పోటీలోనే నిలిచింది. అయితే 30వ ఓవర్లో పాండ్యా బౌలింగ్‌లో లిటన్‌ దాస్‌ (24 బంతుల్లో 22; 1 సిక్స్‌) ఔట్‌ కావడంతో బంగ్లా ఆశలు ఆవిరయ్యాయి. 58 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న షకీబ్‌ ఆ తర్వాత ఎక్కువ సేపు క్రీజులో నిలువలేకపోయాడు. వీరిద్దరూ వెంట వెంటనే ఔట్ కావడంతో ఒత్తిడి పెరిగిపోయింది.

పాండ్యా బౌలింగ్‌లో షకీబ్ ఔట్

సాధించాల్సిన రన్‌రేట్ ఎక్కువవుతున్న తరుణంలో పాండ్యా బౌలింగ్‌లో షకీబ్ వెనుదిరిగాడు. టెయిలెండర్లు షబ్బీర్‌ (36 బంతు ల్లో 36; 5 ఫోర్లు), సైఫుద్దీన్‌ కాసేపు పోరాడారు. ఒకే ఓవర్లో రూబెల్‌ (9), ముస్తఫిజుర్‌ (0)లను బౌల్డ్‌ చేసిన బుమ్రా బంగ్లా ఇన్నింగ్స్‌ను ముగించాడు. భారత బౌలర్లలో బుమ్రా(4/55), హార్దిక్‌ పాండ్యా(3/60)లు అద్భుత ప్రదర్శన చేశారు.

బంగ్లాదేశ్ విజయ లక్ష్యం 315

అంతకముందు రోహిత్ శర్మ 92 బంతుల్లో 104(7 ఫోర్లు, 5 సిక్సులు) సెంచరీకి తోడు... కేఎల్ రాహుల్ 92 బంతుల్లో 77(6 ఫోర్లు, ఒక సిక్స్) హాఫ్ సెంచరీతో చెలరేగడంతో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 314 పరుగులు చేసింది. దీంతో బంగ్లాదేశ్‌కు 315 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది.

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్‌

ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్‌కు ఓపెనర్లు శుభారంభం అందించారు. ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ 90 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్సుల సాయంతో సెంచరీని నమోదు చేశాడు. ఈ ప్రపంచకప్‌లో రోహిత్ శర్మకు ఇది నాలుగో సెంచరీ కాగా... మొత్తంగా 26వ సెంచరీ కావడం విశేషం. తద్వారా ప్రపంచకప్‌లో అత్యధిక సెంచరీలు సాధించిన శ్రీలంక మాజీ క్రికెట్ దిగ్గజం కుమార్ సంగక్కర(4 సెంచరీలు) రికార్డుని రోహిత్ శర్మ సమం చేశాడు.

500 పరుగుల మైలురాయిని అందుకున్న రోహిత్

ప్రస్తుత ప్రపంచకప్‌లో రోహిత్ శర్మ ఇప్పటికే 500 పరుగుల మైలురాయిని అందుకున్నాడు. మెగా టోర్నీలో ఇప్పటికే దక్షిణాఫ్రికా, పాకిస్థాన్, ఇంగ్లాండ్‌లపై సెంచరీలు సాధించాడు. ఇప్పుడు బంగ్లాపై సెంచరీతో చెలరేగాడు. షకీబ్ వేసిన 29వ ఓవర్ ఆఖరి బంతికి సింగిల్ తీసి సెంచరీ పూర్తి చేసుకున్న రోహిత్.. సెంచరీ అనంతరం దూకుడుగా ఆడే క్రమంలో రోహిత్ శర్మ 92 బంతుల్లో 104(7 ఫోర్లు, 5 సిక్సులు) సౌమ్య సర్కార్ బౌలింగ్‌లో లిట్టన్ దాస్‌కు క్యాచ్ ఇచ్చాడు.

తొలి వికెట్‌కు 180 పరుగులు

దీంతో జట్టు స్కోరు 180 పరుగుల వద్ద టీమిండియా తొలి వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన కెప్టెన్ విరాట్ కోహ్లీ(26: 27 బంతుల్లో 3ఫోర్లు) ఈ మ్యాచ్‌లో తక్కువ పరుగులకే పెవిలియన్‌కు చేరి నిరాశపరిచాడు. ముస్తాఫిజుర్ వేసిన 39వ ఓవర్లో భారీ షాట్‌కు ప్రయత్నించి డీప్‌ స్కేర్‌లెగ్‌లో రుబెల్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు.

హార్దిక్ పాండ్యా డకౌట్

అనంతరం క్రీజులోకి వచ్చిన ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా(0) కూడా ఎదుర్కొన్న రెండో బంతికే స్లిప్‌లో సౌమ్య సర్కార్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో టీమిండియా ఒకే ఓవర్‌లో రెండు వికెట్లు కోల్పోయింది. ఈ దశలో ధోనీ, పంత్‌లు కలిసి జట్టును ఆదుకొనే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత జట్టు స్కోరు 277 పరుగుల వద్ద రిషబ్ పంత్(48) షకీబ్ ఉల్ హాసన్ బౌలింగ్‌లో హుస్సేన్‌కు క్యాచ్ ఇవ్వడంతో తృటిలో హాఫ్ సెంచరీని మిస్సయ్యాడు.

పంత్ ఔటైన తర్వాత స్కోరు బోర్డులో తగ్గిన వేగం

రిషబ్ పంత్ ఔటైన తర్వాత టీమిండియా స్కోరు బోర్డులో వేగం తగ్గింది. ధోని దూకుడుగా ఆడే ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. ఆఖరి ఓవర్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించి 35 పరుగులు వ్యక్తిగత స్కోర్ వద్ద ముస్తాఫిజుర్ రెహ్మాన్ బౌలింగ్‌లో షకీబ్ ఉల్ హాసన్‌కు క్యాచ్ ఇచ్చాడు. చివర్లో భువనేశ్వర్ రనౌట్ కాగా, ఆఖరి ఓవర్ ఆఖరి బంతికి షమీ బౌల్డయ్యాడు.

5 వికెట్లు తీసిన ముస్తాఫిజుర్ రెహ్మాన్

దీంతో నిర్ణీత 50 ఓవర్లలో భారత్ 9 వికెట్ల నష్టానికి 314 పరుగులు చేసింది. బంగ్లాదేశ్ బౌలర్లలో ముస్తాఫిజుర్ రెహ్మాన్ 5 వికెట్లు తీసి అద్భుత ప్రదర్శన చేయగా... షకీబ్ ఉల్ హాసన్, రుబెల్ హుస్సేన్, సౌమ్య సర్కార్ తలో వికెట్ తీసుకున్నారు.

Story first published: Wednesday, July 3, 2019, 7:14 [IST]
Other articles published on Jul 3, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X