అజ్లాన్‌ షా టోర్నీ: భారత్‌కు షాకిచ్చిన ఐర్లాండ్, 2-3తో ఓటమి

Posted By:
Azlan Shah Cup hockey: Ireland stun India with 3-2 win; India ruled out of final

హైదరాబాద్: మలేసియాలోని ఇఫో వేదికగా జరుగుతోన్న అజ్లాన్‌షా హాకీ టోర్నమెంట్‌లో భారత్‌కు ఊహించని షాక్ తగిలింది. శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో భారత్‌ 2-3 గోల్స్‌తో ఐర్లాండ్‌ చేతిలో ఓటమి పాలైంది. దీంతో ఛాంపియన్ జట్లపై గెలిచి ఔరా అనిపించిన భారత్, బలహీన ప్రత్యర్థి చేతిలో ఓడి టైటిల్‌ రేస్‌ నుంచి వైదొలగి విమర్శల పాలైంది.

గత మ్యాచ్‌లో మలేసియాపై విజయం సాధించిన భారత జట్టు, శుక్రవారం నాటి మ్యాచ్‌లో అవకాశాలను సొమ్ము చేసుకోలేక ఐర్లాండ్‌ చేతిలోఓటమి పాలైంది. ఈ మ్యాచ్‌లో రెండుసార్లు (10వ ని, 26వ ని) ఆధిక్యంలో నిలిచిన భారత్‌... 2-3తో మ్యాచ్‌ను కోల్పోవడం సగటు అభిమాని జీర్ణించుకోలేని విషయం.

ఐర్లాండ్‌ చేతిలో భారత్‌ ఓడడం ఇదే తొలిసారి కావడం విశేషం. మ్యాచ్‌ పదో నిమిషంలో లభించిన పెనాల్టీకార్నర్‌ను వరుణ్‌ కుమార్‌ సద్వినియోగం చేయడంతో భారత్‌ 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఆ తర్వాత షేన్‌ డొనొగె (24వ ని) కొట్టిన గోల్‌తో ఐర్లాండ్‌ స్కోరు సమం చేసింది.

అయితే వారి ఆనందాన్ని ఆవిరి చేస్తూ మరో రెండు నిమిషాలకే అమిత్‌ రోహిదాస్‌ గోల్‌ సాధించడంతో భారత్‌ 2-1తో మరోసారి ఆధిక్యంలో నిలిపాడు. ఆ తర్వాత ఐర్లాండ్ వరుసదాడికి దిగి అవకాశాలను సృష్టించుకుంది. ఈ క్రమంలో సీన్‌ ముర్రే (36వ ని) కొట్టిన గోల్‌తో ఐర్లాండ్ స్కోరు సమం చేసింది.

షేన్‌ డొనొగె (42వ ని) మరోసారి పెనాల్టీకార్నర్‌ను గోల్‌గా మలచడంతో 3-2తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఆ తర్వాత స్కోరుని సమం చేసేందుకు భారత్ చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఈ ఓటమితో పతకం రేసు నుంచి భారత్ నిష్క్రమించింది. ఇప్పుడిక టోర్నీలో 5,6 స్థానాలకోసం తలపడనుంది.

సర్దార్‌ సింగ్‌ కెప్టెన్సీలో భారత్‌ తొలిసారి పతకం లేకుండా వెనుదిరుగడం ఇదే తొలిసారి. అతడి కెప్టెన్సీలో గతంలో జరిగిన 2008లో రజతం, 2015, 2016లో కాంస్య, రజతాలు గెలుచుకుంది.

Story first published: Saturday, March 10, 2018, 10:24 [IST]
Other articles published on Mar 10, 2018

Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి