కామన్వెల్త్ గేమ్స్: 12 ఏళ్ల తర్వాత స్వర్ణం నెగ్గిన భారత పురుషుల జట్టు

Posted By:
Commonwealth Games 2018: India Beat Nigeria, Claim Table Tennis Mens Team Gold After 12 Years

హైదరాబాద్: ఆస్ట్రేలియాలోని గోల్డ్ కోస్ట్ వేదికగా జరుగుతోన్న కామన్వెల్త్ గేమ్స్‌లో భారత క్రీడాకారులు వరుస పెట్టి పతకాలు సాధిస్తున్నారు. సోమవారం జరిగిన పోటీల్లో పురుషుల డబుల్స్‌ టేబుల్‌ టెన్నిస్‌( టీటీ)లో భారత్‌ బృందం అచంట శరత్‌, సాతియన్‌ జ్ఞానశేఖరన్‌, హర్మీత్‌ దేశాయ్‌ స్వర్ణం నెగ్గారు.

దీంతో గోల్డ్‌కోస్ట్ కామన్వెల్త్ గేమ్స్‌లో భారత స్వర్ణాల సంఖ్య 9కి చేరగా పతకాల సంఖ్య 18కి చేరింది. అంతేకాదు 12 ఏళ్ల తర్వాత భారత పురుషుల టేబుల్ టెన్నిస్ జట్టు స్వర్ణం గెలిచింది. టీమ్ ఈవెంట్‌లో భాగంగా సోమవారం జరిగిన పోటీల్లో భారత్ జట్టు నైజీరియాతో తలపడింది.

ఫైనల్లో భారత జట్టు 3-0 తేడాతో విజయం సాధించి స్వర్ణాన్ని కైవసం చేసుకుంది. తొలి మ్యాచ్‌లో అచంట శరత్‌ కమల్‌ 4-11, 11-5, 11-4, 11-9 లతేడాతో బోడే అబియోడన్‌ను ఓడించడంతో భారత్‌కు ఆధిక్యం లభించింది. ఇక, రెండో గేమ్‌లో సత్యన్‌ జ్ఞానశేఖర్‌ 10-12, 11-3, 11-3, 11-4 తేడాతో సెగన్‌ టోరిలియోపై నెగ్గాడు.

దీంతో భారత్‌ 2-0తో పై చేయి సాధించింది. ఇక మూడో గేమ్‌ డబుల్స్‌లో జ్ఞానశేఖరన్‌, హర్మీత్‌ దేశాయ్‌ల జోడి 11-8,11-5,11-3ల తేడాతో ఓలాజిడ్‌ ఓమాతియో, అబియోడన్‌ జంటను ఓడించడంతో భారత్‌కు స్వర్ణ పతకం ఖాయమైంది. ఈ గేమ్స్‌లో భారత్ ఇప్పటివరకు 9 స్వర్ణాలు, 4 రజతాలు, 5 కాంస్య పతకాలు నెగ్గింది.

దీంతో పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో కొనసాగుతోంది. 38 స్వర్ణ పతకాలతో ఆస్ట్రేలియా అగ్రస్థానంలో కొనసాగుతుండగా, 22 పతకాలతో ఇంగ్లాండ్ రెండో స్థానంలో కొనసాగుతోంది. కాగా, సోమవారం ఉదయం జరిగిన పురుషుల 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ విభాగంలో భారత్‌కు చెందిన జీతూరాయ్‌ స్వర్ణం గెలుచుకోగా, ఓమ్‌ ప్రకాశ్ మితర్వాల్‌ కాంస్యం సాధించిన సంగతి తెలిసిందే.Story first published: Monday, April 9, 2018, 17:01 [IST]
Other articles published on Apr 9, 2018

Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి