ఈ ఏడాది సెప్టెంబర్‌లో జరగాల్సిన మెగా టోర్నీ 'ఆసియా గేమ్స్'ను 2023కి వాయిదా వేస్తున్నట్లు ఒలింపిక్ కౌన్సిల్ ఆఫ్ ఆసియా (OCA) తాత్కాలిక అధ్యక్షుడు రణధీర్ సింగ్ శుక్రవారం ప్రకటించారు. వివిధ రకాల క్రీడలను నిర్వహించే ఈ మెగాటోర్నీ 19వ ఎడిషన్ సెప్టెంబరులో నిర్వహించాలని తొలుత నిర్వాహకులు భావించారు. ఇక సమ్మర్ ఒలింపిక్స్ గేమ్స్ లాంటి టోర్నీ ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్ఠాత్మకమైన మెగా టోర్నీ కాగా.. ఒలింపిక్స్‌తో పోల్చితే ఆసియా గేమ్స్ రెండో అతిపెద్ద మెగా టోర్నీగా పేర్కొనబడింది.
#BREAKING Asian Games 2022 postponed: Chinese state media pic.twitter.com/ALWriYqes6
— AFP News Agency (@AFP) May 6, 2022
ఇక ఈసారి ఆసియా గేమ్స్ షాంఘైకి నైరుతి దిశలో 175కిలోమీటర్ల దూరంలో ఉన్న జెజియాంగ్ ప్రావిన్స్ రాజధాని హంగ్‌జౌ సిటీలో ఈ ఏడాది సెప్టెంబర్ 10వ తేదీ నుంచి 25వ తేదీ వరకు జరగాల్సి ఉంది. అయితే సడెన్‌గా ఆసియా గేమ్స్ వాయిదాపడడానికి కారణాన్ని మాత్రం నిర్వాహకులు అధికారికంగా వెల్లడించలేదు. అయితే కోవిడ్-19 వ్యాప్తి కారణంగా చైనాలోని షాంఘై సిటీలో లాక్‌డౌన్ అమలవుతుంది. ఈ నేపథ్యంలో కరోనా వ్యాప్తిని కట్టడి చేయడానికి చైనా అధికారులు తీవ్ర చర్యలు చేపడుతున్నారు. కోవిడ్ ఫోర్త్ వేవ్ కారణంగా టోర్నీ నిర్వహణలో ఇబ్బందులు తలెత్తుతాయన్న ఆందోళనతో ఈ టోర్నీని నిర్వాహకులు వాయిదా వేసినట్లు తెలుస్తోంది.
'ఆసియా గేమ్స్'ను ప్రతి నాలుగు సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. ఈ టోర్నీలో ఆసియా ఖండంలోని దేశాల క్రీడాకారులు, అథ్లెట్ల మధ్య పోటీలు జరుగుతాయి. ఇది మల్టీ స్పోర్ట్స్ ఈవెంట్. భారతదేశంలోని న్యూ ఢిల్లీలో మొట్టమొదటి ఆసియా గేమ్ ఈవెంట్ జరిగింది. 1978వరకు ఆసియన్ గేమ్స్ ఫెడరేషన్ (AGF) ఈ టోర్నీని నిర్వహించేది. ఇక 1982నుంచి ఒలింపిక్ కౌన్సిల్ ఆఫ్ ఆసియా (OCA)చే ఈ టోర్నీ నిర్వహించబడుతుంది. ఈ క్రీడలను అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (IOC) గుర్తించింది. ఒలింపిక్ క్రీడల తర్వాత రెండో అతిపెద్ద మల్టీ-స్పోర్ట్స్ ఈవెంట్‌గా దీన్ని పేర్కొంటారు.
ఇప్పటివరకు ఆసియా క్రీడలకు తొమ్మిది దేశాలు ఆతిథ్యం ఇచ్చాయి. 46దేశాల నుంచి క్రీడాకారులు, అథ్లెట్లు ఆసియా గేమ్స్ టోర్నీలో పాల్గొంటారు. గత ఆసియా గేమ్స్ టోర్నీ ఇండోనేషియాలోని జకార్తా, పాలెంబాంగ్‌లో జరిగాయి. 2018 ఆగస్టు18 నుంచి సెప్టెంబర్ 2వరకు ఈ టోర్నీ జరిగింది. ఇక తర్వాతి ఆసియా టోర్నీ ఈ ఏడాది సెప్టెంబర్ 10 నుంచి 25వ తేదీ వరకు చైనాలోని హాంగ్‌జౌలో జరగాల్సి ఉంది. కానీ తాజాగా 2023 ఏడాదికి ఈ టోర్నీ వాయిదాపడింది.