కామన్వెల్త్ గేమ్స్: డ్రాగా ముగిసిన భారత్-పాక్ మ్యాచ్

Posted By:
CWG hockey: Pakistan fight back late to hold India

హైదరాబాద్: ఆస్ట్రేలియాలోని గోల్డ్ కోస్ట్ వేదికగా జరుగుతోన్న కామన్వెల్త్ గేమ్స్‌లో భాగంగా శనివారం భారత్-పాకిస్థాన్ జట్లు తలపడ్డాయి. చివరి వరకు ఉత్కంఠగా సాగిన పురుషుల హాకీ మ్యాచ్ చివరకు డ్రాగా ముగిసింది. ఏ క్రీడలోనైనా భారత్-పాక్ మ్యాచ్ అంటే ఉంటే ఆసక్తే వేరు.

కామన్వెల్త్ గేమ్స్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇందులో భాగంగా శనివారం జరిగిన భారత్-పాక్ హాకీ మ్యాచ్‌కి ఆస్ట్రేలియా అభిమానులు పెద్ద ఎత్తున స్టేడియానికి చేరుకున్నారు. చివరి వరకు విజయం తమదే అన్న ధీమాతో ఉన్న భారత్‌కు చివరి ఏడు సెకన్లలో గోల్‌ చేసి పాకిస్థాన్‌ షాక్‌ ఇచ్చింది. దీంతో మ్యాచ్‌ డ్రాగా ముగిసింది.

ఆట ప్రారంభం నుంచి భారత ఆటగాళ్లు దూకుడుగా ఆడారు. ఫస్ట్ హాఫ్‌లోనే టీమిండియా రెండు గోల్స్ చేసింది. 13వ నిమిషంలోనే దిల్‌ప్రీత్‌ సింగ్‌ భారత్‌ తరఫున తొలి గోల్‌ నమోదు చేశాడు. అనంతరం 19వ నిమిషంలో హర్మన్‌ప్రీత్‌ సింగ్ రెండో గోల్‌ సాధించాడు. దీంతో మ్యాచ్‌పై భారత్‌ పట్టు సాధించింది.

ఆ తర్వాత భారత ఆటగాళ్లు దూకుడుగా ఆడుతూ పలుమార్లు పాక్ గోల్ పోస్టుపై దాడులకు యత్నించారు. అయితే భారత దాడులకు పాక్ విఫలయత్నం చేసింది. తొలి అర్థభాగంలో డల్‌గా ఉన్న పాక్ ఆటగాళ్లు రెండో అర్ధభాగంలో చెలరేగారు. ఈ క్రమంలో ఆట 38వ నిమిషంలో పాక్‌ ఆటగాడు మహమ్మద్‌ ఇర్ఫాన్‌ తొలి గోల్‌ చేసి భారత్ ఆధిక్యాన్ని తగ్గించాడు.

మరో నిమిషంలో మ్యాచ్‌ ముగుస్తుంది. భారత్‌దే విజయం ఖాయమనుకున్న వేళ, చివర్లో పాక్ ఆటగాడు ముబాషర్‌ అలీ పెనాల్టీ కార్నర్ ద్వారా గోల్‌ చేయడంతో 2-2తో మ్యాచ్‌ను డ్రాగా ముగించాడు. దీంతో భారత్‌ ఆశలపై నీళ్లు చల్లాడు. పూల్‌-బిలో భారత్‌ పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో కొనసాగుతోంది.

మరోవైపు పాకిస్థాన్ మూడో స్థానంలో కొనసాగుతోంది. ఇదిలా ఉంటే 2014లో గ్లాస్గో వేదికగా జరిగిన కామన్వెల్త్‌ గేమ్స్‌ భారత పురుషుల హాకీ జట్టు రజతం గెలిచిన సంగతి తెలిసిందే.

Story first published: Saturday, April 7, 2018, 13:17 [IST]
Other articles published on Apr 7, 2018

Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి