న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Commonwealth Games 2022: నిజామాబాద్ బిడ్డతో సహా ఇండియాకు మెడల్స్ అందించగల టాప్ 5 క్రీడాకారులు వీరే

Commonwealth Games 2022: Top 5 Indian Medal Contenders At Barmingham CWG

గత సంవత్సరం టోక్యోలో జరిగిన ఒలింపిక్ క్రీడలలో భారత్ అత్యుత్తమ ప్రదర్శనను సాధించిన తర్వాత.. జూలై 28 నుంచి ఇంగ్లాండ్‌లోని బర్మింగ్‌హామ్‌లో ప్రారంభమయ్యే కామన్వెల్త్ గేమ్స్‌లోనూ సత్తా చాటాలని భారత అథ్లెటిక్ స్క్వాడ్ తహతహలాడుతోంది. ఆసియా క్రీడలు 2023కి వాయిదా పడడంతో భారత అగ్రశ్రేణి అథ్లెటిక్ హీరోలు బర్మింగ్‌హామ్‌లో జరగనున్న కామన్ వెల్త్ గేమ్స్‌కు అందుబాటులో ఉంటారు. ఇక ఆస్ట్రేలియాలోని గోల్డ్ కోస్ట్‌లో జరిగిన 2018కామన్‌వెల్త్ గేమ్స్‌లో 3వ స్థానంలో నిలిచిన భారత్ 26బంగారు పతకాలతో సహా 66పతకాలను గెలుచుకుంది. ఇక 2010లో ఢిల్లీలో జరిగిన కామన్వెల్త్ గేమ్స్‌లో ఇండియా మొత్తం 101పతకాలను గెలుచుకుని కామన్ వెల్త్‌లో తొలిసారి రెండోస్థానంలో నిలిచిన సంగతి తెలిసిందే. ఇకపోతే బర్మింగ్‌హామ్‌లో జరగనున్న కామన్వెల్త్ క్రీడల జాబితా నుంచి షూటింగ్‌ను తొలగించడంతో భారత్ పతకాల సంఖ్య పడిపోయే అవకాశం ఉంది. కామన్‌వెల్త్ గేమ్స్ షూటింగ్‌ క్రీడాలో ఇప్పటివరకు అన్ని ఎడిషన్లలో కలిపి 135పతకాలను భారత్ సాధించింది. ఇకపోతే ఈసారి సీడబ్ల్యూజీలో భారత్‌కు టాప్ మెడల్ కంటెండర్స్ గురించి ఓసారి పరిశీలిస్తే..

 నీరజ్ చోప్రా

నీరజ్ చోప్రా

కామన్‌వెల్త్ గేమ్స్‌లో భారత్‌కు స్వర్ణం అందించే అథ్లెట్‌గా నీరజ్ చోప్రాపై ఆశలు బానే ఉన్నాయి. టోక్యో ఒలింపిక్స్‌లో భారత్‌కు స్వర్ణం అందించిన నీరజ్ జావెలిన్ త్రోలో భారత్‌కు స్వర్ణం అందించే అవకాశాలున్నాయి. ఇటీవల స్టాక్‌హోమ్‌లో జరిగిన డైమండ్ లీగ్‌లో 89.94మీటర్ల వ్యక్తిగత అత్యుత్తమ త్రోను నమోదు చేసిన ఈ హర్యానా అథ్లెట్ తన జాతీయ రికార్డును తానే బద్దలు కొట్టిన సంగతి తెలిసిందే.

పీవీ సింధు

పీవీ సింధు

భారత బ్యాడ్మింటన్ స్టార్లు కామన్వెల్త్ గేమ్స్‌లో అదరగొట్టే అవకాశముంది. థామస్ కప్‌లో బ్యాడ్మింటన్ పురుషుల జట్టు చరిత్రాత్మక విజయం సాధించిన తర్వాత మెన్స్ టీంపై కూడా పతకం అందించే ఆశలు ఉన్నాయి. ఇక 2018లో స్వర్ణం గెలిచిన మిక్స్‌డ్ టీం మరోసారి పతకాన్ని అందించే వీలుంది. 2018మహిళల సింగిల్స్ స్వర్ణ పతక విజేత సైనా నెహ్వాల్ ఈసారి అంత ప్రభావవంతంగా కన్పించడం లేదు. ఇక ఫోకస్ అంతా పీవీ సింధుపైనే ఉంది. ఆమె 2014 కామన్ వెల్త్ గేమ్స్‌లో కాంస్యం, 2018లో రజతం అందించింది. 3వ సారి కామన్ వెల్త్ గేమ్స్‌లో స్వర్ణాన్ని ఒడిసిపట్టాలని సింధు చూస్తోంది. ఇక మెన్స్ పరంగా సింగిల్స్‌లో కిదాంబి శ్రీకాంత్, లక్ష్య సేన్, హెచ్ఎస్ ప్రణయ్ పతక ఆశలు రేకెత్తిస్తున్నారు. డబుల్స్‌లో సాత్విక్‌సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ శెట్టి జంట కూడా పతకం అందించే అవకాశాలున్నాయి.

