ఒకప్పుడు టీమిండియా అత్యుత్తమ ఫీల్డింగ్ ఉన్న జట్లలో ఒకటి. కానీ ఇప్పుడు చేతుల్లోకి వచ్చిన క్యాచ్‌లు వదిలేయడంలో నెంబర్ వన్ జట్టు. బంగ్లాదేశ్‌తో జరుగుతున్న వన్డే సిరీస్‌లో కూడా ఈ పరంపరను టీమిండియా కొనసాగిస్తోంది. తొలి వన్డేలో కేఎల్ రాహుల్, వాషింగ్టన్ సుందర్‌లు క్యాచులు పట్టుకోలేకపోతే.. మిగతా వాళ్లు తాము కూడా ఉన్నామని చూపించుకోవడానికి మిస్ ఫీల్డ్‌లు చేసి బంగ్లా జట్టుకు అదనపు పరుగులు ఇచ్చారు.
రెండో వన్డేలో అయినా టీమిండియా బుద్ధి తెచ్చుకుంటుందని అభిమానులు అనుకున్నారు. కానీ అలాంటి పనులు తాము చేయమని టీమిండియా మరోసారి రుజువు చేసింది. ఇన్నింగ్స్ రెండో ఓవర్‌లోనే అనాముల హక్ ఇచ్చిన క్యాచ్‌ను సెకండ్ స్లిప్స్‌లో ఉన్న రోహిత్ జారవిడిచాడు. ఈ క్రమంలో అతని బొటనవేలికి గాయం కూడా అయింది. ఆ తర్వాత కాసేపటికి వాషింగ్టన్ సుందర్ బౌలింగ్‌లో షకీబల్ హసన్ (8) బంతిని స్లాగ్ స్వీప్ చేయడానికి ప్రయత్నించాడు. కానీ ఎడ్జ్ తీసుకున్న బంతి.. బ్యాటర్ వెనుక వైపు గాల్లోకి లేచింది.
స్లిప్స్‌లో ఉన్న ధవన్ దాన్ని అందుకోవడానికి వేగంగా కుడి వైపు వెళ్లాడు. అదే సమయంలో షార్ట్ ఫైన్ లెగ్‌లో ఉన్న సిరాజ్ తన ఎడమ వైపుకు పరిగెత్తుకు వచ్చాడు. ఇద్దరూ ఢీ కొట్టినంత పనైంది. అయితే చివరకు కొంత తడబడినా ధవన్ క్యాచ్ అందుకోవడంతో షకీబల్ హసన్ పెవిలియన్ చేరాడు.
ఇది చూసిన ఫ్యాన్స్ మాత్రం టీమిండియా ఫీల్డింగ్‌పై మండి పడుతున్నారు. అంతర్జాతీయ మ్యాచుల్లో ఇలా క్యాచ్ పట్టే సమయంలో ఢీ కొట్టుకోవడాలు, సులభమైన క్యాచులను నేలపాలు చేయడం ఎక్కువగా పాకిస్తాన్ చేస్తుంటుంది. ఇప్పుడు భారత్ కూడా పాక్ ఫీల్డింగ్‌కు పోటీ ఇస్తోందని, అత్యంత చెత్త ఫీల్డింగ్ ఎవరిదని ఏమైనా పోటీ పడుతున్నారా? అని ఫ్యాన్స్ అడుగుతున్నారు.