కామన్వెల్త్: స్వర్ణం నెగ్గిన వినేశ్ ఫోగట్‌, హాఫ్‌సెంచరీ దాటిన భారత్

Posted By:
 Vinesh Phogat wins 50kg gold; Sakshi Malik bags bronze

హైదరాబాద్: గోల్డ్ కోస్ట్ వేదికగా జరుగుతోన్న కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్ తన పతకాల జోరుని కొనసాగిస్తోంది. శనివారం జరిగిన పోటీల్లో మన రెజ్లర్లు స్వర్ణ పతకాలను గెలవగా... మహిళల ఫ్రీ స్టయిల్ 50 కేజీల విభాగంలో వినేశ్ పోగట్ స్వర్ణ పతకం సాధించింది. దీంతో ఒక్క శనివారమే భారత క్రీడాకారులు ఐదుకుపైగా స్వర్ణ పతకాలు సాధించారు.

మహిళల 50 కేజీల విభాగంలో వినేశ్ ఫోగట్ కెనడాకు చెందిన జెస్సికా మెక్‌డొనాల్డ్‌ను ఓడించి స్వర్ణం కైవసం చేసుకుంది. తద్వారా కామన్వెల్త్ గేమ్స్‌లో రెండు స్వర్ణాలు సాధించిన ఏకైక మహిళా రెజ్లర్‌గా వినేశ్ ఫోగట్ చరిత్ర సృష్టించింది. 2014లో గ్లాస్కో వేదికగా జరిగిన కామన్వెల్త్ గేమ్స్‌లో 48 కేజీలో విభాగంలో స్వర్ణం నెగ్గిన సంగతి తెలిసిందే.

కాంస్య పతకం నెగ్గిన సాక్షి మాలిక్

ఇక, రియో ఒలింపిక్ పతక విజేత సాక్షి మాలిక్ ఈ కామన్వెల్త్ గేమ్స్‌లో కాంస్య పతకంతో సరిపెట్టుకుంది. వినేశ్ ఫోగట్ చేతిలో ఓటమి పాలైన జెస్సికా మెక్‌డొనాల్డ్‌ 2010లో ఢిల్లీ వేదికగా జరిగిన కామన్వెల్త్ గేమ్స్‌లో కాంస్య పతకం సాధించింది. అంతేకాదు 2012లో జరిగిన వరల్డ్ ఛాంపియన్‌షిప్స్ టైటిల్‌ను కూడా గెలుచుకుంది.

పసిడి నెగ్గిన మేరీ కోమ్

శనివారం ఇప్పటివరకు భారత్ 52 పతకాలతో పట్టికలో మూడో స్థానాన్ని మరింత సుస్థిరం చేసుకుంది. శనివారం ఉదయం బాక్సర్ మేరీకోమ్ పసిడి పతకంతో భారత్‌‌‌ని మురిపించగా.. అనంతరం బాక్సర్ గౌరవ్ సోలంకి మరో స్వర్ణంతో ఆ ఆనందాన్ని రెట్టింపు చేశాడు. ఆ తర్వాత పురుషుల 50మీ రైఫిల్ త్రీ పొజిషన్స్ ఈవెంట్‌లో సంజీవ్ రాజ్‌పుత్ స్వర్ణం నెగ్గాడు.

చరిత్ర సృష్టించిన నీరజ్ చోప్రా

అనంతరం కొద్దిసేపటికే జావెలిన్ త్రోలో నీరజ్ చోప్రా స్వర్ణం నెగ్గి చరిత్ర సృష్టించాడు. రెజ్లరు వినేశ్ పొగట్, సుమిత్ పసిడితో భారత్‌ స్వర్ణాల సంఖ్యని 23కి పెంచారు. ప్రస్తుతం పతకాల పట్టికలో మూడో స్థానంలో భారత్ ఖాతాలో 23 స్వర్ణాలతో పాటు 13 రజతాలు, 16 కాంస్యాలతో కలిపి మొత్తం 52 పతకాలు ఉన్నాయి.

హాఫ్ సెంచరీ దాటిన భారత పతకాల సంఖ్య

ఈ జాబితాలో ఆస్ట్రేలియా 179 పతకాలతో అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. ఇంగ్లాండ్ 114 పతకాలతో రెండో స్థానంలో ఉంది. భారత్ తర్వాత స్థానంలో ఉన్న కెనడా ఖాతాలో 79 పతకాలు ఉన్నప్పటికీ, పసిడి పతకాల్లో వ్యత్యాసం కారణంగా భారత్‌ మూడో స్థానంలో కొనసాగుతోంది. కెనడా ఖాతాలో ప్రస్తుతం 14 స్వర్ణాలు ఉన్నాయి.

Story first published: Saturday, April 14, 2018, 15:17 [IST]
Other articles published on Apr 14, 2018

Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి