ఐపీఎల్ ప్రైజ్ మనీ మొత్తం వారికే: కోల్‌కతా కెప్టెన్ గంభీర్

Posted By:

హైదరాబాద్: ఈ ఐపీఎల్‌లో సీజన్‌లో తాను అందుకునే అవార్డుల ద్వారా లభించే నగదుని సుకమా జిల్లాలో మావోయిస్టుల కాల్పుల్లో మృతి చెందిన జవాన్ల కుటుంబాలకు అందజేస్తానని కోల్‌కతా నైట్‌రైడర్స్ కెప్టెన్ గౌతం గంభీర్‌ ప్రకటించాడు. ఐపీఎల్ పదో సీజన్‌లో భాగంగా శుక్రవారం కోల్‌కతా, ఢిల్లీ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది.

ఈ మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 161 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన కోల్‌కతా 16.3 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేధించింది. ఈ మ్యాచ్‌లో గంభీర్ గంభీర్ (71 నాటౌట్‌) కెప్టెన్స్ ఇన్నింగ్స్ ఆడాడు. దీంతో మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు అందుకున్నాడు.

అవార్డు అందుకున్న సమయంలో గంభీర్ మాట్లాడుతూ ఈ సీజన్‌లో అవార్డుల ద్వారా అందుకునే నగదు మొత్తాన్ని మృతుల కుటుంబాలకు అందజేయనున్నట్లు తెలిపాడు. 'ఇప్పటి నుంచి ఐపీఎల్‌లో నేను అందుకునే అవార్డుల ద్వారా దక్కే నగదు మొత్తాన్ని సుకమా జిల్లాలో మావోయిస్టుల కాల్పుల్లో మృతి చెందిన జవాన్ల కుటుంబాలకు అందజేస్తాను' అని గంభీర్‌ మ్యాచ్ అనంతరం ప్రకటించాడు.

ఛత్తీస్‌గఢ్‌లోని సుకమా జిల్లాలో ఏప్రిల్‌ 24న మావోయిస్టుల కాల్పుల్లో 25మంది సీఆర్‌పీఎఫ్‌ జవాన్లు మృతి చెందిన సంగతి తెలిసిందే. మృతి చెందిన జవాన్ల పిల్లల చదువుకు అయ్యే ఖర్చును గౌతమ్‌ గంభీర్‌ ఫౌండేషన్‌ భరిస్తోందని గంభీర్‌ తెలిపాడు. దీనికి సంబంధించి తన గౌతమ్‌ గంభీర్‌ ఫౌండేషన్‌ ద్వారా ఇప్పటికే చర్యలు మొదలు పెట్టినట్లు తెలిపాడు. జవాన్ల ఊచకోత, పత్రికల్లో వచ్చిన వారి కుమార్తెల చిత్రాలు తనను కలచివేశాయని గంభీర్‌ చెప్పాడు.

కాగా, సీఆర్‌పీఎఫ్‌ 74వ బెటాలియన్‌కు చెందిన 150 మంది జవాన్లు బస్తర్‌లోని కాలాపత్తర్‌ ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న ఓ రహదారి వద్ద భద్రతాపరమైన తనిఖీలు నిర్వహిస్తుండగా మావోయిస్టులు మెరుపుదాడి చేశారు. ఈ దాడిలో 25 మంది జవాన్లు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.

Story first published: Saturday, April 29, 2017, 17:07 [IST]
Other articles published on Apr 29, 2017

Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి