ఎనిమిదోసారి ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ నెగ్గిన జొకోవిచ్‌!!

మెల్‌బోర్న్‌: సెర్బియా వీరుడు నొవాక్‌ జొకోవిచ్‌ రికార్డు స్థాయిలో ఎనిమిదోసారి ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ పురుషుల సింగిల్స్‌ చాంపియన్‌గా నిలిచాడు. రాడ్‌లేవర్‌ ఎరీనాలో ఆదివారం 3 గంటల 59 నిమిషాల పాటు జరిగిన ఫైనల్లో రెండో సీడ్‌ జొకోవిచ్‌ 6-4, 4-6, 2-6, 6-3, 6-4తో ఐదో సీడ్‌ డొమినిక్‌ థీమ్‌ (ఆస్ట్రియా)పై విజయం సాధించాడు. ఐదు సెట్లుగా జరిగిన మ్యాచ్‌ ఎన్నో మలుపులు తిరిగినా.. జొకోదే పైచేయి అయింది. జొకోవిచ్‌ కెరీర్‌లో ఇది 17వ గ్రాండ్‌స్లామ్‌ సింగిల్స్‌ టైటిల్‌కాగా.. ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో ఎనిమిదోది.

మొదటి సెట్‌ను జొకో సునాయాసంగా గెలుచుకోగా.. రెండో సెట్‌లో 4-4తో స్కోరు సమమైన దశనుంచి విజృంభించిన 26 ఏళ్ల థీమ్‌ వరుసగా ఆరు పాయింట్లు కైవసం చేసుకొని సెట్‌ను సొంతం చేసుకున్నాడు. ఇదే ఊపులో మూడో సెట్‌ను కూడా గెలిచాడు. నాలుగో సెట్‌లోనూ 3-4 స్కోరు వరకు థీమ్‌ ఆధిపత్యం చెలాయించాడు. ఇక్కడ నుంచి పరిస్థితి పూర్తిగా మారిపోయింది. తన అనుభవాన్ని ఉపయోగించిన జొకో.. రెండు సెట్లతో పాటు మ్యాచ్‌ను సొంతం చేసుకొని టైటిల్‌ను గెలుచుకున్నాడు. జొకో మ్యాచ్‌లో 9 ఏస్‌లు ,46 విన్నర్లు కొట్టాడు. 57 అనవసర తప్పిదాలు చేశాడు. 13 ఏస్‌లు సంధించిన థీమ్‌.. 55 విన్నర్లు కొట్టి 57 అనవసర తప్పిదాలకు పాల్పడ్డాడు.

ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ టోర్నీ తుది పోరులో ఇప్పటి వరకు ఓటమెరుగని రికార్డును 32 ఏళ్ల జొకోవిచ్‌ కొనసాగించాడు. మెల్‌బోర్న్‌ పార్క్‌లో ఫైనల్‌కు ప్రవేశించిన ఎనిమిదిసార్లూ అతడు విజేతగా నిలిచాడు. గ్రాండ్‌స్లామ్‌ టైటిళ్ల సంఖ్యలో తన (17) కంటే ముందున్న రోజర్ ఫెదరర్‌ (20), రఫెల్ నాదల్‌ (19)ను మరింత సమీపించాడు. ఇక ఓపెన్‌ ఎరాలో మూడు విభిన్న దశకాల్లో గ్రాండ్‌స్లామ్‌లు (2000, 2010, 2020) గెలిచిన తొలి ఆటగాడిగా జొకోవిచ్‌ రికార్డుల్లోకి ఎక్కాడు.

తాజా విజయంతో జొకోవిచ్‌ సోమవారం విడుదల చేసే ప్రపంచ టెన్నిస్‌ ర్యాంకింగ్స్‌లో నాదల్‌ నుంచి మళ్లీ నంబర్‌వన్‌ ర్యాంక్‌ను అందుకోనున్నాడు. విజేత జొకోవిచ్‌కు 41 లక్షల 20 వేల ఆస్ట్రేలియన్‌ డాలర్లు (రూ. 19 కోట్ల 71 లక్షలు), రన్నరప్‌ డొమినిక్‌ థీమ్‌కు 20 లక్షల 65 వేల ఆస్ట్రేలియన్‌ డాలర్లు (రూ. 9 కోట్ల 88 లక్షలు) ప్రైజ్‌మనీగా లభించాయి.

'ప్రపంచంలోనే నా ఫేవరెట్‌ కోర్ట్‌, స్టేడియం (మెల్‌బోర్న్‌) ఇదే. థీమ్‌ విజయానికి చేరువగా వచ్చాడు. త్వరలోనే గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ గెలుస్తాడని కచ్చితంగా చెబుతున్నా' అని జొకోవిచ్‌ అన్నాడు. 'జొకోవిచ్‌, ఫెదరర్‌, నాదల్‌ టెన్నిస్‌ను మరోస్థాయికి తీసుకెళ్లారు. ఈ కాలంలో నేను ఆడుతున్నందుకు చాలా సంతోషంగా ఉన్నా. ఈ రోజు ఓడిపోయా. త్వరలోనే జొకోతో మళ్లీ పోటీపడుతానని ఆశిస్తున్నా' అని థీమ్‌ పేర్కొన్నాడు.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Monday, February 3, 2020, 8:27 [IST]
Other articles published on Feb 3, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X