 మీరాబాయి చాను

మీరాబాయి చాను

కామన్వెల్త్ గేమ్స్‌లో వెయిట్ లిఫ్టింగ్ విషయంలో ఇప్పటివరకు భారత్ 125పతకాలను సాధించింది. 2018లో ఐదు స్వర్ణాలతో సహా మొత్తం తొమ్మిది పతకాలను భారత అథ్లెట్లు గెలుచుకున్నారు. ఇక ఈసారి 15మంది వెయిట్‌లిఫ్టర్‌లు బర్మింగ్‌హామ్‌కు బయలుదేరుతున్నారు. ఈ బృందం భారత్‌కు మరోసారి పతకాల పంట పండించే అవకాశముంది. ఒలింపిక్స్ స్టార్ మీరాబాయి చాను బర్మింగ్‌హామ్‌లో గోల్డ్ మెడల్ గెలవడం దాదాపు నల్లేరు మీద నడకే. ఆమె పతకం గెలిస్తే కామన్ వెల్త్ గేమ్స్‌లో ఆమెకు మూడో పతకం అవుతుంది. ఇక మహిళల 49 కేజీల విభాగంలో మీరాబాయి వ్యక్తిగత అత్యుత్తమ స్కోరు 207కేజీలు కాగా.. ఆమె సమీప ప్రత్యర్థి అయిన నైజీరియాకు చెందిన స్టెల్లా కింగ్స్లీ అత్యుత్తమ స్కోరు 168కిలోలే. దీంతో మీరాబాయి చానుకు గోల్డ్ ఖాయమనిపిస్తుంది.

రవి దహియా

రవి దహియా

టోక్యో ఒలింపిక్స్‌‌లో రజత పతకం సాధించిన రవి దహియా మీద కూడా పతక ఆశలు బానే ఉన్నాయి. 57కేజీల విభాగంలో కామన్వెల్త్ గేమ్స్‌కు ఈ రెజ్లర్ అర్హత సాధించాడు. మంగోలియాలోని ఉలాన్‌బాటర్‌లో జరిగిన ఆసియా రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్‌లో బంగారు పతకాన్ని గెలుచుకున్న రవి దహియా.. కామన్ వెల్త్ గేమ్స్ కోసం సిద్ధమవుతున్నాడు. అలాగే కామన్వెల్త్ గేమ్స్‌లో తన 3వ పతకాన్ని గెలుచుకోవాలని బజరంగ్ పునియా చూస్తున్నాడు. బజరంగ్ టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్యం గెలుచుకున్నాడు.

నిఖత్ జరీన్..

నిఖత్ జరీన్..

నిజామాబాద్ బిడ్డ నిఖత్ జరీన్ ఇండియాకు మరో బాక్సింగ్ సూపర్‌స్టార్‌గా అవతరిస్తుంది. ఈ యువ బాక్సర్ 50 కేజీల విభాగంలో పోటీ పడేందుకు కామన్వెల్త్ గేమ్స్‌కు వెళుతుంది. మేలో ఇస్తాంబుల్‌లో జరిగిన ప్రపంచ ఛాంపియన్‌షిప్ టైటిల్‌ను గెలుచుకున్నందున నిఖత్‌పైన పతక ఆశలు ఎక్కువగా ఉన్నాయి. నిఖత్‌తో పాటు టోక్యో ఒలింపిక్స్ కాంస్య పతక విజేత లోవ్లినా బోర్గోహైన్ కూడా పతక రేసులో ఉంది. లోవ్లినా 70కిలోల విభాగంలో పోటీపడుతుంది.

వీళ్లే కాకుండా చాలా మంది ఇండియన్ అథ్లెట్లు కామన్ వెల్త్ గేమ్స్‌లో సత్తా చాటి భారత్‌కు పతకాల పంట పండించాలని చూస్తున్నారు.

Story first published: Thursday, July 21, 2022, 15:02 [IST]
Other articles published on Jul 21, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X