కామన్వెల్త్ గేమ్స్: భారత్ ఖాతాలో మరో స్వర్ణం, మెరిసిన సతీశ్‌ కుమార్‌ శివలింగం

Posted By:
Sathish Kumar Sivalingam

హైదరాబాద్: ఆస్ట్రేలియాలోని గోల్డ్ కోస్ట్ వేదికగా జరుగుతోన్న కామన్వెల్త్ గేమ్స్‌లో భారత వెయిట్ లిఫ్టర్లు సత్తా చాటుతున్నారు. తాజాగా, వెయిట్‌లిఫ్టింగ్‌ పోటీల్లో భారత్ మరో స్వర్ణాన్ని కైవసం చేసుకుంది. శనివారం జరిగిన 77 కేజీల విభాగంలో సతీశ్‌ కుమార్‌ శివలింగం స్వర్ణ పతకం కైవసం చేసుకున్నాడు.

తమిళనాడుకు చెందిన సతీశ్ కుమార్‌ శివలింగం ఈ విభాగంలో మొత్తం 317 కిలోల బ‌రువు ఎత్తి కాంస్యాన్ని కైవ‌సం చేసుకున్నాడు. స్నాచ్‌లో గరిష్టంగా 144 కిలోలు ఎత్తిన సతీశ్‌.. క్లీన్ అండ్ జెర్క్‌లో 173 కిలోలు ఎత్తాడు. తాజా పతకంతో.. కామన్వెల్త్ 2018లో భారత్ పతకాల సంఖ్య ఐదుకు చేరింది.

ప్రస్తుతం భారత్ ఖాతాలో మూడు స్వర్ణాలు, ఒక రజతం, ఒక కాంస్య పతకం ఉన్నాయి. తమిళనాడులోని వెల్లూరుకు చెందిన సతీశ్ 2013లో కామన్వెల్త్ గేమ్స్‌లోనూ స్వర్ణం సాధించిన సంగతి తెలిసిందే. ఇప్పటివరకు భారత్ సాధించిన ఐదు పతకాలు వెయిట్ లిఫ్టింగ్‌లోనే కావడం విశేషం.

రెండోరోజైన శుక్రవారం మహిళల 53 కేజీల విభాగంలో సంజితా చాను స్వర్ణం సాధించింది. వెయిట్ లిఫ్టింగ్‌లో గురువారం కూడా భారత్‌కి రెండు పతకాలు వచ్చిన విషయం తెలిసిందే. మహిళల 48 కేజీల విభాగంలో పోటీపడిన మీరాబాయి చాను మొత్తం 196 కిలోలు ఎత్తి బంగారు పతకాన్ని గెలుపొందగా.. పురుషుల 56 కేజీల విభాగంలో పోటీపడిన గురురాజా రజతం సాధించాడు.

భారత్‌కు స్వర్ణం అందించిన సతీశ్ కుమార్‌ శివలింగంపై సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురుస్తోంది.

Story first published: Saturday, April 7, 2018, 8:33 [IST]
Other articles published on Apr 7, 2018

Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి