సెమీస్ దాకా వెళ్లి.. చివరి వరకూ పోరాడి.. తలవంచిన హాకీ టీమ్

టోక్యో: జపాన్‌లో కొనసాగుతోన్న టోక్యో ఒలింపిక్స్‌‌లో 12వ రోజు భారత్ పరాజయాలను చవి చూస్తోంది. భారత స్టార్ జావెలిన్ థ్రోయర్ అన్ను రాణి తీవ్రంగా నిరాశ పరిచారు. మహిళల జావెలిన్ థ్రో విభాగంలో ఆమె సత్తా చాటలేకపోయారు. ఆ వెంటనే- ప్రతిష్ఠాత్మంగా భావించిన పురుషుల హాకీ మ్యాచ్‌లోనూ భారత జట్టు ఓడిపోయింది. ప్రపంచ నంబర్ 3 ర్యాంక్‌లో ఉన్న బెల్జియం చేతిలో ఓడిండి భారత్. చివరి వరకూ కొదమసింహంలా పోరాడినప్పటికీ.. పరాజయం నుంచి తప్పించుకోలేకపోయింది. 5-2 గోల్స్ తేడాతో మన్‌ప్రీత్ సింగ్ టీమ్ అపజయంతో తన ప్రస్థానాన్ని ముగించింది.

 ఫైనల్స్ ఆశలు ఆవిరి..

ఫైనల్స్ ఆశలు ఆవిరి..

గ్రూప్ దశ, క్వార్టర్ ఫైనల్స్‌లో తిరుగులేని విజయాలను అందుకుంటూ వచ్చిన హాకీ ఇండియా.. పతకాన్ని అందుకోవడానికి ఒక్క విజయం దూరంలో ఆగిపోయింది. సెమీ ఫైనల్ నాలుగో క్వార్టర్స్‌లో బెల్జియం విజృంభించింది. ఆ ఒక్క క్వార్టర్‌లోనే మూడు గోల్స్ సాధించడంతో భారత్‌కు పరాజయం తప్పలేదు. దీనితో ఫైనల్స్ ఆశలు ఆవిరి అయ్యాయి. అయినప్పటికీ మూడో స్థానం కోసం భారత్ మరో మ్యాచ్ ఆడాల్సి ఉంది. ఈ మ్యాచ్‌లో విజయాన్ని అందుకుంటే.. భారత్‌కు కాంస్య పతకం ఖాయమౌతుంది. కాంస్య పతకం కోసం ఆస్ట్రేలియా లేదా జర్మనీతో భారత తలపడాల్సి ఉంటుంది.

స్కోర్ సమం చేసి..

స్కోర్ సమం చేసి..

భారత కాలమానం ప్రకారం.. ఈ ఉదయం 7 గంటలకు బెల్జియంతో సెమీ ఫైనల్ మ్యాచ్ ఓఐ స్టేడియం నార్త్ పిచ్ మీద ఆరంభమైంది. తొలి క్వార్టర్‌ నుంచే రెండు జట్లు కూడా తమ ప్రత్యర్థులపై గోల్ పోస్ట్‌లపై దాడులు మొదలు పెట్టాయి. ఇందులో తొలుత బెల్జియం విజయం సాధించింది. మ్యాచ్ ప్రారంభమైన రెండో నిమిషంలోనే గోల్ సాధించిందా టీమ్. లుయిపెర్ట్ గోల్ చేశాడు. దీనితో ప్రత్యర్థి జట్టు 0-1 గోల్స్ తేడాతో ఆధిక్యాన్ని అందుకుంది. మ్యాచ్ పదో నిమిషంలో భారత్ గోల్ కొట్టింది. స్టార్ అటాకర్ హర్మన్‌ప్రీత్ సింగ్ గోల్ చేశాడు. ఈ టోర్నీలో అతనికి ఇది అయిదో గోల్. దీనితో భారత్ 1-1 తేడాతో స్కోర్‌ను సమం చేసింది.

ఆధిక్యతను సాధించి..

ఆధిక్యతను సాధించి..

ఆ తరువాత రెండే రెండు నిమిషాల్లోనే భారత్ మరో గోల్ సాధించింది. ఈ సారి మన్‌దీప్ సింగ్ కొట్టిన షాట్‌కు బంతి బుల్లెట్ కంటే వేగంతో బెల్జియం గోల్ కీపర్‌ను దాటుకుంటూ నెట్స్‌ను ముద్దాడింది. దీనితో భారత్ 2-1 గోల్స్ తేడాతో ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. అది ఎంతో సేపు నిలవలేకపోయింది. 7:17 నిమిషంలో భారత్‌ తనకు అందిన పెనాల్టీ కార్నర్ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఉంటే గేమ్ మరోలా ఉండేదేమో. పెనాల్టీ కార్నర్‌ను బెల్జియం గోల్ కీపర్ సమర్థవంతంగా అడ్డుకున్నాడు. తొలి క్వార్టర్ ముగిసే సరికి భారత్ 2-1 గోల్స్ తేడాతో ఆధిక్యతలో నిలిచింది. దాన్ని కొనసాగించలేకపోయింది.

 రెండో క్వార్టర్‌లో గోల్‌తో..

రెండో క్వార్టర్‌లో గోల్‌తో..

రెండో క్వార్టర్‌లో బెల్జియం కొన్ని పెనాల్టీ కార్నర్లను దక్కించుకున్నప్పటికీ.. భారత గోల్ కీపర్ శ్రీజేష్ అద్భుతంగా వాటిని అడ్డుకోవడంతో ఆటలు సాగలేదు. అదే సమయంలో దురదృష్టం వెంటాడింది. ఆ కొద్దిసేపటికే బెల్జియం గోల్ సాధించింది. ఆ జట్టు స్టార్ ప్లేయర్ హెండ్రిక్స్ గోల్ కొట్టాడు. దీనితో ఆధిక్యత సమం అయింది. థర్డ్ క్వార్టర్‌లో రెండు జట్లు కూడా హోరాహోరీగా పోరు సాగించాయి. ఒకరిపై ఒకరు పైచేయి సాధిస్తూ వచ్చారే తప్ప గోల్‌‌పోస్ట్‌ చేరలేకపోయారు ప్లేయర్లు. కళ్లు చెదిరే పాసింగ్స్‌తో మ్యాచ్‌ను రసవత్తరంగా మార్చేశారు. హైఓల్టేజ్‌లో సాగిందీ క్వార్టర్.

 నాలుగో క్వార్టర్‌లో తిరుగులేని బెల్జియం..

నాలుగో క్వార్టర్‌లో తిరుగులేని బెల్జియం..

మ్యాచ్ నాలుగో క్వార్టర్‌లోకి చేరిన తరువాత.. దాని స్వరూపమే పూర్తిగా మారిపోయింది. ఒకరకంగా బెల్జియం ఈ దశలో మ్యాచ్ మొత్తాన్నీ తన గుప్పిట్లోకి తీసుకున్నట్లు కనిపించింది. ఆధిక్యతను ఏ మాత్రం చెక్కు చెదరనివ్వలేదు. ప్రత్యేకించి హెండ్రిక్స్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. వరుస గోల్స్ సాధించుకుంటూ వెళ్లాడు. అతన్ని అడ్డుకోవడానికి, అతని దూకుడుకు కళ్లెం వేయడానికి భారత్ వద్ద ఎలాంటి వ్యూహాలు లేవనిపించేంతగా చెలరేగిపోయాడతను. ఈ ఒక్క క్వార్టర్‌లోనే గోల్స్ మీద గోల్స్ చేశాడు.

గోల్స్ హ్యాట్రిక్..

గోల్స్ హ్యాట్రిక్..

నాలుగో క్వార్టర్ ఆరంభమైన కొద్దిసేపటికే హెండ్రిక్స్ గోల్ చేశాడు. దీనితో బెల్జియం ఆధిక్యత 3-2కు పెరిగింది. అక్కడితో ఆగలేదతను. చివరి పది నిమిషాల్లో రెండు గోల్స్ సాధించాడు. నాలుగో క్వార్టర్ సగానికి వచ్చేసరికి నాలుగో గోల్ సాధించింది బెల్జియం. బెల్జియం ఆటగాళ్లను కట్టి పడేయడానికి భారత్ శక్తివంచన లేకుండా ప్రయత్నించారు. డిఫెన్సివ్, అటాకింగ్ గేమ్‌ను సమానంగా కొనసాగించారు. అవేవీ ఫలించలేదు. ఆధిక్యతను తగ్గించలేదు. మ్యాచ్ మూడు నిమిషాల్లో ముగుస్తుందనగా హెండ్రిక్స్ మరో గోల్ కొట్టాడు. దీనితో ఆధిక్యత 5-2కు దూసుకెళ్లింది.

సెమీ ఫైనల్స్‌లో ఓడిపోయినప్పటికీ భారత హాకీ జట్టు ప్రస్థానం ఇంకా ముగియలేదు. ఎందుకంటే- మూడో స్థానం కోసం తన పోరాటాన్ని కొనసాగించాల్సి ఉంది. ఈ మూడో స్థానంలో హాకీ ఇండియా విజయం సాధించగలిగితే- కాంస్య పతకాన్ని ముద్దాడుతుంది. అదే జరిగితే- ఈ ఒలింపిక్స్‌లో భారత మరో పతకాన్ని అందుకున్నట్టవుతుంది. దీనికోసం భారత జట్టు ఆస్ట్రేలియా లేదా జర్మనీని ఢీ కొట్టాల్సి ఉంటుంది. ఈ రెండు కూడా బలమైన జట్లే. గ్రూప్ దశలో ఆస్ట్రేలియా చేతిలో భారత జట్టు 1-7 గోల్స్ తేడాతో పరాజయాన్ని చవి చూసిన విషయం తెలిసిందే. కాంస్య పతకం కోసం ఆస్ట్రేలియాతో తలపడాల్సి ఉంటుందా? లేక జర్మనీనా అనేది ఇంకా ఖరారు కావాల్సి ఉంది.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Tuesday, August 3, 2021, 8:57 [IST]
Other articles published on Aug 3, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X