ఐపీఎల్ 2018: విరాట్ కోహ్లీ, రోహిత్‌ శర్మలను దాటేసిన రహానే

Posted By:
Ajinkya Rahane

హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో అజ్యింకె రహానే అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. జైపూర్ వేదికగా బుధవారం ఢిల్లీ డేర్‌ డెవిల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్‌ రాయల్స్‌ కెప్టెన్ అజ్యింకె రహానే 40 బంతుల్లో 5 ఫోర్ల సాయంతో 45 పరుగులు సాధించాడు. ఈ క్రమంలో హాఫ్ సెంచరీ మిస్సయ్యాడు.

ఐపీఎల్ 2018 స్పెషల్ వెబ్ సైట్ | ఐపీఎల్ 2018 పూర్తి షెడ్యూల్

తద్వారా ఢిల్లీ డేర్‌డెవిల్స్‌పై అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. ఇప్పటి వరకూ 670 పరుగులు చేసిన రోహిత్ శర్మ పేరిట ఈ రికార్డు ఉండగా ఇప్పుడు దానిని రహానే అధిగమించాడు. రహానే ఢిల్లీపై మొత్తం 677 పరుగులు చేశాడు. ఢిల్లీపై 661 పరుగులతో విరాట్ కోహ్లీ మూడో స్థానంలో ఉన్నాడు.

రాబిన్‌ ఉతప్ప 551 పరుగులతో నాలుగో స్థానంలో కొనసాగుతుండగా... సురేశ్‌ రైనా 491 పరుగులతో ఐదో స్థానంలో కొనసాగుతున్నాడు. ఇక్కడ విశేషం ఏంటంటే ఐపీఎల్‌లో మిగతా ఏ జట్లపై కూడా రహానే 500కిపైగా పరుగులు చేయకపోవడం. ఈ మ్యాచ్‌లో 40 బంతుల్లో 45 పరుగులు చేసిన రహానే ఢిల్లీ బౌలర్ నదీమ్ బౌలింగ్‌లో క్రిస్ మోరిస్‌కి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.

షాట్ ఎంపికలో రహానే తడబడగా.. బ్యాట్ ఎడ్జ్‌ను తాకుతూ బంతి పాయింట్‌లో ఉన్న మోరిస్ చేతిలో పడింది. దీంతో 13.4 ఓవర్లలో రాజస్థాన్ 112 పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పోయింది. ఇదిలా ఉంటే ఢిల్లీ డేర్ డెవిల్స్‌, రాజస్థాన్ రాయల్స్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌ వర్షం కారణంగా వాయిదా పడింది.

ఈ మ్యాచ్‌లో ఢిల్లీ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకోవడంతో తొలుత బ్యాటింగ్‌కి దిగిన రాజస్థాన్ జట్టు నదీమ్ వేసిన రెండో ఓవర్‌లో ఓపెనర్ షార్ట్ వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత కొంత సమయానికే బెన్‌స్టోక్స్ బౌల్ట్ బౌలింగ్‌లో కీపర్ రిషబ్ పంత్‌కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఈ నేపథ్యంలో కెప్టెన్ అజింక్యా రహానే, సంజూ శామ్సన్ జట్టును ఆదుకొనే ప్రయత్నం చేశారు.

అయితే నదీమ్ వేసిన 11వ ఓవర్ ఆఖరి బంతికి సంజూ(37), 13.4 ఓవర్‌లో రహానే(45) పెవిలియన్ చేరారు. అనంతరం బట్లర్ షమీ(29) బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. అయితే 18వ ఓవర్ ఆఖరి బంతి సమయంలో వర్షం కురుస్తుండటంతో అంపైర్లు మ్యాచ్‌ను నిలిపివేశారు. మ్యాచ్ నిలిచిపోయే సమయానికి రాజస్థాన్ రాయల్స్ 5 వికెట్లు కోల్పోయి 153 పరుగులు చేసింది. క్రీజులో రాహుల్ త్రిపాఠి(15), కృష్ణప్ప గౌతమ్(2) ఉన్నారు.

రికెట్ అంటే ఇష్టమా? నిరూపించు! మైఖేల్ ఫాంటసీ క్రికెట్ ఆడు

Story first published: Wednesday, April 11, 2018, 23:21 [IST]
Other articles published on Apr 11, 2018

Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి